మన వర్సిటీలు ప్రపంచంలో మేటి | Indian Universities Gain Global Recognition says PM Narendra Modi | Sakshi
Sakshi News home page

మన వర్సిటీలు ప్రపంచంలో మేటి

Published Sat, Jul 1 2023 5:32 AM | Last Updated on Sat, Jul 1 2023 5:32 AM

Indian Universities Gain Global Recognition says PM Narendra Modi - Sakshi

రైలు బోగీలో విద్యార్థులతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ:  విద్యా రంగంలో కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లలో అమల్లోకి తీసుకొచి్చన విధానాలు, తీసుకున్న నిర్ణయాలతో భారతీయ విశ్వవిద్యాలయాలకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మన వర్సిటీలు ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతున్నాయని చెప్పారు. శుక్రవారం ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2014లో క్యూఎస్‌ గ్లోబల్‌ ర్యాంకింగ్స్‌లో కేవలం 12 భారతీయ యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయని, ఇప్పుడు వాటి సంఖ్య 45కు చేరుకుందని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, ఎన్‌ఐటీల సంఖ్య పెరిగిందని చెప్పారు. నవ భారత నిర్మాణంలో అవి విశిష్టమైన పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఇటీవల జరిగిన తన అమెరికా పర్యటనను మోదీ ప్రస్తావించారు. మన దేశ యువత పట్ల ప్రపంచానికి విశ్వాసం పెరిగిందన్నారు. అమెరికాతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వీటివల్ల అంతరిక్షం, సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధ వంటి కీలక రంగాల్లో మన దేశ యువతకు నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు.   

మన విద్యా వ్యవస్థకు ఘన చరిత్ర  
మైక్రాన్, గూగుల్‌ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు భారత్‌లో పెట్టుబడులు భారీగా పెట్టబోతున్నాయని, మనదేశ ఉజ్వల భవిష్యత్తుకు ఇదొక సూచిక అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ యూనివర్సిటీ అంటే కేవలం ఒక విద్యాలయం కాదని, ఒక ఉద్యమమని వ్యాఖ్యానించారు. ప్రాచీన కాలంలో నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు సంతోషానికి, సౌభాగ్యానికి వనరులుగా నిలిచాయని చెప్పారు. భారతీయ విద్యావ్యవస్థకు ఘన చరిత్ర ఉందన్నారు. విదేశీయుల నిరంతర దాడుల వల్ల భారతీయ విద్యావ్యవస్థ కుప్పకూలిందని, తద్వారా  అభివృద్ధి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం అనంతరం వర్సిటీలు నైపుణ్యం కలిగిన యువతను దేశానికి అందించాయని, అభివృద్ధికి పాటుపడ్డాయని మోదీ ప్రశంసించారు.   

‘యుగే యుగే భారత్‌’ మ్యూజియం  
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో గిరిజన ప్రదర్శనశాలలు(మ్యూజియమ్స్‌) ఏర్పాటు చేశామని, ఢిల్లీలోని ‘ప్రైమ్‌ మినిస్టర్స్‌ మ్యూజియం’ ద్వారా స్వతంత్ర భారత్‌ అభివృద్ధి ప్రయాణాన్ని తెలుసుకోవచ్చని నరేంద్ర మోదీ చెప్పారు. ‘యుగే యుగే భారత్‌’ పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద హెరిటేజ్‌ మ్యూజియాన్ని ఢిల్లీలో నిర్మిస్తున్నామని తెలిపారు. మన స్టార్టప్‌ కంపెనీల సంఖ్య లక్ష మార్కును దాటిందన్నారు. 2014లో కేవలం వందల సంఖ్యలోనే స్టార్టప్‌లు ఉండేవన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ కంప్యూటర్‌ సెంటర్, ఫ్యాకల్టీ ఆఫ్‌ టెక్నాలజీ భవనాలు, నార్త్‌ క్యాంపస్‌ అకడమిక్‌ బ్లాక్‌ నిర్మాణానికి ప్రధాని పునాదిరాయి వేశారు. ఢిల్లీ యూనివర్సిటీ 1922 మే 1న ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ వర్సిటీలో 86 డిపార్ట్‌మెంట్లు, 90 కాలేజీలు ఉన్నాయి.  

మెట్రో రైలులో మోదీ ప్రయాణం  
ప్రధాని మోదీ శుక్రవారం ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన మెట్రో రైలులో వచ్చారు. రైలులో విద్యార్థులతో సరదాగా సంభాíÙంచారు. అనంతరం ఢిల్లీ యూనివర్సిటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తన మెట్రో రైలు ప్రయాణ అనుభవాన్ని పంచుకున్నారు. ఓటీటీల్లో ప్రసారమవుతున్న కొత్త వెబ్‌ సిరీస్‌ల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నానని చెప్పారు. ఏ వెబ్‌ సిరీస్‌ బాగుంది? ఏ  రీల్స్‌ బాగున్నాయో వారు చెప్పగలరని పేర్కొన్నారు. మాట్లాడేందుకు విద్యార్థుల వద్ద ఎన్నో అంశాలు ఉన్నాయన్నారు. సైన్స్‌ నుంచి ఓటీటీల్లోని కొత్త వెబ్‌ సిరీస్‌ల దాకా చాలా విషయాలను వారితో మాట్లాడొచ్చని వెల్లడించారు. ఏ ఒక్క అంశాన్నీ వారు వదిలిపెట్టరని వ్యాఖ్యానించారు. భూగోళంపై ఉన్న అన్ని అంశాలను విద్యార్థులు చక్కగా చర్చించగలరని ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement