ఉపాధికి ఊతమిచ్చేలా.. ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సులు | Inter Vocational Courses to boostup employment creation | Sakshi
Sakshi News home page

ఉపాధికి ఊతమిచ్చేలా.. ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సులు

Published Tue, Feb 8 2022 3:43 AM | Last Updated on Tue, Feb 8 2022 3:43 AM

Inter Vocational Courses to boostup employment creation - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధికి ఊతమిచ్చేలా ఇంటర్‌ ఒకేషనల్‌ విద్యపై ఇంటర్మీడియెట్‌ బోర్డు దృష్టి సారించింది. జూనియర్‌ కాలేజీల్లో ఒకేషనల్‌ కోర్సుల ద్వారా విద్యార్థులకు మేలు జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సులు చదువుతున్నవారితో అప్రెంటీస్‌షిప్‌ చేసేందుకు వీలుగా పలు కంపెనీలను అనుసంధానం చేస్తోంది. అంతేకాకుండా విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగయ్యేలా చర్యలు చేపడుతోంది.

80 వేల మందికి పైగా విద్యార్థులు..
ఒకేషనల్‌ కోర్సులను సంబంధిత ప్రత్యేక కాలేజీల్లోనే కాకుండా రెగ్యులర్‌ కాలేజీల్లోనూ ఇంటర్మీడియెట్‌ బోర్డు అందిస్తోంది. రాష్ట్రంలో ఇంటర్‌ ఒకేషనల్‌ కాలేజీలు 8 ఉండగా రెగ్యులర్‌ కాలేజీలు 464 ఉన్నాయి. రెగ్యులర్‌ కాలేజీల్లో మామూలు కోర్సులతోపాటు అదనంగా వీటిని బోధిస్తున్నారు. ఫస్టియర్‌లో 23 రకాల కోర్సులు, సెకండియర్‌లో 25 రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 80 వేల మందికిపైగా ఒకేషనల్‌ కోర్సులను అభ్యసిస్తున్నారు.

ప్రతినెలా ఉపకార వేతనం..
ఒకేషనల్‌ కోర్సులు పూర్తి చేసినవారికి అప్రెంటీస్‌షిప్‌ కోసం ఇంటర్‌ బోర్డు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఏటా వివిధ కంపెనీలన్నింటినీ ఒకే చోటకు చేర్చి మేళాలను నిర్వహిస్తోంది. ఈ నెల 22న రాష్ట్రంలో ముఖ్య పట్టణాల్లో ఈ మేళాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఒకేషనల్‌ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఆయా కంపెనీల్లో అప్రెంటీస్‌షిప్‌ పూర్తి చేయగానే వారికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘రీజనల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌’ (ఆర్డీఎస్‌డీఈ) ద్వారా సర్టిఫికెట్లు జారీ అవుతాయి. ఈ ధ్రువపత్రాలను కంపెనీలు ప్రముఖంగా పరిగణనలోకి తీసుకుంటాయి. అప్రెంటీస్‌షిప్‌లో విద్యార్థులకు సంబంధిత కంపెనీ, ఆర్డీఎస్‌డీఈ కలిపి నెలకు రూ.7 వేలు చొప్పున ఉపకార వేతనం కూడా అందిస్తున్నాయి. సర్టిఫికెట్లు పొందిన వారి కోసం ఏటా మార్చిలో కంపెనీలతో కలసి ఇంటర్‌ బోర్డు జాబ్‌ మేళాలను నిర్వహిస్తోంది. అలాగే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇంగ్లిష్‌ ఫ్లూయెన్సీ, కంప్యూటర్‌ పరిజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాల్లో శిక్షణ ఇప్పించనుంది.

