ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్
సాక్షి సిటీబ్యూరో: అది 1903, జనవరి 1.. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ ఢిల్లీలో దేశంలోని వివిధ సంస్థానాదీశుల దర్బార్‌కు వెళ్లి జనవరి 4వ తేదీన తిరిగి నగరానికి వచ్చారు. వస్తునే ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక సభాస్థలికి (ప్రస్తుతం అసెంబ్లీ భవనం ఉన్న ప్రాంతం) చేరకుని ప్రసంగించారు. హైదరాబాద్ రాజ్యంలో తాను చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. భవిష్యత్‌లో చేయదలచిన పనులను చెప్పారు. సంస్థానాధీశుల సమావేశంలోని విశేషాలను వివరించారు. ఆ క్షణంలోనే నగరవాసులంతా ఒక నిర్ణయానికి వచ్చారు. నిజాం నవాబు ఢిల్లీ దర్బార్ సభల్లో పాల్గొని వచ్చిన చారిత్రక సందర్భం.. ఈ సభా వేదిక చిరకాలం గుర్తుండి పోయేలా అద్భుతమైన భవనం కట్టించాలని తీర్మానించారు.
ఆ కట్టడం కోసం అన్ని వర్గాల ప్రజలు పరిశ్రమించారు. చందాలు పోగుచేశారు. మరో ఏడాది తర్వాత.. మహబూబ్ అలీఖాన్ 40వ పుట్టిన రోజు సందర్భంగా 1905 ఆగస్టు 18న భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. 1913 డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తయింది. కానీ మహబూబ్ అలీఖాన్ 1911లోనే మరణించారు. ఆయన తనయుడు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో ఆ భవనం అందుబాటులోకి వచ్చింది. శ్వేతవర్ణంలో మెరిసిపోతున్న ఆ నిర్మాణాన్ని మహబూబ్ జ్ఞాపకార్థం ‘మహబూబియా టౌన్‌హాల్’æగా నామకరణం చేశారు. తర్వాత కాలంలో రాష్ట్ర శాసనసభగా మారింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశం సందర్భంగా ఆ భవనంపై ‘సాక్షి’ ప్రత్యే కథనం..
కుతుబ్‌షాహీ పాలకుల నుంచి ఆసిఫ్‌జాహీ పాలకుల వరకు హైదరాబాద్ సంస్థానంలో ప్రజా సౌకర్యార్థం వందల కట్టడాలు నిర్మించారు. కానీ ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ కట్టడానిది మాత్రం భిన్న చరిత్ర. ప్రజా అవసరాల కోసం ఈ భవనాన్ని నగర ప్రజలు చందాలతో నిర్మించారు. దీని నిర్మాణంలో డబ్బులు దానం చేసే వారు ఒక రూపాయి కంటే ఎక్కువ ఇవ్వరాదని ఫర్మానా జారీ చేశారు. దీంతో నగర సాధారణ ప్రజలు కూడా అర్ధణా, అణా, రెండు అణాలు చొప్పున ఇచ్చారని చరిత్రకారులు చెబుతారు. అలా మొత్తం రూ.20 లక్షల వ్యయంతో ఈ భవనాన్ని కట్టించారు.
అద్భుతమైన నిర్మాణ శైలి
నూరేళ్లకు పైగా కాలానికి సాక్షిగా నిలిచిన ఈ భవనంలో ఎందరెందరో రాజనీతిజ్ఞులు, విధాన రూపకర్తలు, ప్రజ సమస్యలపై ఎలుగెత్తిన రాజకీయ నాయకులు, ప్రజా జీవితంలో తలపండిన నేతలు ఆ భవనంలో కొలువుదీరారు. శాసనాల రూపకల?నలో భాగస్వాములయ్యారు. ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం చర్చోపర్చలు జరిగాయి. ఆ నాటి నిజాం నవాబు కాలంలో హైదరాబాద్ సంస్థాన ప్రముఖులు, ప్రజలు సమావేశాలు ఏర్పాటు చేసుకొన్నారు. ఆరో నిజాం కాలంనాటి అధికారిక భవన నిర్మాణ నిపుణుల ప్రత్యేక్ష పరవేక్షణలో రూపుదిద్దుకుంది. కుతుబ్, ఆసిఫ్ జాహీల కాలంలో కట్టించిన అనేక చారిత్రక భవనాల కంటే కూడా అత్యాధునిక నిర్మాణ శైలిని సంతరించుకొన్న టౌన్‌హాల్æ ఇరానీ, మొగల్, రాజస్థానీ వాస్తు నిర్మాణ శైలిలో నిర్మించారు.
రాజస్థాన్ లోని మఖరానా నుంచి రాళ్లను తెప్పించారు. (తాజ్æమహల్æకు సైతం ఇక్కడి రాళ్లనే వినియోగించారు) రెండంతుస్తుల్లో నిర్మింన భవనంలో ఒక సువిశాలమైన హాల్æ, దాని చుట్టూ సుమారు 20 గదులు ఉంటాయి,. గోపురాలకు డంగు సున్నం, బంకమట్టిని వినియోగించారు. గోపురాలు, కమాన్‌లు మొగలాయి వాస్తు శైలిలోను, గోడలపై కళాత్మక దృశ్యాలు, లతలు ఇరాన్, రాజస్థానీ శైలితో తీర్చిదిద్దారు. అన్ని రకాల వాతావరణæ పరిస్థితులకు తట్టుకొనే విధంగా కట్టించారు. చలికాలంలో వెచ్చగా, వేసవిలో చల్లగా ఉండడం ఈ భవనం ప్రత్యేకత.
అసెంబ్లీ భవనంతో పోస్టల్ స్టాంప్
భవన నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాక.. నిజాం సంస్థాన ప్రజలందరికీ దాని ప్రత్యేకతను తెలియజేయడానికి ఏదన్నా చేయాలనుకున్నారు. అలా 1940లో భవనం ఫొటోతో పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. దీని విలువ ఒక అణా.
Comments
Please login to add a commentAdd a comment