
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలను వారంలోగా వెల్లడించేందుకు వీలుగా ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి కోవిడ్–19 నేపథ్యంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను క్లౌడ్ సర్వీస్ ద్వారా విడుదల చేయనున్నామని బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫలితాల డేటా కావలసిన వెబ్‌సైట్లు, ఇతరులు తమ సమాచారాన్ని ముందుగా బోర్డుకు అందించాలన్నారు.
వెబ్‌సైట్‌ల నిర్వాహకులు వెబ్‌సైట్ పేరు, యూఆర్‌ఎల్ వివరాలు అందించాలి. ఇతరులు తమ పేరు, మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ అందించాలి. ఈ వివరాలను probieap@gmail.comకు పంపించాలి. ఇలా ఉండగా, ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు సంబంధించిన దాదాపు 60 లక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తిచేసి తదనంతర ప్రక్రియలపై బోర్డు నిమగ్నమైంది. ఇవి వారంలోగా పూర్తయ్యే అవకాశం ఉంది. అవి పూర్తయ్యాక అన్నీ సజావుగా ఉన్నాయని తేలాకనే ఫలితాల తేదీ ప్రకటిస్తారు.