డబ్బు కోసం రోగిని చంపేశాడు
కమలాకర్ ఆస్పత్రి వద్ద మృతురాలి బంధువుల ఆందోళన
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్
కంబాలచెరువు (రాజమహేం ద్రవరం) : ఆపరేషన్ చేస్తే చనిపోతుందని తెలిసి కూడా.. డబ్బుకు కక్కుర్తి పడి వివాహిత మృతికి ఆస్పత్రి వైద్యుడు కారకుడయ్యాడంటూ మృతురాలి బంధువులు స్థానిక దానవాయిపేటలోని కమలాకర్ ఆస్పత్రి వద్ద సోమవారం ఆందోళన చేశారు. మృతురాలి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. జొన్నాడకు చెందిన మార్తమ్మ(28) ఆరోగ్యం బాగోక కడియం మండలం బుర్రిలంకలో ఉంటున్న ఆమె తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. వారు ఆమెను బొల్లినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి గుండెలో రంధ్రం ఉందని, దానిని ఎంవీఆర్‌గా నిర్ధారించారు. ఆపరేషన్ చేయకూడదని మందులిచ్చి పంపేశారు. తర్వాత వారు దానవాయిపేటలోని కమలాకర్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యుడు కట్టా కమలాకర్ ఆమెను పరీక్షించి, ఆపరేషన్ చేస్తే నయమవుతుందని, రూ.1.50 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అదీ ఆరోగ్యశ్రీ ద్వారా వస్తుందనడంతో, ఆమె కుటుంబసభ్యులు సరేనన్నారు. ఈ నెల 6న ఆపరేషన్ చేయగా, రెండు రోజులైనా రోగి వద్దకు ఎవరినీ అనుమతించలేదు. సోమవారం ఆమె మృతిచెందిందని తెలిపారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వచ్చి వైద్యుడిని నిలదీశారు. ఆపరేషన్ సమయంలో మార్తమ్మ సహకరించలేదని, దీంతో కొన్ని వైర్లు ఊడిపోయాయని, యూరిన్ ఆగిపోవడంతో ఆమె చనిపోయిందని తెలిపారు. ‘ఆపరేషన్ చేసినా బతకలేదు.. మేమేం చేస్తాం’ అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని వారు వాపోయారు. కేవలం ఆరోగ్యశ్రీ డబ్బులకు కక్కుర్తిపడి, రోగి మృతికి కారకులయ్యారంటూ కడియం సర్పంచ్ ఓరా రాము పోలీసులకు వివరించారు. మృతురాలి ముగ్గురు పిల్లలకు న్యాయం చేయాలన్నారు. దీనిపై ఫిర్యాదుచేస్తే విచారణ చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.