అశోకా.. ఏంటీ లీల! | Inter student who committed suicide had passed exam | Sakshi
Sakshi News home page

అశోకా.. ఏంటీ లీల!

Published Sun, Jun 2 2019 2:18 AM | Last Updated on Sun, Jun 2 2019 2:19 AM

Inter student who committed suicide had passed exam - Sakshi

హైదరాబాద్‌: ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిలైనట్లు వచ్చిన మార్కులతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అనామిక రీవెరిఫికేషన్‌లో ఉత్తీర్ణురాలైనట్లు బోర్డు ప్రకటించింది. అయితే జవాబు పత్రాల ఫొటో స్టాట్‌లో మాత్రం 21 మార్కులే వచ్చినట్లు చూపించారు. దీంతో అనామిక పాసైనట్లా.. ఫెయిలైనట్లా..? అన్నది సందిగ్ధంగా మారింది. రీవెరిఫికేషన్‌ చేసిన తరువాత కూడా ఇలాంటి తప్పిదాలు చోటుచేసుకోవడంతో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ కుమార్‌ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

మెమోలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఆమెకు ఏకంగా 28 మార్కులు పెరిగినట్లు చూపించారు. ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌కి చెందిన గణేష్‌కుమార్, హారిక దంపతులకు అనామికతో పాటు ఉదయ, సీతల్, భావేష్‌ అనే పిల్లలున్నారు. కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించే వీరికి పిల్లలను చదివించే ఆర్థిక స్థోమత లేదు. దీంతో అనామిక సికింద్రాబాద్‌ చాచానెహ్రూనగర్‌లో ఉంటున్న అమ్మమ్మ ఉమా వద్దే ఉంటూ చదువుకుంది. కింగ్‌కోఠిలోని ప్రగతి మహావిద్యాలయలో ఇంటర్‌ సీఈసీ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. చదువులోనే కాదు.. ఆటలు, ఎన్‌సీసీ, ఇతర కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొనేది. ఇంటర్‌ బోర్డు నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది.  

నాడు 20.. మెమోలో 48...
ఇంటర్‌ బోర్డు వెల్లడించిన ఫలితాల్లో అనామిక (హాల్‌టికెట్‌ నంబర్‌ 1961112037)కు ఇంగ్లీష్‌– 64, ఎకనామిక్స్‌–55, సివిక్స్‌ –67, కామర్స్‌–75, తెలుగు–20 మార్కులు వచ్చినట్లు ప్రకటించింది. మిగతా సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించిన ఆమెకు తెలుగులో 20 మార్కులు మాత్రమే రావడంతో ఫెయిలైంది. పరీక్ష బాగా రాసినప్పటికీ ఎందుకు ఫెయిలైందో అర్థం కాక ఆమె ఒత్తిడికి గురైంది. అదే బాధతో ఏప్రిల్‌ 18న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫెయిలైన విద్యార్థులందరి జవాబు పత్రాలను రీవెరిఫికేషన్‌ చేయడంతో.. అందులో అనామిక పాసైనట్లు వెల్లడైంది.

తెలుగులో ఆమెకు 28 మార్కులు పెరిగి.. మొత్తంగా 48 మార్కులు వచ్చినట్లు ఇంటర్‌ బోర్డు తన వెబ్‌ సైట్‌లో పేర్కొంది. తమ కుమార్తె పాసైనట్లు తేలడంతో అనామిక కుటుంబం మరోసారి శోకసంద్రంలో మునిగిపోయింది. అధికారులు మూల్యాంకనాన్ని సరిగ్గా చేపట్టి ఉంటే తమ చిన్నారి బతికి ఉండేదని అమ్మమ్మ ఉమ, సోదరి ఉదయ కన్నీటిపర్యంతం అయ్యారు. అయితే జావాబు పత్రంలో ఫొటో స్టాట్‌లో మాత్రం అనామికకు 21 మార్కులే వచ్చినట్లు చూపించారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది.

చనిపోయిన తర్వాత ఫలితాలా?
అనామిక పాసైందన్న మెమోను చూసిన తరువాత ఆమె అమ్మమ్మ ఉమ, సోదరి ఉదయ మీడియాతో మాట్లాడారు. చనిపోయిన అనామిక పాసైనందుకు ఆమె ప్రాణాలను తెచ్చి ఇవ్వాల్సిన బాధ్యత అధికారులదేనని, ఈ అంశంపై న్యాయం కోసం కోర్టుకెళ్తామని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఉదయ బోరున విలపిస్తూ చెప్పింది. ఫలితాలు ముందే సరిగ్గా వచ్చి ఉంటే అనామిక బతికేదని, ఇంటర్‌ బోర్డు అధికారులు తమ పిల్లను పొట్టనబెట్టుకున్నారని ఉమ ఆవేదన వ్యక్తం చేశారు.

అనామిక పాస్‌ కాలేదు: ఇంటర్‌ బోర్డు
ఆరుట్ల అనామిక పాస్‌ కాలేదని ఇంటర్‌ బోర్డు సాయంత్రం ఓ ప్రకటన చేసింది. అనామిక సోదరి ఆరుట్ల ఉదయ ఇంటర్‌ బోర్డు తప్పిదం కారణంగానే తన సోదరి ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ ఖండించారు. ఈ విషయంలో తాము హైకోర్టు ఆదేశాల మేరకు పూర్తి పారదర్శకతతో వ్యవహరించామని, రీ వెరిఫికేషన్‌లో అనామికకు కేవలం 20 నుంచి ఒకే ఒక్క మార్కు పెరిగి 21 వచ్చాయని తెలిపారు. కానీ, క్లరికల్‌ మిస్టేక్‌ వల్ల ఫలితాల వెల్లడిలో 48 మార్కులు వచ్చినట్లు చూపించిందని వివరించారు. ఈ మేరకు అశోక్‌ శనివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. అనామిక రాసిన 24 పేజీల బుక్‌లెట్‌ను కూడా జత చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement