చౌటుప్పల్, న్యూస్‌లైన్ : ఫ్లోరైడ్ మహమ్మారిని రూపుమాపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పరిశోధనలు జరిపేందుకు చౌటుప్పల్ మండలం మల్కాపురంలో ఏర్పాటు చేయదలచిన జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రంపై ఈ నెల 21న తుది నిర్ణయం తీసుకోనున్నట్టు రాష్ట్ర శాసనసభా స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తెలిపారు. ‘సాక్షి’ దినపత్రికలో ‘ఫ్లోరైడ్‌కు విరగడేది..?’ శీర్షికన బుధవారం ప్రచురితమైన కథనానికి ఆయ న స్పందించారు.
ఈ సందర్భంగా స్పీకర్ బుధవారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రంలో ఫ్లోరోసిస్ బాధితులకు వైద్యసేవలు అందించేందుకు 75పడకల ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. 6రాష్ట్రాలకు కేంద్రంగా ఈ పరిశోధన కేంద్రం పనిచేస్తుందన్నారు. గతంలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ముక్తేశ్వరరావు ఫ్లోరైడ్ నివారణకు చిత్తశుద్ధితో పనిచేశారని అభినందించారు. నవంబర్‌లో సదరన్ క్యాంపు నిర్వహించి 10వేల మంది ఫ్లోరోసిస్ బాధితులను పరిక్షించారన్నారు. వీరిలో 2400మంది పెన్షన్‌కు అర్హులుగా గుర్తించారన్నారు.
పస్తుతం 8,917మంది బాధితులకు నెలకు రూ.500చొప్పున పెన్షన్‌ను చెల్లిస్తున్నారన్నారు. 720మందికి అంత్యోదయ కార్డులను కూడా ఇప్పించామని చెప్పారు. 17మండలాల్లోని 1,127అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు గుడ్ల పంపిణీ జరుగుతుందని వివరించారు. నాలుగైదు రోజుల క్రితమే యూనిసెఫ్ ప్రతినిధులను పంపి, ఫ్లోరైడ్ బాధితులకు అందిస్తున్న పథకాలను గూర్చి నివేదిక తెప్పించుకున్నానన్నారు. ఫ్లోరోసిస్ బాధితులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారన్నారు. వారికి చేయాల్సింది ఎంతో ఉందన్నారు. ఫ్లోరోసిస్ బాధితుల సమస్యలను ఫోకస్ చేసిన ‘సాక్షి’ పత్రికను అభినందించారు.
ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రంపై 21న తుది నిర్ణయం
Published Thu, Sep 5 2013 5:38 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement