వందేళ్ల నాడు పుట్టిన స్పానిష్ వైరస్ దెబ్బకు మన దేశంలో 1.25 కోట్ల మంది చనిపోయారని బ్రిటిష్ ఎన్‌సైక్లోపీడియా చెబుతోంది. ఆ సంఖ్య గరిష్టంగా 1.75 కోట్ల వరకు ఉందని అమెరికాకు చెందిన మెడికల్ హిస్టోరియన్ జేఎం బారీ వెల్లడించారు. మహమ్మారి ధాటికి బలైనవారి సంఖ్యలో ఇంతటి వ్యత్యాసం కనిపిస్తోంది. దీనికి కారణం హైదరాబాద్ స్టేట్ పరిధిలో చనిపోయినవారి వివరాలను నాటి నిజాం ప్రభుత్వం తొక్కిపెట్టడం.. ఇలాగే మరికొన్ని సంస్థానాలు కూడా చేశాయి. ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం వేసిన లెక్కలు తక్కువగా ఉన్నాయి.
సాక్షి, హైదరాబాద్: కోట్ల మందిని పొట్టన పెట్టుకుంటున్న వైరస్ ఓవైపు.. అప్పటికే కరువు విలయతాండవం చేస్తుండటంతో ఆకలి చావులు మరోవైపు.. రుతుపవనాలు బాగా ఆలస్యమై సాగును దెబ్బతీసిన కలసిరాని కాలం మరోవైపు.. ఇదీ అసలైన ముప్పేట దాడి అంటే. 1920.. సరిగ్గా వందేళ్ల కింద ఇదీ మన పరిస్థితి. ఇప్పుడు కరోనా వైరస్ పంజా విసిరినా.. దాని బారి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు మనకు ఊరటనిస్తోంది. త్వరలోనే దాని బారి నుంచి మనం బయటపడతామనే ధీమాతో పాటు ఒక్క పేద కుటుంబం కూడా పస్తులుండని పరిస్థితి ఇప్పుడు ఉంది. కానీ నాటి పరి స్థితి ఎంత భయానకంగా ఉండేదో ఓ సారి తెలుసుకుందాం..
ఇటు అంటు వ్యాధి.. అటు ఆకలి చావులు
ఏడో నిజాం.. నాడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడు. హైదరాబాద్ నగరంలో అన్ని హంగులు ఉండాలని తాపత్రయపడి ఆధునికతకు ఆద్యుడయ్యాడు. కానీ ప్రజల సంక్షేమం అంతగా పట్టదన్న చరిత్రకారుల మాటలు నిజం చేసేలా వందేళ్ల నాటి పరిస్థితులు నిలిచాయి. 1918 నుంచి రెండేళ్ల పాటు స్పానిష్ వైరస్ ధాటికి జనం పిట్టల్లా రాలిపోయారు. అప్పటికే దక్కన్ పీఠభూమిపై ఆకలి కేకలు మిన్నంటాయి. 1890 నుంచి కరువు కరాళ నృత్యం చేస్తోంది. తరచూ ఏర్పడుతున్న కరువులో ఆకలి చావులు తీవ్రమయ్యాయి.
దీనికి తోడు మూసీ వరదలు, గత్తర ప్రబలడం.. వెరసి అంతా గందరగోళంగా ఉంది. అదే సమయంలో మరోసారి కరువు పంజా విసిరింది. జనం తిండి లేక చనిపోతున్నతరుణంలో స్పానిష్ వైరస్ విరుచుకుపడింది. ఇటు ఆకలి చావులు, అటు అంటువ్యాధి మృతులు వెరసి.. దక్కన్ పీఠభూమి శవాల దిబ్బగా మారింది. అక్కడితో ప్రకృతి కడుపు మంట తీరలేదు. వైరస్ ప్రభావం తగ్గుతోందనుకుంటున్న తరుణంలో అదే సమయంలో రుతు పవనాలు ఆలస్యంగా రావటంతో కాలం కలసిరాలేదు. దీంతో ఏకంగా 20 శాతానికంటే ఎక్కువ మేర దిగుబడులు తగ్గిపోయాయి. ఇది దేశవ్యాప్తంగా కనిపించింది. దీనివల్ల ఒక్కసారిగా ధరలు భగ్గుమన్నాయి. రెండేళ్ల పాటు ఈ పరిస్థితి కొనసాగింది.
