vocational courses
-
Rennie Joyy: జీవితాన్ని దిద్దుకుంది... పేదల పక్షాన నిలిచింది
రెనీ జాయ్ ఢిల్లోలో కార్పోరేట్ అడ్వకేట్. రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్కు వైస్‌ప్రెసిడెంట్. జీవితం నేర్పిన పాఠాలతో అలేఖ్ ఫౌండేషన్ పేరుతో పేద మహిళలు, పిల్లలకు ఉచితంగా వృత్తి విద్యాకోర్సులు నేర్పించి, వారి కాళ్లపై వారు నిలబడేలా సహాయం చేస్తోంది. అవసరమైనప్పుడు వారి కోసం న్యాయపోరాటాలు చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రచారం చేస్తోంది. ఈ ప్రయాణంలో ఏదీ సవ్యంగా లేదని, ఒడిదొడుకులతో నడిచిన తన జీవితాన్ని, తిరిగి దిద్దుకున్న విధానాన్ని పరిచయం చేస్తోంది. ‘‘మా తాతగారు ఆర్మీ ఉద్యోగి. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసి, చివరకు ఢిల్లీలో స్థిరపడ్డారు. మా అమ్మనాన్నలకు నేను ఒక్కదాన్నే సంతానం. నా చిన్నతనంలో మా అమ్మనాన్నలు విడివిడిగా ఉండేవారు. దీంతో నాన్న నుంచి ఎలాంటి సపోర్ట్, సాయం లభించలేదు. మా అమ్మనాన్నలు అంటే అమ్మమ్మ తాతయ్యలే. దీంతో కుటుంబం అసంపూర్తిగా ఉందని ఎప్పుడూ భావించలేదు. మా అమ్మనాన్నలు విడి విడిగా ఉన్న విషయం ఎవరికీ తెలియలేదు. ఆ రోజుల్లో విడాకులు తీసుకోవడం అనేది సమాజం దృష్ట్యా మంచిది కాదు అనే అభిప్రాయం ఉండేది. అందుకే వాళ్లు చాలా ఏళ్లు విడాకులు తీసుకోలేదు. నేను కాలేజీకి వెళ్లిన తర్వాత వారు చట్టబద్ధంగా విడిపోయారు. సమాజం ఇలా ఆలోచించడం వల్ల ఆ సమయంలో నా తల్లిదండ్రులు విడిపోయారని ఎవరికీ చెప్పుకోలేకపోయాను. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే వెంటనే నా పట్ల వారి దృక్పథం మారిపోతుందనే భయం ఉండేది. చిన్న వయసులోనే.. నా తల్లిదండ్రులు విడిపోవడానికి గల కారణాలన్నీ చూసిన తర్వాత, ఆడపిల్లలు తమ కాళ్లపై తాము నిలబడాలని నాకు చాలా చిన్న వయసులోనే అర్ధమైంది. మా అమ్మమ్మ ఎప్పుడూ ‘ఎంత సంపాదించినా, ఏ పని చేసినా ఫర్వాలేదు. కానీ, నీ కాళ్ల మీద నువ్వు నిలబడటమే ముఖ్యం’ అనేది. కుటుంబంలో ఏ సమస్య వచ్చినా దానిని నివారించే ఉపాయాలను కనుక్కోమనేది. అలాంటి వాతావరణంలో పెరగడం వల్ల పెద్దయ్యాక మహిళల హక్కుల కోసం పోరాడాలని అనుకునేదాన్ని. చదువు తర్వాత బ్యాంకింగ్ రంగంలో సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్‌లో చేరి, నా కెరీర్‌ను ప్రారంభించాను. నష్టం తెచ్చిన కష్టాలు.. మా అమ్మ జాతీయ బ్యాంకులో పనిచేసేది. ఆ ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ కాబట్టి బ్యాంకులో చేరవద్దని ఎప్పుడూ చెబుతుండేది. కానీ, మార్కెటింగ్ రంగంలో ఏదైనా చేయాలనుకున్నాను కాబట్టి బ్యాంకులో అవకాశం రాగానే వదలలేదు. ప్రతి పనినీ నేర్చుకున్నాను. పదకొండేళ్లపాటు బ్యాంకులో పనిచేశాను. అక్కడ పనితీరుతో అతి పిన్నవయసులో బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందాను. ఒకానొక సమయంలో ఉద్యోగంపై విసుగు అనిపించి స్టాక్ మార్కెట్లో కన్సల్టింగ్ పనిని ప్రారంభించాను. స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యి, తీవ్ర నష్టం చవిచూశాను. వ్యాపార భాగస్వాములు మోసం చేశారు. ఉద్యోగం మానేసిన ఏడాదిన్నర కాలం చాలా దారుణంగా గడిచింది. తిరిగి తక్కువ జీతం, ఎక్కువ పనిగంటలు చేసేలా బ్యాంక్ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. అయితే, బ్యాంకింగ్ అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సీనియర్ల సలహాతో ‘లా’ చదివాను. అప్పటికి నా కూతురికి నాలుగేళ్లు. ఓ వైపు ఉద్యోగం, మరో వైపు చదువు, ఇంటి పని.. అంత తేలికయ్యేది కాదు. స్త్రీల పనికి సమాజంలో అంత త్వరగా అంగీకారం లభించదు. ఎందుకంటే స్త్రీ సామర్థ్యాల పట్ల ప్రజల వైపు ఎప్పుడూ చిన్నచూపే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో క్లయింట్స్‌ను ఒప్పించడానికి, వారిలో విశ్వాసం కలిగించడానికి నేను రెండు రెట్లు ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. నా దృక్పథాన్ని, పని విధానాన్ని మార్చుకున్నాను. నన్ను నేను ఉత్సాహపరచుకుంటూనే ఉన్నాను. మెల్లగా నా గమ్యం వైపు కదిలి ఈ రోజు ఈ స్థితికి చేరుకున్నాను. అభిప్రాయ భేదాలు తలెత్తినా.. నా భర్తకు నాకు మధ్య అనేక విషయాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో మేమిద్దరం విడిపోవాలనుకున్నాం. భార్యాభర్తలుగా కాకుండా స్నేహితులుగా మారడం ద్వారా మా సంబంధాన్ని మరింత మెరుగ్గా కొనసాగించవచ్చని భావించాను. నా కూతురికి మంచి పెంపకాన్ని అందించడానికి అన్ని ముఖ్యమైన నిర్ణయాలు కలిసి తీసుకుంటాం. కానీ, మేం విడిగానే ఉంటాం. మా కుటుంబంలో ‘లా’ చదివినవారు ఎవరూ లేరు. నేను చాలా కేసుల్లో మహిళల తరపున నిలబడి న్యాయం చేశాను. ఈ రంగంలో లీగల్ అడ్వైజర్‌గా నాదైన ముద్ర వేయగలిగాను. 2015లో అలేఖ్ ఫౌండేషన్‌ను ప్రారంభించి మహిళల జీవితాలను మెరుగుపరిచే పనిని చేపట్టాను. లైంగిక వేధింపులకు గురైన పిల్లలు, మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తాను. ఫౌండేషన్ ద్వారా బాలికా విద్య, వృత్తి విద్యలలో నైపుణ్యాలకు సంబంధించిన కోర్సులు ఇవ్వడంలో కృషి చేస్తున్నారు. రొమ్ము క్యాన్సర్, పీరియడ్స్, శానిటేషన్ వంటి ఆరోగ్య సమస్యలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ.. నిరుపేద బాలికల చదువుకు బాధ్యత తీసుకున్నాను. ఇటీవల నాగాలాండ్‌లో సౌండ్ ఇంజనీరింగ్ లో శిక్షణ ఇవ్వడానికి ఒక కాలేజీతో టై అప్ అయ్యాం. దీనికి అయ్యే ఖర్చులను ఫౌండేషన్ భరిస్తుంది. పర్యావరణానికి మేలు కలిగేలా అవగాహన, ప్రచారం నిర్వహిస్తున్నాను. వాతావరణ మార్పుల నుండి చెట్లను ర క్షించడం, ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించడం, పేపర్‌లెస్ జీవనశైలిని ప్రోత్సహించడం చేస్తుంటాను’’ అని తన ప్రస్థానాన్ని వివరించింది రెనీ. -
ఆమె అక్షర... లక్ష్మి
సాక్షి, హైదరాబాద్: ఆడపిల్ల పాఠశాల విద్య పూర్తి చేయడమే గగనం. అవును నిజం.. కానీ ఇప్పుడది గతం. నేడు అగ్రభాగం ఆమె సొంతం. బడిలో బాలికలదే ముందంజ. ఉన్నత చదువు ల్లోనూ వనితే ఫస్ట్. అక్షరాన్ని ఆయుధంగా భావిస్తున్న నేటి మహిళలు విద్యారంగంలో సత్తా చాటుతున్నారు. ఇంకా ‘సగభాగమేంటి?’.. అంతకు మించే అని గర్వంగా చెబుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు..ఏ విశ్వవిద్యాలయాని కెళ్ళినా ప్రవేశాల సంఖ్యలో అమ్మాయిలదే మొదటి స్థానం. వందేళ్ళు దాటిన ఉస్మానియా సహా చాలా వర్సిటీల్లో వారే అధిక సంఖ్యలో ఉన్నారు. సంప్రదాయాల సంకెళ్లు తొలగి అవగాహన, ఆధునికత పెరగడం, దానికి తగినట్టుగా బడులు, కళాశాలలు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి రావడం, ప్రత్యేక పాఠశాలలు, కాలేజీలు కూడా ఏర్పాటు కావడం, విద్య అవసరం అనే భావన పెంపొందడం..ఇవన్నీ మహిళలను ఉన్నత విద్య వైపు నడిపిస్తున్నాయి. అందుకే ఏ వర్సిటీ చూసినా, ఏ కోర్సు పరిశీలించినా మహిళల శాతమే మెరుగ్గా ఉంటోంది. అబ్బురపరిచే అంకెలు ► ఉస్మానియా వర్సిటీ పరిధిలో లా, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్, బీఎడ్‌కు సంబంధించిన 20 కాలేజీలుంటే, అందులో 18,763 సీట్లున్నాయి. 2022లో వీటిల్లో 10,897 సీట్లు (58.09 శాతం) అమ్మాయిలే దక్కించుకున్నారు. ఓయూ క్యాంపస్‌లో 1,599 సీట్లుంటే 1,083 సీట్లు వారివే. పీజీ సెంటర్స్‌లోని 202 సీట్లలో అమ్మాయిల వాటా 107. ► జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో 2010–11లో 58 శాతం సీట్లు అబ్బాయిలతో భర్తీ అయ్యాయి. 2022లో సీన్ దాదాపు రివర్స్ అయ్యింది. చేరికల్లో అబ్బాయిలది 45 శాతం అయితే, అమ్మాయిలది 55 శాతం. ► పీజీలోనూ అమ్మాయిలదే హవా. వివిధ కోర్సుల్లో దాదాపు 80 శాతం మహిళలే ఉండటం విశేషం. కరోనా తర్వాత బాలురు ఇంజనీరింగ్, డిగ్రీతో ఉపాధి వైపు వెళ్తుంటే, అమ్మాయిలు మాత్రం పీజీలో చేరుతున్నారు. పరిశోధనల వరకూ వెళ్ళాలి మహిళల్లో ఇప్పటికే చాలా మార్పు వచ్చింది. పోస్టు–గ్రాడ్యుయేషన్ వరకూ ఎక్కడా ఆగకుండా ముందుకెళ్తున్నారు. కానీ రీసెర్చ్ వరకూ వెళ్ళలేకపోతున్నారు. ఆరేళ్ళ వరకూ సమయం వెచ్చించాల్సి రావడం కొంత ఇబ్బందిగానే ఉంది. దీన్ని దృష్టిలో ఉవంచుకుని మహిళలు, వారి తల్లిదండ్రుల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. – ప్రొఫెసర్ విజ్జులత, వీసీ, తెలంగాణ మహిళా యూనివర్సిటీ సాధికారత సాధించాలి విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోంది. సామాజిక మార్పులు, ప్రభుత్వాల ప్రోత్సాహం వల్లే సమాజంలో మహిళలు ముందడుగు వేస్తున్నారు. పురుషులతో సమానంగా మహిళలూ పోటీ పడుతున్న తీరు అభినందనీయం. మహిళాలోకం ఇదే స్ఫూర్తితో మరింత ముందడుగు వేయాలి. సాధికారిత సాధించాలి. – వాకాటి కరుణ, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డిజిటల్ టెక్నాలజీ వైపు అడుగులేయాలి విద్యా రంగంలో అనునిత్యం వస్తున్న మార్పులకు అనుగుణంగా మహిళలూ ముందుకెళుతున్నారు. వృత్తి విద్యా కోర్సుల్లో రాణించేలా ప్రస్తుత సమాజ పోకడలను అవగతం చేసుకుంటున్నారు. విద్యావంతులైన తల్లిదండ్రుల శాతం పెరగడమూ మహిళా విద్యకు ఊతం ఇస్తోంది. ప్రతి మహిళా డిజిటల్ టెక్నాలజీలో మరింత ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే మా క్యాంపస్‌లో ప్రత్యేక కోర్సును డిజిటల్ టెక్నాలజీలో ప్రవేశపెడుతున్నాం. భవిష్యత్‌లో అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. – ప్రొఫెసర్ కవిత దార్నా, వీసీ, జేఎన్ఎఫ్ఏ విధాన నిర్ణేతలుగా ఎదగాలి చదువుతో సామాజికంగా మహిళ ఉన్నత శిఖరాలనే అధిరోహిస్తోంది. అయితే క్రిటికల్ జాబ్స్‌లో ఇంకా మహిళకు ఎదురీత తప్పడం లేదు. విధాన పరమైన నిర్ణయాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితే ఈ పరిస్థితి మారుతుంది. అత్యున్నత పదవుల్లో ఉన్నా మహిళకు ఇంటి బాధ్యతలు తప్పడం లేదు. పురుషాధిక్య మానసిక ధోరణే దీనికి ప్రధాన కారణం. – సూర్యదేవర నీలిమ, సీఈఓ, అనురాగ్ యూనివర్సిటీ -
దేశంలో ఏకీకృత క్రెడిట్ విధానం
సాక్షి, అమరావతి : దేశంలోని ప్రొఫెషనల్, ఒకేషనల్ కోర్సులకు ఒకే క్రెడిట్ విధానాన్ని అమలుచేసేలా యూనిఫైడ్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్‌ను అఖిల భారత సాంకేతిక విద్యామండలి ప్రవేశపెట్టింది. పదో తరగతి నుంచి పీహెచ్డీ వరకు ఒకేషనల్, ప్రొఫెషనల్ కోర్సులను ఎక్కడ అభ్యసించినా క్రెడిట్లను ఒకే విధానంలో కేటాయించనున్నారు. ఈ మేరకు దేశంలోని అన్ని సాంకేతిక విశ్వవిద్యాలయాల ఉప కులపతులు, గుర్తింపు పొందిన విద్యాసంస్థల డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లకు ఏఐసీటీఈ ఆదేశాలిచ్చింది. నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌హెచ్‌ఈక్యూఎఫ్), నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఎస్క్యూఎఫ్)లకు సంబంధించి జాతీయ నూతన విద్యా విధానం–2020లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఏఐసీటీఈ శుక్రవారం విడుదల చేసిన సర్క్యులర్‌లో వివరించింది. ఈ విధానాన్ని అన్ని యూనివర్సిటీలు, విద్యా సంస్థలు అమలు చేయాలని నిర్దేశించింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేలా.. విద్యార్థులు ఒక తరగతి నుంచి పైతరగతుల్లో ప్రవేశించే సమయంలో ఈ క్రెడిట్ల ఆధారంగా ప్రొఫెషనల్, ఒకేషనల్ స్కిల్ గ్యాప్లుంటే గనుక వారి కోసం ఆయా విద్యాసంస్థలు ప్రత్యేక బ్రిడ్జి కోర్సులు నిర్వహించాలని సూచించింది. ప్రతి విద్యార్థీ తాను అభ్యసించిన కోర్సును పూర్తి చేసి బయటకు రాగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేలా ఆయా కోర్సుల నైపుణ్యాలను మెరుగుపర్చాలని, ఆయా కోర్సుల మొదటి సంవత్సరం నుంచే ఇందుకు అనుగుణంగా కరిక్యులమ్‌ను ప్రవేశపెట్టాలని పేర్కొంది. ప్రస్తుతం రూపొందించిన ఏకీకృత క్రెడిట్ విధానానికి అనుగుణంగా ఆయా సంస్థలు తమ నిబంధనలను సవరించుకోవాలని ఏఐసీటీఈ సూచించింది. వివిధ తరగతుల్లో ఏకీకృత క్రెడిట్ విధానం ఇలా అకడమిక్ లెవల్ యూనిఫైడ్ క్రెడిట్లు 10వ తరగతి 3.0 11వ తరగతి 3.5 12వ తరగతి/డిప్లొమా సెకండియర్ 4.0 ఫైనలియర్ డిప్లొమా 4.5 డిగ్రీ(యూజీ) ఫస్టియర్ 4.5 యూజీ సెకండియర్ 5.0 యూజీ థర్డ్ ఇయర్ 5.5 ఫైనలియర్ యూజీ డిగ్రీ 6.0 ఫస్టియర్ పీజీ 6.5 ఫైనలియర్ పీజీ 7.0 పీహెచ్డీ 8.0 -
ఉపాధికి ఊతమిచ్చేలా.. ఇంటర్ ఒకేషనల్ కోర్సులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధికి ఊతమిచ్చేలా ఇంటర్ ఒకేషనల్ విద్యపై ఇంటర్మీడియెట్ బోర్డు దృష్టి సారించింది. జూనియర్ కాలేజీల్లో ఒకేషనల్ కోర్సుల ద్వారా విద్యార్థులకు మేలు జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇంటర్ ఒకేషనల్ కోర్సులు చదువుతున్నవారితో అప్రెంటీస్‌షిప్ చేసేందుకు వీలుగా పలు కంపెనీలను అనుసంధానం చేస్తోంది. అంతేకాకుండా విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగయ్యేలా చర్యలు చేపడుతోంది. 80 వేల మందికి పైగా విద్యార్థులు.. ఒకేషనల్ కోర్సులను సంబంధిత ప్రత్యేక కాలేజీల్లోనే కాకుండా రెగ్యులర్ కాలేజీల్లోనూ ఇంటర్మీడియెట్ బోర్డు అందిస్తోంది. రాష్ట్రంలో ఇంటర్ ఒకేషనల్ కాలేజీలు 8 ఉండగా రెగ్యులర్ కాలేజీలు 464 ఉన్నాయి. రెగ్యులర్ కాలేజీల్లో మామూలు కోర్సులతోపాటు అదనంగా వీటిని బోధిస్తున్నారు. ఫస్టియర్‌లో 23 రకాల కోర్సులు, సెకండియర్‌లో 25 రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 80 వేల మందికిపైగా ఒకేషనల్ కోర్సులను అభ్యసిస్తున్నారు. ప్రతినెలా ఉపకార వేతనం.. ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసినవారికి అప్రెంటీస్‌షిప్ కోసం ఇంటర్ బోర్డు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఏటా వివిధ కంపెనీలన్నింటినీ ఒకే చోటకు చేర్చి మేళాలను నిర్వహిస్తోంది. ఈ నెల 22న రాష్ట్రంలో ముఖ్య పట్టణాల్లో ఈ మేళాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఆయా కంపెనీల్లో అప్రెంటీస్‌షిప్ పూర్తి చేయగానే వారికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’ (ఆర్డీఎస్డీఈ) ద్వారా సర్టిఫికెట్లు జారీ అవుతాయి. ఈ ధ్రువపత్రాలను కంపెనీలు ప్రముఖంగా పరిగణనలోకి తీసుకుంటాయి. అప్రెంటీస్‌షిప్‌లో విద్యార్థులకు సంబంధిత కంపెనీ, ఆర్డీఎస్డీఈ కలిపి నెలకు రూ.7 వేలు చొప్పున ఉపకార వేతనం కూడా అందిస్తున్నాయి. సర్టిఫికెట్లు పొందిన వారి కోసం ఏటా మార్చిలో కంపెనీలతో కలసి ఇంటర్ బోర్డు జాబ్ మేళాలను నిర్వహిస్తోంది. అలాగే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ ఫ్లూయెన్సీ, కంప్యూటర్ పరిజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాల్లో శిక్షణ ఇప్పించనుంది. డిమాండ్ ఉన్న కోర్సులు కూడా.. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకనుగుణంగా ఇంటర్ బోర్డు ఒకేషనల్ కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సులన్నిటికీ చాలా డిమాండ్ ఉంది. వీటిలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ప్రింటింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, మెకానికల్, ఆటోమొబైల్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సులున్నాయి. ఇవే కాకుండా కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, టూరిజం–ట్రావెల్ టెక్నిక్స్ కోర్సులూ విద్యార్థులకు మేలు చేకూరుస్తున్నాయి. ఇక వైద్య రంగానికి సంబంధించి మల్టీపర్పస్ హెల్త్‌వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరఫీ, ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్ కోర్సులకు అపార ఉద్యోగావకాశాలు ఉన్నాయి. కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, ఫ్యాషన్–గార్మెంట్ మేకింగ్ కోర్సులు పూర్తి చేసినవారికి ఆయా కంపెనీలు ఉద్యోగాలు ఇస్తున్నాయి. పదో తరగతి తప్పినవారికి షార్ట్ టర్మ్ కోర్సులు పదో తరగతి తప్పినవారికి కూడా ఇంటర్ బోర్డ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ (ఓజేటీ) కింద 3, 9 నెలల కాలవ్యవధితో షార్ట్ టర్మ్ ఒకేషనల్ కోర్సులను ప్రవేశపెట్టింది. ఈ కోర్సులను కూడా విద్యార్థులకు ఉపాధి కల్పించేలా రూపొందించారు. అగ్రికల్చర్లో 8, బిజినెస్ కామర్స్, రిటైల్ మార్కెటింగ్‌ల్లో 11, కంప్యూటర్ సైన్స్‌లో 16, ఇంజనీరింగ్ టెక్నాలజీలో 15, హోం సైన్స్‌లో 14, హ్యుమానిటీస్‌లో 2, పారామెడికల్ విభాగంలో 6 కోర్సులు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్‌లో వెబ్ డిజైనింగ్, కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఆఫీస్, యూనిక్స్ సీ అండ్ సీ ప్లస్ ప్లస్, వీబీ, ఒరాకిల్, పైథాన్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, మల్టీమీడియా గ్రాఫిక్స్, యానిమేషన్, డేటా సైన్స్ వంటి జాబ్ ఓరియెంటెడ్ కోర్సులతో విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఉద్యోగం, ఉపాధి అందించే కోర్సులు ఇంటర్ ఒకేషనల్ కోర్సులన్నీ ఇంచుమించు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేవే. ఇందుకోసం అధ్యాపకులను బృందాలుగా ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో కంపెనీలతోపాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇంటర్ బోర్డు కోర్సులకు రూపకల్పన చేసింది. ప్రధానంగా అగ్రికల్చర్, బిజినెస్–కామర్స్, ఇంజనీరింగ్ టెక్నాలజీ, హ్యుమానిటీస్, హోంసైన్స్, పారామెడికల్ విభాగాల్లో ఒకేషనల్ కోర్సులు ఉన్నాయి. అగ్రికల్చర్లో.. క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్, సెరికల్చర్, ఫిషరీస్, లైవ్‌స్టాక్ మేనేజ్మెంట్, డెయిరీ కోర్సులున్నాయి. బిజినెస్–కామర్స్‌లో.. అకౌంటింగ్ ట్యాక్సేషన్, ఆఫీస్ అసిస్టెంట్‌షిప్, బ్యాంకింగ్, రిటైల్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, మార్కెటింగ్ కోర్సులున్నాయి. -
ఉచితంగా వృత్తి విద్యా కోర్సులు
