86 శాతం మంది నాణ్యమైన వస్తువులకే ప్రాధాన్యం
నెలకోసారి కాకుండా అవసరమున్నప్పుడల్లా కొనుగోళ్లు
2023లో 23 శాతం కాగా.. 2024లో 57 శాతం
నిత్యావసరాల అమ్మకాల్లో అమెజాన్ ఫ్రెష్, బిగ్‌బాస్కెట్, జెప్టో ముందంజ
లోకల్ సర్కిల్స్ అధ్యయనంలో పలు అంశాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తాము చెల్లించే డబ్బుకు పూర్తి విలువతో పాటు కొనుగోలు చేసే వస్తువుల్లో నాణ్యతే గీటురాయిగా ఆన్‌లైన్ కోనుగోలుదారులు పరిగణిస్తున్నారు. దేశంలో ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా నిత్యావసరాలను కొనుగోలు చేసేవారిలో 86 శాతం నాణ్యతతో కూడిన వస్తువులకే అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఆన్‌లైన్‌లో ఆయా సంస్థలు, వేదికలు (ప్లాట్‌ఫామ్స్‌ను) ఎంచుకుంటున్నారు. దేశవ్యాప్తంగా 227 జిల్లాల్లో 70 వేల మంది నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ‘లోకల్ సర్కిల్స్’నిర్వహించిన అధ్యయనంలో పలు అంశాలు వెల్లడయ్యాయి. ఇందులో భాగంగా గతంలోని కస్టమర్ల అలవాట్లతో పోలి్చతే కొన్నింటిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నట్లుగా గుర్తించారు.
గతం నుంచి భారతీయులకు నెలవారీగా ఆయా వస్తువులు, నిత్యావసరాలను కొనుగోలుచేసే అలవాటు ఉండగా ఆన్‌లైన్ కొనుగోళ్లలో మార్పులు వచి్చనట్లుగా చెబుతున్నారు. ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారానే నెలకు ఒక్కసారే కాకుండా, తమకు అవసరమున్నప్పుడల్లా వీలైనన్ని ఎక్కువ సార్లు నిత్యావసరాలను కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టమైంది. 2023లో ఇలా అవసరానికి తగ్గట్లుగా కొనుగోలు చేస్తున్న వారు 23 «శాతం కాగా.. 2024లో వీరి సంఖ్య 57 శాతానికి పెరిగినట్లు తెలుస్తోంది.
డెలివరీ టైమ్ 24 గంటల్లోపు కోరుకుంటున్నవారు 67 శాతం ఉండగా, అరగంటలోనే ఈ వస్తువులు కావాలని కోరుకుంటున్నవారు 17 శాతం ఉన్నట్లుగా వెల్లడైంది. ఆన్‌లైన్ గ్రాసరీ సెక్టార్‌లో కస్టమర్ సపోర్ట్ విధానాన్ని కూడా వినియోగదారులు పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నట్లుగా తేలింది. నిత్యావసరాల అమ్మకాల్లో అమెజాన్ ఫ్రెష్, బిగ్‌బాస్కెట్, జెప్టో, బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్ వంటివి పుంజుకోవడంతో పాటు వీలైనంత త్వరితంగా ఆయా వస్తువులను కస్టమర్లకు చేర్చే విషయంలో పోటీపడుతున్నట్లు లోకల్ సర్కిల్స్ వెల్లడించింది.
ఆన్‌లైన్ నిత్యావసర వస్తువుల మార్కెట్ విస్తరిస్తున్న క్రమంలో టైర్–3, టైర్–4 నగరాల్లో నాణ్యత, విలువ, డెలవరీ స్పీడ్ వంటి వాటి విషయంలో కొంత ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్విక్ కామర్స్ పాŠల్‌ట్‌ఫామ్స్ ద్వారా వేగంగా తాము కోరుకుంటున్న నాణ్యతతో కూడిన వస్తువులను ఇంటిగుమ్మం వద్దకు తెప్పించుకోవడం, నాణ్యతా ప్రమాణాలను సరిచూసుకోవం వంటి వాటితో వినియోగదారుల మారుతున్న ప్రాధాన్యాలు స్పష్టమవుతున్నాయని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. అయితే పండ్లు, కూరగాయల వంటి వాటి విషయంలో కృత్రిమ మేధతో (ఏఐ) కూడిన క్యాలిటీ చెక్‌లకు అవకాశమున్నా.. వేగంగా అమ్ముడయ్యే వినిమయ వస్తువులు (ఎఫ్‌ఎంసీజీ)ల విషయంలో నాణ్యతను సరిచూసుకోవడం అనేది సవాళ్లతో కూడుకున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment