మాట్లాడుతున్న చెరుకు సుధాకర్, ప్రజాసంఘాల నాయకులు
సాక్షి, నల్గొండ : తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన కుమారుడు నిర్వహిస్తున్న జిల్లా కేంద్రంలోని నవ్య ఆస్పత్రిపై అక్రమంగా కేసులను పెట్టి సీజ్ చేశారని ఆయా సంఘాల నేతలు, రాజకీయ పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక నవ్య హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, విద్యావంతుల వేదిక నాయకులు పందుల సైదులు, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్‌రెడ్డి మాట్లాడారు. అతితక్కువ ఫీజులతో నిరుపేదలకు వైద్యం అందిస్తున్న నవ్య ఆస్పత్రి నిర్వాహకులు, డాక్టర్ చెరుకు సుధాకర్ కుమారుడు డాక్టర్ సుహాస్‌పై పోలీసులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి అత్యుత్సాహంతో వివిధ సెక్షన్ల కింద కేసులను నమోదు చేసి సీజ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఏకపక్షంగా ఎలా సీజ్ చేస్తారని వారు ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటుగా జిల్లాకేంద్రంలోని పలు ఆస్పత్రులపై ఫిర్యాదులు వందల సంఖ్యలో వచ్చినప్పటికీ ఎందుకు ఆయా ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తక్కువ ఫీజులతో పేదలకు వైద్యం చేయడం నేరమా అన్నారు. కేవలం నవ్య హాస్పిటల్ బడుగు, బలహీనవర్గాలకు చెందిన వ్యక్తిది కావడంతో పాటుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకగా ఉన్న డాక్టర్ చెరుకు సుధాకర్‌పై రాజకీయంగా అణిచివేతలో భాగమే అక్రమ కేసులు, ఆస్పత్రిని సీజ్ చేయడమన్నారు. వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించి డాక్టర్‌పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవడంతో పాటుగా హాస్పిటల్ సీజ్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ కుట్రలో భాగమే : చెరుకు
ఆస్పత్రిలో తక్కువ ఫీజులతో పేదలకు వైద్యం అందిస్తున్న డాక్టర్‌పై అక్రమంగా కేసులను పెట్టి అరెస్టు చేయడంతో పాటుగా ఆస్పత్రిని సీజ్ చేయడం దేశ చరిత్రలో ఎక్కడా చూడలేదని డాక్టర్ చెరుకు సుధాకర్ తెలిపారు. రాజకీయంగా తనపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం కుట్రపన్నిందని ఆరోపించారు. ఆత్మబలిదానాలతో సాధించుకున్న రాష్ట్రంలో ఇంతటి దుర్మార్గమైన చర్యలు ఉంటాయని ఆనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేసులను ఎత్తివేసి సీజ్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు మానుపాటి భిక్షం, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇందూరు సాగర్, ఎంఆర్‌పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు బకరం శ్రీనివాస్‌మాదిగ, కట్టెల శివకుమార్, ఏర్పుల శ్రవన్‌కుమార్, జనార్దన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment