పెళ్లా...? కెరీరా...? గతంలో అమ్మాయిలంతా ఎటూ తేల్చుకోలేకపోయేవారు. కానీ ఇప్పుడు క్షణం కూడా ఆలోచించకుండా కెరీర్‌కే మొగ్గు చూపుతున్నారు. జీవితంలో నిలదొక్కుకున్న తర్వాతే ఏడడుగులు నడవాలని నిర్ణయించుకుంటున్నారు. తద్వారా ఆర్థిక స్వాతంత్య్రం లభిస్తుందని...జీవితం హాయిగా సాగుతుందని భావిస్తున్నారు. అందువల్లే విదేశాల్లో చదువులు, ఉద్యోగాలు చేస్తున్న అనంతపురంజిల్లా అమ్మాయిల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఇరవై ఏళ్లకు పెళ్లి, పాతికేళ్లకు పిల్లలు, ఇరవై ఎనిమిదేళ్లకు కెరీర్ ముగించి గృహిణిగా స్థిరపడడం...ఇది గతం. కానీ ఇప్పుడు అమ్మాయిలు కెరీర్‌ను సవాల్‌గా తీసుకుంటున్నారు. చదువు పూర్తికావాలి, ఆ తర్వాత ఉద్యోగం.. అప్పుడే పెళ్లి.. 90 శాతం మంది అమ్మాయిల్లో ఇదే ధోరణి కనిపిస్తోంది. భర్త సంపాదన మీద నేను ఆధారపడటం కాదు తన సంపాదన కూడా కుటుంబానికి ముఖ్యం కావాలి అంటున్నారు. 24 ఏళ్ల వరకూ చదువులు, ఉద్యోగాలే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్న తీరు వారిలో నిండిన ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తోంది. పెళ్లిచేసుకుని భర్త వెంట అమెరికా, కెనడా వంటి దేశాలకు డిపెండెంట్ వీసాకింద వెళ్లడం కంటే...తానే అమెరికాలో ఉద్యోగం సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకుని వెళితే.. మంచిది కదా అనే ఆలోచనతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఎక్కువ మంది ప్రొఫెషనల్ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు.
కెరీర్ సవాల్‌గా తీసుకుని..
అనంతపురం జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడు అమెరికా వెళ్తున్న అమ్మాయిలు కనిపిస్తున్నారు. ఎంబీబీఎస్ కోర్సులో గతంలో ఓపెన్ కేటగిరీలో 30 శాతం కంటే మించని అమ్మాయిల సీట్లు... ఇప్పుడు 60 శాతానికి వెళ్లాయి. అమెరికాలో రమారమి 30కిపైన ప్రధాన యూనివర్సిటీల్లో అనంతపురం జిల్లా అమ్మాయిలు చదువుతున్నట్టు తేలింది. ఇక ఏటా విదేశాలకు విద్యా, ఉద్యోగావకాశాలకోసం వెళ్తున్న వారిలో దాదాపు 40 శాతం మంది అమ్మాయిలే ఉన్నారు. ఒకప్పుడు ఇంజినీరింగ్, ఎంటెక్ కోర్సులకు జిల్లా దాటి వెళ్లని వారు... ఇప్పుడు దేశంలోని ప్రతిష్టాత్మక నిట్‌లు, ఐఐటీల్లో ప్రవేశాల కోసం పోటీపడుతున్నారు. దీన్ని బట్టి కెరీర్‌ను ఎంత సవాల్‌గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రుల ఆలోచనా విధానంలోనూ ఇప్పుడు మార్పు వచ్చింది. ఇరవై ఏళ్లకే పెళ్లి చేసి బాధ్యతలు దించుకోవాలన్న ఆలోచన ఇప్పుడు ఎవరికీ లేదు. అమ్మాయిల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు స్వేచ్ఛనిస్తున్నారు.
ముందు ఎదగాలి జీవితంలో స్థిరపడిన
తర్వాతే పెళ్లి చేసుకోవాలన్నదే ఇప్పుడు అందరి లక్ష్యం. అందుకే నేను కూ డా బీఫార్మసీ... ఆ తర్వాత ఎంఫార్మసీ పూర్తి చేశా. పీహెచ్‌డీ చేయాలని నిర్ణయించుకున్నా. ఉన్నత చదువుతో సమాజంలో ప్రతిష్ట, గౌరవం పెరుగుతుంది. ఆర్థిక భద్రత లభిస్తుంది. ఎవరిపై ఆధారపడాల్సిన పని ఉండదు. మా నాన్న కూడా ఆ దిశగా ప్రోత్సహిస్తూ చదివిస్తున్నా రు.
–ఎన్. సుశీల, ఎంఫార్మసీ, ఎస్కేయూ.
స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలి
సమాజం పురోగతి చెందాలంటే లింగ వివక్ష, అసమానతలు ఉండకూడదు. మహిళలు మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఆర్థిక, సమాజ, రాజకీయ సాధికారిత సాధిస్తున్నారు. జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలనే అంశంపై విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నాం. జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలోనూ ఇలాంటి అంశాలపై ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాను.
– డాక్టర్ వరలక్ష్మి దేవి, పరీక్షల విభాగం సమన్వయకర్త, ఎస్కేయూ
మంచి ఉద్యోగంతో గుర్తింపు
అమ్మాయిలు గతంలో మాదిరిగా ఒకరిపై ఆధారపడకూడదు. తల్లిదండ్రులకు భారం అనిపించకూడదు. ఉన్నత చదువులు అభ్యసించి మంచి ఉద్యోగం సాధిస్తే మనకంటూ ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఎప్పుడైతే స్వతంత్రంగా స్థిరపడతామో అప్పు డు మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
– బి.హిమవర్షిణి, సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్, మైక్రాన్ టెక్నాలజీ
Comments
Please login to add a commentAdd a comment