సాక్షి, అమరావతి: విద్యార్థులలో ఆధునిక సాంకేతిక, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ద్వారా పరిశ్రమలు, ఇతర సంస్థల అవసరాలకు తగ్గట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు వారికి ఆధునిక నైపుణ్య కోర్సులను అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీ (నాస్కామ్)ల సహకారంతో వృత్తివిద్య, నైపుణ్య సర్టిఫికెట్ కోర్సులను అందించనుంది. విద్యార్థులే కాకుండా ఆయా వర్సిటీల పరిధిలోని కాలేజీల అధ్యాపకులకూ వీటిని నేర్పిస్తారు. ఇటువంటి కోర్సులు ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం. సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు ఈ కోర్సులను ప్రత్యేక వెబ్సైట్ ద్వారా అందించనున్నారు. ఇటీవల ఉన్నత విద్యామండలి ఆయా సంస్థల నిపుణులతో సమావేశమై ఈ ఆన్లైన్ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. ఉన్నత విద్యా మండల చైర్మన్ ప్రొ. కె.హేమచంద్రారెడ్డి, నేషనల్ ఎడ్యుకేషన్ అలయెన్స్ ఫర్ టెక్నాలజీ–ఎన్‌ఈఏటీ (ఏఐసీటీఈ అనుబంధ విభాగం) కోఆరి్డనేటర్ డాక్టర్ చంద్రశేఖర్ బుద్ధా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డాక్టర్ సంధ్య చింతల, అడోబ్ ప్రతినిధి గరిమా, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు కె.రామ్మోహనరావు, టి.లక్ష్మమ్మ తదితరులు వీటిపై చర్చించి కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. ఆన్లైన్ ప్రొఫెషనల్ కోర్సులు ఇవీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చైన్ టెక్నాలజీ, బిగ్‌డేటా విశ్లేషణ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, వెబ్ మొబైల్ డెవలప్మెంట్, మార్కెటింగ్, వర్చువల్ రియాలిటీ, 3డీ ప్రింటింగ్. సాంకేతిక నైపుణ్య కోర్సులు.. ప్రాబ్లెమ్ సాల్వింగ్, డిజైన్ థింకింగ్, నిరంతర అభ్యాసం, ప్రాజెక్ట్ నిర్వహణ, చర్చలు.. ప్రభావం.. సహకారం, ఉత్పత్తి నిర్వహణ, ప్రోగ్రామ్ నిర్వహణ, డిజిటల్ లీడర్షిప్ అండ్ కమ్యూనికేషన్, స్టోరీ టెల్లింగ్ ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు ఈ కోర్సులన్నింటినీ విశ్వవిద్యాలయాల పరిధిలోని కాలేజీల అధ్యాపకులు, విద్యార్థులకు అందించనున్నారు. దీనికోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు. ‘హెచ్‌టీటీపీఎస్://ఎల్ఐఎఫ్ఈఎస్కేఐఎల్ఎల్ఎస్పీఆర్ఐఎంఈ.ఐఎన్’ లో లాగిన్ అయి అధ్యాపకులు, విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నేరుగా తమ గూగుల్ అకౌంట్ ద్వారా వెబ్‌పేజీలోని ఆయా కోర్సులను క్లిక్ చేయడం ద్వారా ఆన్లైన్లోనే వాటిని నేర్చుకోవచ్చు. అయితే, ప్రతి కోర్సులోనూ వారి అభ్యసన ఫలితాలను, నైపుణ్యాలను గుర్తించేందుకు తుది పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ధ్రువీకరణ పత్రాలు జారీచేస్తారు. అభ్యసన సమయంలో అభ్యాసకుడికి సహాయపడేందుకు ‘మై గైడ్’ ఆప్షన్ కింద నిపుణుడైన అధ్యాపకులను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి ఏఐసీటీఈ, నాస్కామ్లు ధ్రువీకరణతో సర్టిఫికేట్లు ఇస్తారు. ప్రతి కోర్సుకు నిర్దేశిత కాలం ప్రకారం వారి సాధించిన నైపుణ్యాలు, ప్రమాణాల ఆధారంగా క్రెడిట్లు ఇస్తారు. ఈ క్రెడిట్లు వారి రెగ్యులర్ కోర్సులకు కలిసేలా అవకాశం కల్పిస్తున్నారు. తద్వారా విద్యార్థుల అకడమిక్ క్రెడిట్లు మరింత పెరిగేందుకు ఆస్కారమేర్పడుతుంది. ఈ కోర్సులకు అభ్యర్థులు ఈ ఏడాది జూన్ 21 వరకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సీఎం ఆదేశాలతో ముందడుగు విద్యార్థులలో వివిధ ఆధునిక సాంకేతక నైపుణ్యాలను పెంచేందుకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఉన్నత విద్యామండలి ఈ కోర్సుల ద్వారా ముందడుగు వేస్తోంది. డిమాండ్ ఉన్న అంశాలలో నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగాల సాధన మరింత సులభమవుతుంది. – ప్రొ. కె.హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
కేజీబీవీల్లో వొకేషనల్ కోర్సులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) వొకేషనల్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వాటిల్లో చదివే వారంతా బాలికలే అయినందునా పదో తరగతి పూర్తయిన వారి కోసం వాటిని ప్రవేశపెట్టాలని, తద్వారా ఉపాధి అవకాశాలను కల్పించవచ్చని భావిస్తోంది. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నిషి యన్ వంటి కోర్సులను వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని మరో 50 కేజీబీవీల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్‌ను ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 475 కేజీబీవీలు ఉండగా, అందులో గతేడాది 84 కేజీబీవీల్లో ఇంటర్‌ను ప్రారంభించింది. అంతకుముందు సంవత్సరంలో 88 స్కూళ్లలో ఇంటర్మీడియెట్‌ను ప్రవేశపెట్టింది. ఈసారి జిల్లాకు ఒకటి లేదా రెండు చొప్పున కేజీబీవీల్లో ఇంటర్‌ను ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. -
సీటు ఇవ్వండి ప్లీజ్!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో ప్రవేశాలకు డిమాండ్ తీవ్రంగా ఉంది. కాలేజీ విద్యతో పాటు వృత్తి విద్యాకోర్సులు, పోటీ పరీక్షలవైపు దృష్టి పెడుతున్న విద్యార్థులు వసతిగృహాల్లో ప్రవేశాలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో సంక్షేమ వసతిగృహాలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 430 పోస్టుమెట్రిక్ హాస్టళ్లున్నాయి. వీటిలో 43 వేల మందికి మాత్రమే ప్రవేశాలు పొందే వీలుంటుంది. కానీ ప్రవేశాలకున్న డిమాండ్ దృష్ట్యా 68 వేల మంది దర ఖాస్తు చేసుకున్నారు. దీంతో అందుబాటులో ఉన్న సీట్ల మేరకు సంక్షేమాధికారులు అడ్మిషన్లు ఇవ్వడంతో మిగతా విద్యార్థులు ప్రవేశాల కోసం సంక్షేమ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ప్రి మెట్రిక్ నుంచి పోస్టు మెట్రిక్కు... ప్రస్తుతం కొన్నిచోట్ల ప్రి మెట్రిక్ హాస్టళ్లలో విద్యార్థులు లేకపోవడంతో వాటిని పోస్టుమెట్రిక్ హాస్టళ్లుగా మార్చాలని ఆయా సంక్షేమ శాఖలు యోచిస్తున్నా యి. దీంతో దాదాపు 50 వసతిగృహాలు మారే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రతిపాదనలు సమర్పించినప్పటికీ ప్రభుత్వం ఆమోదించకపోవడంతో హాస్టళ్ల మార్పు అంశం పెండింగ్‌లో ఉంది. క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఒత్తిడిని అధిగమించేందుకు వసతి గృహానికి 20 మంది చొప్పున కనిష్టంగా 6 వేల సీట్లు పెంచాలని సంక్షేమ శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ వసతి గృహా ల్లో 3 వేలు, బీసీ వసతిగృహాల్లో మరో 3 వేల చొప్పు న సీట్లు్ల పెంచాలని కోరారు. ప్రస్తుతం పోస్టుమెట్రిక్ కోర్సుల ప్రవేశాల ప్రక్రియ చివరిదశలో ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోపు సీట్ల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంక్షేమాధికారులు అభిప్రాయపడుతున్నారు. -
వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నాంపల్లి బజార్‌ఘాట్ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాల దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆటోమొబైల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్(ఏఈటీ), ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ టెక్నీషియన్(ఈఈటీ), ఎలక్ట్రికల్ టెక్నీషియన్(ఈటీ), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్(సీఎస్ఈ), డైరీయింగ్, టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్, అకౌంటెన్సీ అండ్ టాక్సేషన్, ఆఫీస్ అసిస్టెంట్(ఓఏ), రిటైల్ మేనేజ్మెంట్(ఆర్ఎం), మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్(ఎంఎల్టీ) తదితర కోర్సుల్లో సీట్లు ఉన్నాయని కళాశాల ప్రిన్సిపాల్ మహ్మద్ అయాజ్ అలీఖాన్ తెలిపారు. ఈ కోర్సుల్లో చేరేందుకు పదో తరగతి ఉత్తీర్ణులు, ఇంటర్ పాస్, ఫెయిలైన వారు అర్హులని వెల్లడించారు. మైనార్టీ, ఎస్టీ, ఎస్సీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఉంటాయన్నారు. కోర్సులు పూర్తి చేసిన వారికి జాబ్ ప్లేస్‌మెంట్స్ ఉంటాయని చెప్పారు. వివరాలకు 9395554558 నంబర్లో సంప్రదించవచ్చు. -
ఒకేషనల్ అభ్యర్థులకు పాలిటెక్నిక్‌లో ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్‌లో ఒకేషనల్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా పాలిటెక్నిక్ సెకండియర్‌లో అడ్మిషన్ పొందవచ్చని సాంకేతిక విద్యాశాఖ డెరైక్టర్ ఎంవీ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని sbtet.telangana.gov.in, dtets.cgg.gov.in వెబ్సైట్ల నుంచి పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. పాలిసెట్ వెరిఫికేషన్‌కు హాజరుకండి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) స్కూళ్లలో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈనెల 20 నుంచి ప్రారంభం అయ్యే పాలిసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావచ్చని సాంకేతిక విద్యా శాఖ తెలిపింది. పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు 1,100 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ విద్యార్థుల ఫలితాలు ఈ నెల 27 తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో వారికి పదో తరగతి మోమోలు రాలేదు. దీంతో విద్యార్థులు మిగతా సర్టిఫికెట్లతో వెరిఫికేషన్‌కు హాజరు కావచ్చని సాంకేతిక విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే జూన్ 1న సీట్ల కేటాయింపునకు ముందు పదో తరగతి మెమోలను అందజేస్తే సరిపోతుందని తెలిపారు. -
ఉన్నత విద్యలో వృత్తి విద్యకు పెద్దపీట
విద్యాశాఖ కార్యదర్శుల భేటీలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో వృత్తి విద్యకు పెద్దపీట వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం ఢిల్లీలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రం నుంచి ఈ సమావేశానికి హాజరైన విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్.. అందులో చర్చించిన అంశాలను వెల్లడించారు. ఉన్నత విద్య కోర్సులను పూర్తి చేసిన వెంటనే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభించేలా నైపుణ్యాల అభివృద్ధి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ స్థాయి వరకు వృత్తి విద్యా కోర్సులను ప్రవేశ పెట్టాలన్న అభిప్రాయానికి వచ్చింది. పారిశ్రామిక వర్గాల అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా కో ర్సుల్లో సిలబస్‌ను మార్పులు చేయాలని, త ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిం చవచ్చని పేర్కొంది. దీంతోపాటు నైపుణ్యాల అభివృద్ధికి ప్రతే ్యక మంత్రిత్వశాఖను ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చింది.