సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం రాష్ట్రంలో ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ‘ప్రత్యేక ఆన్ డిమాండ్ పరీక్ష’ను నిర్వహించనున్నట్లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐవోఎస్) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటర్ బోర్డు నిర్వహించే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అదనంగా ఈ పరీక్షలను రాసే వీలును విద్యార్థులకు కల్పిస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన వారిలో 3 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని, అందులో 20 మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో లక్షల మంది విద్యార్థులు భవిష్యత్ దృష్ట్యా తాము మొదటిసారి తెలంగాణ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ పరీక్షలను నిర్వహిస్తున్నామని ఎన్‌ఐవోఎస్ ప్రాంతీయ కార్యాలయం వెల్లడించింది.
ఈ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఈ నెల 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఇందులో విద్యార్థులు తాము ఉత్తీర్ణులైన 2 సబ్జెక్టుల మార్కులను బదిలీ చేసుకొని (ట్రాన్స్‌ఫర్ ఆఫ్ క్రెడిట్), 3 సబ్జెక్టుల పరీక్షలు రాయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ పరీక్షల ఫలితాలను నెల రోజుల్లో ప్రకటిస్తామని పేర్కొంది. విద్యార్థులు పరీక్షలు రాసిన 3 సబ్జెక్టులు పాస్ అయ్యాక మొత్తం 5 సబ్జెక్టుల మార్కులతో మార్కుల షీట్ ఇస్తామని వివరించింది. విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తమ www.nios.ac.in, https://sdmis.nios.ac.in వెబ్‌సైట్‌లలో సందర్శించాలని తెలిపింది. రిజిస్ట్రేషన్‌లో విద్యార్థులు ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటే హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయం 040–24752859, 24750712 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని వివరించింది.
ఇంటర్ ఫెయిలైన వారికి ‘ఆన్ డిమాండ్ పరీక్ష’
Published Sat, May 11 2019 1:29 AM | Last Updated on Sat, May 11 2019 1:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment