నా భర్తను అన్యాయంగా చంపారు
నా భర్తను అన్యాయంగా చంపారు
Published Tue, Aug 2 2016 12:04 AM | Last Updated on Tue, Oct 16 2018 8:03 PM
మారయ్య భార్య మంగమ్మ
చింతూరు :
ఏ పాపం ఎరుగని తన భర్తను మావోయిస్టులు అన్యాయంగా చంపారని మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన పాస్టర్ వుయికా మారయ్య భార్య మంగమ్మ ఆరోపించింది. సోమవారం ఆమె తన కుటుంబ సభ్యులతో కలసి విలేకరులతో మాట్లాడుతూ.. కళ్లెదుటే తన భర్తను తీవ్రంగా కొట్టారని, తన భర్త మరణంతో తాను, తన బిడ్డలు ఎంతో మనోవేదన చెందుతున్నట్టు విలపించింది. ఏ తప్పూ చేయని తన భర్తను ఎందుకు చంపాల్సి వచ్చిందో మావోయిస్టులు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేసింది. మృతుడు మారయ్య సోదరుడు కన్నయ్య మాట్లాడుతూ ఇతర రాష్ట్రం నుంచి వచ్చి దైవసూక్తులు చెప్పుకుంటూ బతుకుతున్నామని, తనతో పాటు ఇతర సోదరులకు పోలీసులతో సంబంధాలున్నాయంటూ ఒక సోదరుడు మారయ్యను మావోయిస్టులు దారుణంగా చంపారని పేర్కొన్నాడు.
పోలీసులతో మాకు ఎలాంటి సంబంధాలు లేవు
తమకు పోలీసులతో ఎలాంటి సంబంధాలు లేవని, కనీసం హెచ్చరిక కూడా చేయకుండానే తన సోదరుడిని హతమార్చడం ఎంతవరకు న్యాయమని కన్నయ్య ప్రశ్నించాడు. అక్రమంగా సంపాదిస్తున్నామని తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని రుజువు చేస్తే.. వారికే తిరిగిచ్చేస్తామని ప్రకటించారు. గతంలో తన కొడుకును కూడా మావోయిస్టులు కిడ్నాప్ చేశారని తెలిపాడు. చర్చి ద్వారా వృద్ధులు, రోగులు, అనాథలకు సేవ చేస్తున్న తమను మావోయిస్టులు టార్గెట్ చేయడం సబబు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుడైన తన సోదరుడిని అన్యాయంగా హతమార్చడంపై మావోయిస్టులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాడు. ఈ సమావేశంలో మారయ్య సోదరులు రాజు, ముత్తయ్య, లక్ష్మయ్య, కొడుకులు రాజు, దావీదు, సులోమాను పాల్గొన్నారు.
పాస్టర్ హత్య హేయమైన చర్య
మారేడుమిల్లి : పాస్టర్‌ను మావోయిస్టులు హతమార్చడం హేయమైన చర్య అని రంపచోడవరం ఏఎస్పీ నయీం ఆస్మీ అన్నారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో సోమవారం ఆయన విలేకరులతోlమాట్లాడుతూ మావోయిస్టులు హింసను వీడి, జనజీవనంలో కలవాలని పిలుపునిచ్చారు. అమాయక ప్రజలను హతమార్చడం మానుకోవాలని హితవుపలికారు. వారి ఉనికిని చాటుకునేందుకే మావోయిస్టులు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని, దీనివల్ల సాధించేదేమీ లేదన్నారు. ఇటువంటి చర్యలను తాము దీటుగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. ఏజెన్సీలో వాహనాల తనిఖీ, లోతట్టు ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. మావోయిస్టులకు ప్రజలు సహకరించవద్దని కోరారు. ఆయన వెంట సీఐ అంకబాబు, గుర్తేడు ఎస్సై శేషుకుమార్ ఉన్నారు.
Advertisement
Advertisement