రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రఖ్యాత ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట్‌రెడ్డి (పేరు మార్చాం) ఇటీవల ఆ కాలేజీలో కొలువుకు రాజీనామా చేశారు. అదే ప్రాంతంలో మరో కాలేజీలో మంచి వేతనానికి ఉద్యోగంలో చేరారు. అయితే ఇదివరకు పనిచేసిన కాలేజీ ఆన్‌లైన్ రికార్డులో వెంకట్‌రెడ్డి పేరు తొలగించలేదు. ఈ ప్రొఫైల్ తొలగింపు అధికారం కాలేజీ యాజమాన్యానికి మాత్రమే ఉండటంతో పలుమార్లు వినతులు సమర్పించినప్పటికీ ఆ కాలేజీ రికార్డులో ఆయన పేరు తొలగించలేదు. పూర్వపు కాలేజీలో పేరు తొలగిస్తే తప్ప కొత్త కాలేజీలో కొలువులో చేరే అవకాశం లేదు. దాదాపు ఆర్నెల్లు కావస్తున్నా ఆయన ప్రొఫైల్ డిలీట్ కాకపోవటంతో కొత్త కాలేజీ యాజమాన్యం అతనికి ఇచ్చిన అవకాశాన్ని వెనక్కు తీసుకుంది. దీంతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో వెంకట్‌రెడ్డి కొట్టుమిట్టాడుతున్నారు.
ఇది కేవలం ఒకరిద్దరి సమస్య కాదు. ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అనేకమంది బోధన సిబ్బంది ఎదుర్కొంటున్న సంకటస్థితి. ఈ సమస్యతో మెరు గైన అవకాశాలు వచ్చినా వెళ్లలేకపోతున్నట్లు పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: వృత్తి విద్య, ఉన్నత విద్యాసంస్థల్లో బోధన సిబ్బందికి సంబంధించిన నియామక నిబంధనలను కఠినతరం చేసిన ప్రభుత్వం.. ప్రతి బోధకుడి వివరాలను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయడంతోపాటు రోజువారీ హాజరును బయోమెట్రిక్ పద్ధతిలో తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆధార్ నంబర్‌సహా బోధకుడి పూర్తి సమాచారాన్ని ఆయా కాలేజీ యాజమాన్యాలు కంప్యూటరీకరించి.. వివరాలను వర్సిటీ లేదా సంబంధిత బోర్డు పోర్టల్‌లో నిక్షిప్తం చేస్తున్నాయి. ఈ విధానంతో ఒక వ్యక్తి ఒకేచోట మాత్రమే పనిచేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఉద్యోగి కాలేజీ మారితే అతని వివరాలను పాత యాజమాన్యం వెబ్‌సైట్‌నుంచి తొలగిస్తేనే మరో కాలేజీలో చేరేందుకు వీలుంటుంది. కొత్త కాలేజీలో కూడా ఆన్‌లైన్ రికార్డుల్లో వివరాలు నమోదు చేశాక కొలువులో చేరాల్సి ఉంటుంది. కాలేజీ యాజమాన్యాలకు ఇచ్చి న ఈ అధికారం తమకు కొత్త అవకాశాలు రాకుండా చేస్తోందని అధ్యాపకులు గగ్గోలు పెడుతున్నారు.
నిర్లక్ష్యంతో ఇబ్బందులు..
రాష్ట్రంలో మూడు వందలకుపైగా ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 7.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిల్లో దాదాపు 80 వేల మంది బోధన సిబ్బంది అవసరం. కానీ చాలాచోట్ల సిబ్బందిని రికార్డుల్లో మాత్రమే కాలేజీ యాజమాన్యాలు చూపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో 30 వేల నుంచి 35 వేల మంది మాత్రమే పనిచేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు చెపు తున్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్నవారికి యాజమాన్యాలు తగిన వేతనాలు ఇవ్వకపోవడం, కొందరికి మంచి అవకాశాలు రావడంతో ఇతర సంస్థల్లో చేరడం వంటి ఘటనలు సహజంగా జరిగిపోతుంటాయి. కాలేజీ మారాలనుకున్న వారి వేతనాన్ని పూర్తిగా చెల్లించి, వారి వివరాలను తమ వెబ్‌సైట్ నుంచి తొలగించాలి. కానీ, పలు కాలేజీలు ఉద్యోగుల వివరాలను తొలగించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
పట్టించుకోని వర్సిటీ అధికారులు..
కొలువు మారాలనుకున్న కొందరు ఉద్యోగులు రాజీనామాలు సమర్పించినప్పటికీ కాలేజీ యాజమాన్యాలు మాత్రం తమ వివరాలను ఆన్‌లైన్ నుంచి తొలగించడం లేదంటూ ఇటీవల పెద్ద సంఖ్యలో జేఎన్‌టీయూహెచ్‌కు ఫిర్యాదులు వచ్చాయి. కొందరైతే నేరుగా వర్సిటీ అధికారుల వద్ద మొరపెట్టుకున్నా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. వాస్తవానికి కాలేజీ అనుబంధ గుర్తింపు ప్రక్రియ సమయంలో వర్సిటీ అధికారుల తనిఖీలో కాలేజీ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఉద్యోగులంతా ప్రత్యక్షంగా హాజరు కావాలి. జాబితా ప్రకారం ఉద్యోగులు పనిచేయకుంటే గుర్తింపును నిలిపివేయాలి. కానీ పలు కాలేజీల యాజమాన్యాలు వర్సిటీ అధికారులకు తాయిలాలిస్తూ మొక్కుబడి తనిఖీ చేయించి గుర్తింపును తెచ్చుకుంటున్నాయి. తాము ఆ కాలేజీలో పనిచేయడం లేదని ఉద్యోగులు వర్సిటీకి ఫిర్యాదు చేస్తే.. వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాల్సిన అధికారులు అలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
తనిఖీలతోనే నిజాలు వెల్లడి
ఉద్యోగుల సంఖ్య, హాజరు, పనితీరుపైన ఇంజనీరింగ్, వృత్తివిద్యా కాలేజీల్లో జేఎన్‌టీయూ, సంబంధిత అధికారులు తనిఖీ లు నిర్వహించాలి. వీటిల్లో వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. ఫిర్యాదులు వచ్చిన కాలేజీల్లోనైనా తనిఖీలు చేపడితే బాగుంటుంది. ఉద్యోగుల ప్రొఫైల్ యాడింగ్ ఆప్షన్ యాజమాన్యానికి ఇచ్చి, డిలీషన్ ఆప్షన్ ఉద్యోగికే ఇవ్వాలి. దీంతో యాజమాన్యాలు సైతం బాధ్యతగా వ్యవహరిస్తాయి. ఇటీవల ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు ప్రొఫైల్ డిలీట్ చేయడం లేదనే అంశంపై వర్సిటీకి ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం శోచనీయం.
– డాక్టర్ శ్రీనివాస్ వర్మ, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment