nizams
-
రావిచెట్టుపై రాత్రికి రాత్రే జెండా ఎగిరింది.. పెద్ద హంగామా..
సాక్షి, భానుపురి (నల్లగొండ): దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో నిజాం రాజు ఇంకా ప్రత్యేక దేశంగా ఉండేందుకే మొగ్గు చూపారు. ఈ సమయంలో కొందరు స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇంకా నిజాం పోలీసులు, రజాకార్లదే పెత్తనం. అప్పుడు నా వయస్సు 9 ఏళ్లు. 1947 ఆగస్టు 15న గుర్తుతెలియని వ్యక్తులు రావిచెట్టు బజారు (ప్రస్తుత బొడ్రాయిబజారు)లో ఓ పెద్ద రావిచెట్టుపై రాత్రికి రాత్రే జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల భయం ఎక్కువగా ఉన్న ఆ సమయంలో జెండా ఎవరూ కట్టారో తెలుసుకునేందుకు పెద్ద హంగామే జరిగింది. పోలీసులు సోదాలు చేయడం, అనుమానం ఉన్న వారిపై లాఠీలు ఝుళిపించారు. పెద్ద ఘర్షణ వాతావరణమే నెల కొంది. నిజాంరాజు లొంగిపోయిన తర్వాత కూడా జెండా పండుగకు ప్రజలు పోలీసుల భయంతో పెద్దగా వచ్చేవారు కాదు. ఆర్య సమాజ్‌కు చెందిన యామ రామచంద్రయ్య (కన్నయ్య), విశ్వమిత్ర పండిత్‌జీ లాంటి వారు ముందుండి నడిపేవారు. రామాలయం పక్కనే ఉన్న గ్రంథాలయంలో జెండా ఎగురవేసేది. రానురాను మొదటగా గాంధీపార్క్, పబ్లిక్ క్లబ్ ఇలా అన్నిచోట్ల జాతీయ జెండాలను ఎగురవేస్తున్నారు. -
ఉట్టిపడే ‘రాజసం’..
అందమైన భాగ్యనగరం మనది. ఘన చరిత్రకు సాక్ష్యం...అద్భుతమైన వారసత్వ సంపదకు నిలయం ఈ నగరం. 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్‌లో ఎన్నో అద్భుతమైన కట్టడాలు, ప్రాంతాలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. గత చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. చార్మినార్..గోల్కొండ.. అసెంబ్లీ భవనం.. చౌమహల్లా ప్యాలెస్, మక్కా మసీదు, సాలార్జంగ్ మ్యూజియం, సర్దార్ మహల్, మహబూబ్ మాన్షన్, కింగ్ కోఠి ప్యాలెస్.. ఇలా ఎన్నో అద్భుత నిర్మాణాలు వారసత్వ కట్టడాలుగా ఖ్యాతి పొందాయి. కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరాన్ని ‘హెరిటేజ్ ఇండియా ఫెస్టివల్’గా ప్రకటించిన నేపథ్యంలో మన అసెంబ్లీ భవనం ప్రత్యేకతలపై ‘సాక్షి’ కథనం.. సాక్షి, హైదరాబాద్: మన శాసనసభ నిర్మాణానికి పునాదిరాయి పడి ఎన్నేళ్లయిందో తెలుసా? రేపటితో అక్షరాలా 116 సంవత్సరాలు. ఇది నిర్మించి ఒక శతాబ్దంపైనే పూర్తయ్యింది. అయినా ఈ భవనం చెక్కు చెదరలేదు. ఉట్టిపడే రాజసానికి ప్రతీక ఇది. అప్పటి ఉమ్మడి రాష్ట్రం, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర చరిత్రను మలుపుతిప్పిన అనేక కీలకఘట్టాలు ఈ శాసనసభా ప్రాంగణంలోనే చోటుచేసుకున్నాయి. అద్భుతమైన నిర్మాణ శైలితో కట్టించిన ఈ భవనం హైదరాబాద్ నగరంలోనే ఒక అపురూప కట్టడం. అసెంబ్లీ భవన నిర్మాణానికి 1905 జనవరి 25న అంకురార్పణ జరిగింది. ప్రజా సమస్యలకు వేదికగా అప్పటి ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ పచ్చని ఉద్యానవనంలో ఈ భవనం నిర్మాణానికి శ్రీకారం చు ట్టారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఈ వేదిక నుంచే తమ వాణిని వినిపిస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభు త్వం 2021ని చారిత్రక కట్టడాల పరిరక్షణ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ‘హైదరాబాద్ హెరిటేజ్’ను పురస్కరించుకుని అసెంబ్లీ భవనంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం నిజాం నవాబు ప్రసంగించిన వేళ.. అది 1904వ సంవత్సరం.. ఓ రోజు నగరం అంతా సందడిగా ఉంది. ఢిల్లీలో జరిగిన సంస్థానాధీశుల దర్బార్ సమావేశాలకు వెళ్లిన మ హబూబ్ అలీఖాన్ ఆ రోజు సాయంత్రం నగ రానికి చేరుకోనున్నారు. ఆయన రాకకోసం జనం ఎదురుచూస్తున్నారు. సరిగా అయిదున్నర గంటల సమయంలో పబ్లిక్ గార్డెన్‌లోని సభాస్థలికి చేరుకున్నారు. మహబూబ్‌కు సాదర స్వాగతం లభించింది. ఆయన ప్రసంగించిన వేదిక చిరకాలం గుర్తుండిపోయేలా ఒక అందమైన భవనం కట్టించాలని తీర్మానించారు. అలా టౌన్‌హాల్ నిర్మాణానికి బీజం పడింది. హైదరాబాద్ సంస్థాన ప్రజలు చందాలు పోగుచేసి ఆ భవనాన్ని కట్టించారు. భవన శంకుస్థాపన ఇలా.. అప్పటికే ఎన్నో భవనాలు ఉన్నాయి. కానీ మంత్రులు, ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు, సాధారణ ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు ఒక వేదిక లేదు. దీంతో 1905లో మహబూబ్ అలీఖాన్ 40వ పుట్టిన రోజు (హిజ్రీ క్యాలెండర్ ప్రకారం జనవరి 25) సందర్భంగా ఆయనకు నగరవాసుల బహుమానంగా అందమైన భవన నిర్మాణం చేపట్టారు. సమాజంలోని ఉన్నత వర్గాలే కాకుండా సాధారణ ప్రజలు సైతం తమవంతుగా విరాళాలు సమర్పించారు. ఈ కట్టడం కోసం అన్ని వర్గాల ప్రజలు పరిశ్రమించారు. అద్భుతమైన నిర్మాణ శైలి.. ఈ భవనం అందమైన గోపురాలు, ఆకాశాన్ని తాకే శిఖరాలు, మరెంతో అందంగా తీర్చిదిద్దిన డోమ్లతో ఆకట్టుకుంటుంది. భవనం గోడలపై మంత్రముగ్ధులను చేసే డిజైన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇప్పటికీ దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులను, పర్యాటకులను ఆకట్టుకుంటూనే ఉంది. ఇరానీ, మొగలాయి, రాజస్థానీ వాస్తు నిర్మాణ శైలులతో దీన్ని కట్టించారు. టౌన్ హాల్ నిర్మా ణం కోసం రాజస్థాన్‌లోని మఖ్రా నా నుంచి రాళ్లను తెప్పించారు. రెండంతస్తులతో ని ర్మించిన టౌన్‌హాల్ చు ట్టూ 20 గదులు ఉంటా యి. గోపురాల కోసం డంగు సున్నం, బంకమట్టి వినియోగించారు.గోపురాలు, కమాన్లు మొగలాయి వాస్తు శైలిని సంతరించుకుంటే గోడలపై రూపొందించిన కళాత్మక దృశ్యాలు, లతలు, వివిధ రకాల డిజైన్లు ఇరాన్, రాజస్థానీ శైలులతో రూపుదిద్దుకున్నాయి. అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు తట్టుకొనేలా దీనిని కట్టించారు. చక్కటి గాలి, వెలుతురు వస్తాయి. చలికాలంలో వెచ్చగా, వేసవిలో చల్లగా ఉంటుంది. పచ్చిక బయళ్లతో పరిసరాలు ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటాయి. అప్పట్లో రూ.20 లక్షల వ్యయంతో దీనిని నిర్మించారు. 1913లో నిర్మాణం పూర్తయ్యింది. మహబూబ్ అలీఖాన్ 1911లోనే చనిపోవడంతో ఆయన తనయుడు ఏడో నిజాం మీర్ఉస్మాన్ అలీఖాన్ భవన నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఈ శ్వేతసౌధానికి మహబూబ్ జ్ఞాపకార్థం మొదట మహబూబియా టౌన్ హాల్‌గా నామకరణం చేశారు. అదే రాష్ట్ర శాసనసభగా మారింది. అసెంబ్లీ భవనం ఫొటోతో పోస్టల్ స్టాంప్ 1913లో భవనం నిర్మాణం పూర్తి అయి ప్రజలకు అందుబాటులో రావడంతో ఈ భవనం ఫొటోతో ఏడో నిజాం సంస్థాన ప్రజల అందరికీ తెలిసేలా దీని ఫొటోతో పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. దీని విలువ అప్పటి రోజుల్లో ఒక అణాగా ఉండేది. -
ముప్పేట దాడిలో విలవిల!
వందేళ్ల నాడు పుట్టిన స్పానిష్ వైరస్ దెబ్బకు మన దేశంలో 1.25 కోట్ల మంది చనిపోయారని బ్రిటిష్ ఎన్సైక్లోపీడియా చెబుతోంది. ఆ సంఖ్య గరిష్టంగా 1.75 కోట్ల వరకు ఉందని అమెరికాకు చెందిన మెడికల్ హిస్టోరియన్ జేఎం బారీ వెల్లడించారు. మహమ్మారి ధాటికి బలైనవారి సంఖ్యలో ఇంతటి వ్యత్యాసం కనిపిస్తోంది. దీనికి కారణం హైదరాబాద్ స్టేట్ పరిధిలో చనిపోయినవారి వివరాలను నాటి నిజాం ప్రభుత్వం తొక్కిపెట్టడం.. ఇలాగే మరికొన్ని సంస్థానాలు కూడా చేశాయి. ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం వేసిన లెక్కలు తక్కువగా ఉన్నాయి. సాక్షి, హైదరాబాద్: కోట్ల మందిని పొట్టన పెట్టుకుంటున్న వైరస్ ఓవైపు.. అప్పటికే కరువు విలయతాండవం చేస్తుండటంతో ఆకలి చావులు మరోవైపు.. రుతుపవనాలు బాగా ఆలస్యమై సాగును దెబ్బతీసిన కలసిరాని కాలం మరోవైపు.. ఇదీ అసలైన ముప్పేట దాడి అంటే. 1920.. సరిగ్గా వందేళ్ల కింద ఇదీ మన పరిస్థితి. ఇప్పుడు కరోనా వైరస్ పంజా విసిరినా.. దాని బారి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు మనకు ఊరటనిస్తోంది. త్వరలోనే దాని బారి నుంచి మనం బయటపడతామనే ధీమాతో పాటు ఒక్క పేద కుటుంబం కూడా పస్తులుండని పరిస్థితి ఇప్పుడు ఉంది. కానీ నాటి పరి స్థితి ఎంత భయానకంగా ఉండేదో ఓ సారి తెలుసుకుందాం.. ఇటు అంటు వ్యాధి.. అటు ఆకలి చావులు ఏడో నిజాం.. నాడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడు. హైదరాబాద్ నగరంలో అన్ని హంగులు ఉండాలని తాపత్రయపడి ఆధునికతకు ఆద్యుడయ్యాడు. కానీ ప్రజల సంక్షేమం అంతగా పట్టదన్న చరిత్రకారుల మాటలు నిజం చేసేలా వందేళ్ల నాటి పరిస్థితులు నిలిచాయి. 1918 నుంచి రెండేళ్ల పాటు స్పానిష్ వైరస్ ధాటికి జనం పిట్టల్లా రాలిపోయారు. అప్పటికే దక్కన్ పీఠభూమిపై ఆకలి కేకలు మిన్నంటాయి. 1890 నుంచి కరువు కరాళ నృత్యం చేస్తోంది. తరచూ ఏర్పడుతున్న కరువులో ఆకలి చావులు తీవ్రమయ్యాయి. దీనికి తోడు మూసీ వరదలు, గత్తర ప్రబలడం.. వెరసి అంతా గందరగోళంగా ఉంది. అదే సమయంలో మరోసారి కరువు పంజా విసిరింది. జనం తిండి లేక చనిపోతున్నతరుణంలో స్పానిష్ వైరస్ విరుచుకుపడింది. ఇటు ఆకలి చావులు, అటు అంటువ్యాధి మృతులు వెరసి.. దక్కన్ పీఠభూమి శవాల దిబ్బగా మారింది. అక్కడితో ప్రకృతి కడుపు మంట తీరలేదు. వైరస్ ప్రభావం తగ్గుతోందనుకుంటున్న తరుణంలో అదే సమయంలో రుతు పవనాలు ఆలస్యంగా రావటంతో కాలం కలసిరాలేదు. దీంతో ఏకంగా 20 శాతానికంటే ఎక్కువ మేర దిగుబడులు తగ్గిపోయాయి. ఇది దేశవ్యాప్తంగా కనిపించింది. దీనివల్ల ఒక్కసారిగా ధరలు భగ్గుమన్నాయి. రెండేళ్ల పాటు ఈ పరిస్థితి కొనసాగింది. మృతుల వివరాలు వెలుగు చూడనివ్వని నిజాం ఆకలి చావులు, అంటువ్యాధి మృతులు హైదరాబాద్ సంస్థానంలో అధికంగా నమోదయ్యాయి. కానీ ఈ మృతుల వివరాలు బయటి ప్రపంచానికి నిజాం తెలియనివ్వలేదు. స్పానిష్ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చనిపోయినవారిలో 43 శాతం భారతీయులే కావటంతో ఇక్కడి మృతుల సంఖ్యపై యావత్తు ప్రపంచం దృష్టిపెట్టింది. చనిపోయిన వారి వివరాలను సేకరించే బాధ్యతను నాటి బ్రిటిష్ పాలకులు కొందరు నిపుణులకు అప్పగించారు. వారు దేశవ్యాప్తంగా వివరాలు సమీకరించారు. కానీ నిజాం మాత్రం తన పరిధిలో చనిపోయిన వారి లెక్కలు ఇచ్చేందుకు నిరాకరించాడు. అపర కుబేరుడిగా, హైదరాబాద్ సంస్థానాన్ని ఆధునిక ప్రాంతంగా, అన్ని వసతులతో అభివృద్ధి చేస్తున్నట్లు పేరు గడించాలన్నది ఆయన ఆరాటం. ఆ పాలనకు ఈ మృతుల లెక్కలు మచ్చలా మిగిలిపోతాయని భయపడ్డట్టు చరిత్రకారులు చెబుతారు. అందుకే బ్రిటిష్ పాలకులు వేసుకున్న లెక్కలు చాలా తక్కువగా ఉన్నాయని అమెరికా కోడై కూసింది. బ్రిటిష్ ఎన్సైక్లోపీడియాలో ఇప్పటికీ ఈ‘తప్పుడు’ లెక్కలే ఉన్నాయి. ఈ మరణాలపై తదుపరి ఇతర పరిశోధకులు వెలువరించిన పుస్తకాల్లో లెక్కలు ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణం. అమెరికాకు చెందిన మెడికల్ హిస్టోరియన్ జేఎం బారీ చూపిన లెక్కల్లోని గరిష్ట మొత్తం అంత ఎక్కువగా ఉండటానికీ ఇదే కారణం. ఉచిత భోజనాలు పెట్టాల్సిందే అంటు రోగం, కరువుకాటకాలతో అతలాకుతలమైన సమయంలో పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాల్సిందే. కానీ నిజాం ఆ పని చేపట్టలేదని తెలుస్తోంది. హైదరాబాద్ సంస్థానం పరిధిలో ఆకలితో ఎంతోమంది అలమటిస్తూ తనువు చాలిస్తున్నా.. ఆయన ఖజానా నుంచి వారికి సాయం చేయలేదని చెబుతారు. విషయం తెలిసి ఈ ప్రాంత బ్రిటిష్ రెసిడెంట్ జోక్యం చేసుకుని నిజాంకు ఆదేశాలు జారీ చేయటంతో అప్పుడు ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేయించే చర్యలు ప్రారంభించారని చెబుతారు. అంటువ్యాధులకు చికిత్స కోసం వైద్య వసతి కొంత వరకు మెరుగ్గానే ఉన్నా.. పేదలను ఆదుకునే చర్యలు మాత్రం లేవనేది వారి మాట. -
నిజాం కాలం నాటి ఫిరంగి స్వాధీనం
హైదరాబాద్: రోడ్డు విస్తరించే పనుల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం పురాతన భవనాన్ని కూలుస్తుండగా నిజాం కాలం నాటి ఫిరంగి బయటపడింది. పాత బస్తీలోని హుస్సేనీ ఆలంలోని కోకాకితట్టీ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఫిరంగి కనిపించడంతో అప్రమత్తమైన స్ధానికులు వెంటనే చార్మినార్ పోలీసులకు సమాచారం అందించారు. వారు ఫిరంగి స్వాధీనం చేసుకున్నారు. ఫిరంగిని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.