మృతుల వివరాలు వెలుగు చూడనివ్వని నిజాం
ఆకలి చావులు, అంటువ్యాధి మృతులు హైదరాబాద్ సంస్థానంలో అధికంగా నమోదయ్యాయి. కానీ ఈ మృతుల వివరాలు బయటి ప్రపంచానికి నిజాం తెలియనివ్వలేదు. స్పానిష్ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చనిపోయినవారిలో 43 శాతం భారతీయులే కావటంతో ఇక్కడి మృతుల సంఖ్యపై యావత్తు ప్రపంచం దృష్టిపెట్టింది. చనిపోయిన వారి వివరాలను సేకరించే బాధ్యతను నాటి బ్రిటిష్ పాలకులు కొందరు నిపుణులకు అప్పగించారు. వారు దేశవ్యాప్తంగా వివరాలు సమీకరించారు. కానీ నిజాం మాత్రం తన పరిధిలో చనిపోయిన వారి లెక్కలు ఇచ్చేందుకు నిరాకరించాడు.
అపర కుబేరుడిగా, హైదరాబాద్ సంస్థానాన్ని ఆధునిక ప్రాంతంగా, అన్ని వసతులతో అభివృద్ధి చేస్తున్నట్లు పేరు గడించాలన్నది ఆయన ఆరాటం. ఆ పాలనకు ఈ మృతుల లెక్కలు మచ్చలా మిగిలిపోతాయని భయపడ్డట్టు చరిత్రకారులు చెబుతారు. అందుకే బ్రిటిష్ పాలకులు వేసుకున్న లెక్కలు చాలా తక్కువగా ఉన్నాయని అమెరికా కోడై కూసింది. బ్రిటిష్ ఎన్‌సైక్లోపీడియాలో ఇప్పటికీ ఈ‘తప్పుడు’ లెక్కలే ఉన్నాయి. ఈ మరణాలపై తదుపరి ఇతర పరిశోధకులు వెలువరించిన పుస్తకాల్లో లెక్కలు ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణం. అమెరికాకు చెందిన మెడికల్ హిస్టోరియన్ జేఎం బారీ చూపిన లెక్కల్లోని గరిష్ట మొత్తం అంత ఎక్కువగా ఉండటానికీ ఇదే కారణం.
ఉచిత భోజనాలు పెట్టాల్సిందే
అంటు రోగం, కరువుకాటకాలతో అతలాకుతలమైన సమయంలో పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాల్సిందే. కానీ నిజాం ఆ పని చేపట్టలేదని తెలుస్తోంది. హైదరాబాద్ సంస్థానం పరిధిలో ఆకలితో ఎంతోమంది అలమటిస్తూ తనువు చాలిస్తున్నా.. ఆయన ఖజానా నుంచి వారికి సాయం చేయలేదని చెబుతారు. విషయం తెలిసి ఈ ప్రాంత బ్రిటిష్ రెసిడెంట్ జోక్యం చేసుకుని నిజాంకు ఆదేశాలు జారీ చేయటంతో అప్పుడు ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేయించే చర్యలు ప్రారంభించారని చెబుతారు. అంటువ్యాధులకు చికిత్స కోసం వైద్య వసతి కొంత వరకు మెరుగ్గానే ఉన్నా.. పేదలను ఆదుకునే చర్యలు మాత్రం లేవనేది వారి మాట.
Comments
Please login to add a commentAdd a comment