డిమాండ్‌ ఉన్న కోర్సులు కూడా..
ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకనుగుణంగా ఇంటర్‌ బోర్డు ఒకేషనల్‌ కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సులన్నిటికీ చాలా డిమాండ్‌ ఉంది. వీటిలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, ప్రింటింగ్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ టెక్నీషియన్, మెకానికల్, ఆటోమొబైల్‌ టెక్నీషియన్, ఎలక్ట్రికల్‌ టెక్నీషియన్, సివిల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులున్నాయి. ఇవే కాకుండా కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ అండ్‌ యానిమేషన్, టూరిజం–ట్రావెల్‌ టెక్నిక్స్‌ కోర్సులూ విద్యార్థులకు మేలు చేకూరుస్తున్నాయి. ఇక వైద్య రంగానికి సంబంధించి మల్టీపర్పస్‌ హెల్త్‌వర్కర్, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్, ఫిజియోథెరఫీ, ఆఫ్తాల్మిక్‌ టెక్నీషియన్‌ కోర్సులకు అపార ఉద్యోగావకాశాలు ఉన్నాయి. కమర్షియల్‌ గార్మెంట్‌ టెక్నాలజీ, ఫ్యాషన్‌–గార్మెంట్‌ మేకింగ్‌ కోర్సులు పూర్తి చేసినవారికి ఆయా కంపెనీలు ఉద్యోగాలు ఇస్తున్నాయి.

పదో తరగతి తప్పినవారికి షార్ట్‌ టర్మ్‌ కోర్సులు
పదో తరగతి తప్పినవారికి కూడా ఇంటర్‌ బోర్డ్‌ ఆన్‌ జాబ్‌ ట్రైనింగ్‌ (ఓజేటీ) కింద 3, 9 నెలల కాలవ్యవధితో షార్ట్‌ టర్మ్‌ ఒకేషనల్‌ కోర్సులను ప్రవేశపెట్టింది. ఈ కోర్సులను కూడా విద్యార్థులకు ఉపాధి కల్పించేలా రూపొందించారు. అగ్రికల్చర్‌లో 8, బిజినెస్‌ కామర్స్, రిటైల్‌ మార్కెటింగ్‌ల్లో 11, కంప్యూటర్‌ సైన్స్‌లో 16, ఇంజనీరింగ్‌ టెక్నాలజీలో 15, హోం సైన్స్‌లో 14, హ్యుమానిటీస్‌లో 2, పారామెడికల్‌ విభాగంలో 6 కోర్సులు ఉన్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌లో వెబ్‌ డిజైనింగ్, కంప్యూటర్‌ ఫండమెంటల్స్, ఎంఎస్‌ ఆఫీస్, యూనిక్స్‌ సీ అండ్‌ సీ ప్లస్‌ ప్లస్, వీబీ, ఒరాకిల్, పైథాన్, మొబైల్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్, మల్టీమీడియా గ్రాఫిక్స్, యానిమేషన్, డేటా సైన్స్‌ వంటి జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సులతో విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి.

ఉద్యోగం, ఉపాధి అందించే కోర్సులు
ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సులన్నీ ఇంచుమించు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేవే. ఇందుకోసం అధ్యాపకులను బృందాలుగా ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో కంపెనీలతోపాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇంటర్‌ బోర్డు కోర్సులకు రూపకల్పన చేసింది. ప్రధానంగా అగ్రికల్చర్, బిజినెస్‌–కామర్స్, ఇంజనీరింగ్‌ టెక్నాలజీ, హ్యుమానిటీస్, హోంసైన్స్, పారామెడికల్‌ విభాగాల్లో ఒకేషనల్‌ కోర్సులు ఉన్నాయి. అగ్రికల్చర్‌లో.. క్రాప్‌ ప్రొడక్షన్‌ మేనేజ్‌మెంట్, సెరికల్చర్, ఫిషరీస్, లైవ్‌స్టాక్‌ మేనేజ్‌మెంట్, డెయిరీ కోర్సులున్నాయి. బిజినెస్‌–కామర్స్‌లో.. అకౌంటింగ్‌ ట్యాక్సేషన్, ఆఫీస్‌ అసిస్టెంట్‌షిప్, బ్యాంకింగ్, రిటైల్‌ మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్, మార్కెటింగ్‌ కోర్సులున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement