సిద్ధరామయ్యపై విచారణకు ఆదేశించిన కర్ణాటక గవర్నర్ గెహ్లోత్
నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలన్న విపక్ష బీజేపీ
రాజీనామా చేసేంత తప్పేమీ చేయలేదన్న ముఖ్యమంత్రి
సాక్షి, బెంగళూరు: మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూముల కేటాయింపుల వివాదం చివరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మెడకు చుట్టుకుంటోంది. ఖరీదైన భూములు భార్య పార్వతికి దక్కేలా సిద్ధరామయ్య కుట్ర చేశారని సమాచార హక్కు చట్టం కార్యకర్తలు టీజే అబ్రహాం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ చేసిన అభ్యర్థనపై రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఏకంగా ముఖ్యమంత్రిపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ శనివారం అనుమతి ఇచ్చినట్లు రాజ్‌భవన్ ప్రకటించింది. దీంతో సిద్ధూపై కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టే అవకాశముంది. ‘‘ నాకు అందిన పిటిషన్ ప్రకారం భూకేటాయింపుల్లో అక్రమాలపై ప్రాథమిక ఆధారాలున్నాయి. మీపై విచారణకు ఎందుకు ఆదేశించకూడదో 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సీఎంకు గత నెల 26న షోకాజ్ నోటీసు ఇచ్చా. దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర మంత్రి మండలి చేసిన తీర్మానంలో హేతుబద్ధత లేదు.
కేసు విచారణ పారదర్శకంగా జరగాలి. హడావిడిగా మాజీ ఐఏఎస్ వెంకటాచ లపతి ఆధ్వర్యంలో విచారణ కమిటీ, హైకోర్టు విశ్రాంత జడ్జి పీఎన్ దేశాయ్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేయడం చూస్తుంటే ఇందులో భారీ అవకతవకలు జరిగినట్లు భావించవచ్చు’’ అని గవర్నర్ గెహ్లోత్ వ్యాఖ్యానించారు. అయితే గవర్నర్ ఉత్తర్వులను రద్దుచేయాలంటూ సిద్ధరా యమ్య హైకోర్టును ఆశ్రయిస్తే ఆ కేసు విచారణ సందర్భంగా తమ వాదనలు సైతం వినాలంటూ ఫిర్యాదుదారుల్లో ఒకరైన ప్రదీప్ శనివారం కర్ణాటక హైకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలుచేశారు. 21వ తేదీన ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులోనూ కేసు వేస్తానని టీజే అబ్రహాం చెప్పారు.
తీవ్రంగా తప్పుబట్టిన సిద్ధరామయ్య
తనపై దర్యాప్తునకు గవర్నర్ ఆదేశించడాన్ని సీఎం తీవ్రంగా తప్పుబట్టారు. నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలన్న బీజేపీ డిమాండ్‌పై స్పందించారు. ‘‘గవర్నర్ కేంద్రప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారారు. చట్టవ్యతిరేక ఉత్తర్వులిచ్చి రాజ్యాంగబద్ధ పదవిని ఆయన దుర్వినియోగం చేస్తున్నారు. ఉత్తర్వులపై చట్టప్రకారం పోరాడతా. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నారు. కేంద్రం, బీజేపీ, జేడీ(ఎస్) ఇందులో కీలక పాత్రధారులు.
మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల మద్దతు నాకు ఉంది. నేను రాజీనామా చేయాల్సినంత తప్పేమీ చేయలేదు. మైనింగ్ లైసెన్స్‌ల కుంభకోణంలో జేడీఎస్ నేత, ప్రస్తుత కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామిపై లోకాయుక్త దర్యాప్తునకు కోరితే ఆయనపై విచారణకు ఆదేశించలేదుగానీ నాపై ఆగమేఘాల మీద విచారణకు ఆదేశించారు. ఫిర్యాదులున్నా బీజేపీ మాజీ కేంద్ర మంత్రులు శశికళ జోళె, మురుగేశ్ నీలాని, జనార్ధన్ రెడ్డిలపై దర్యాప్తునకు ఎందుకు ఆదేశాలివ్వలేదు?’’ అని సీఎం అన్నారు.
విమర్శలు ఎక్కుపెట్టిన బీజేపీ
విచారణను ఎదుర్కొంటున్న సిద్ధరామయ్యకు సీ ఎంగా కొనసాగే అర్హత లేదని, రాజీనామా చేయా లని రాష్ట్రంలో విపక్ష బీజేపీ డిమాండ్‌చేసింది. ఆయ న దిగిపోతేనే దర్యాప్తు పారదర్శకంగా సాగుతుందని కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర అన్నారు. ‘‘కాంగ్రెస్ వంచనకు, కుటుంబ రాజకీయాలకు ఈ స్కామ్ మరో మచ్చుతునక. దళితులకు అండగా ఉంటామనే సీఎం స్వయంగా దళితుల భూములను లాక్కున్నారు’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. దాదాపు రూ.4,000–5,000 కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపించారు.
బీజేపీయేతర ప్రభుత్వాలను వేధిస్తున్నారు: ఖర్గే
ప్రతిపక్షాలపాలిత రాష్ట్రాలను మోదీ సర్కార్ నియమించిన గవర్నర్లు తీవ్రంగా వేధిస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ‘‘ ఏకంగా సీఎం మీదనే విచారణకు ఆదేశించేంత తప్పు ఏం జరిగింది?. ఏ కారణాలు చెప్పి దర్యాప్తునకు అనుమతి ఇచ్చారు?. పశ్చిమబెంగాల్, కర్ణాటక, తమిళనాడు ఇలా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట్ల గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందుల పాల్జేస్తున్నారు’’ అని ఖర్గే అన్నారు.
ఏమిటీ ముడా భూవివాదం?
సిటీ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్ట్ బోర్డ్‌గా 1904లో ఏర్పాటై తదనంతరకాలంలో మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా)గా అవతరించిన సంస్థ ఇప్పుడు భూకేటాయింపుల వివాదంలో కేంద్రబిందువుగా నిలిచింది. కెసెరె గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి 3 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. ఈ గ్రామంలో దేవనార్ 3ఫేజ్ లేఅవుట్ కోసం ముడా ఈ భూమిని సేకరించింది.
నష్టపరిహారంగా 2021లో మైసూర్‌లోని విజయనగర మూడో, నాలుగో ఫేజ్ లేఅవుట్లలో 38,284 చదరపు అడుగుల విస్తీర్ణంలో 14 ప్లాట్లను కేటాయించింది. అయితే పార్వతి నుంచి తీసుకున్న భూముల కంటే కేటాయించిన ప్లాట్ల విలువ రూ.45 కోట్లు ఎక్కువ అని ఆర్టీఐ కార్యకర్త అబ్రహాం లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేటాయింపుల అంశం వార్తల్లోకెక్కింది. కెసెరె భూమిని పార్వతికి ఆమె సోదరుడు మల్లిఖార్జున స్వామి 2010 అక్టోబర్‌లో బహుమతిగా ఇచ్చాడు. ప్రభుత్వం సేకరించాక 2014 జూన్‌లో నష్టపరిహారం కోసం పార్వతి దరఖాస్తు చేసుకున్నారు.
ప్లాట్ల కేటాయింపుపై సిద్ధూ గతంలోనే స్పష్టతనిచ్చారు. ‘‘2014లో నేను సీఎంగా ఉన్నపుడు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే సీఎంగా ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వడం కష్టమని అధికారులు చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్నపుడు 2021లో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఈ ప్లాట్లను కేటాయించారు’’ అని సిద్దూ అన్నారు. అయితే గతంలో ముడా 50: 50 పేరిట ఒక పథకాన్ని అమలుచేసింది. నిరుపయోగ భూమి తీసుకుంటే వేరే చోట ‘అభివృద్ధి చేసిన’ స్థలాన్ని కేటాయిస్తారు.
ప్రతీ కేటాయింపు ముడా బోర్డు దృష్టికి తేవాలి. అయితే కొందరు ముడా అధికారులతో చేతులు కలిపి, బోర్డు దృష్టికి రాకుండా, పథకంలోని లోపాలను వాడుకుని సిద్ధరామయ్య కుటుంబం ఎక్కువ ప్లాట్లను రాయించుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. లోపాలున్న పథకాన్ని 2023 అక్టోబర్‌లో రద్దుచేశారు. అయితే తన భూమికి ఎక్కువ విలువ ఉంటుందని రూ.62 కోట్ల నష్టపరిహారం కావాలని సిద్ధరామయ్య ఈఏడాది జూలై నాలుగున డిమాండ్ చేయడం విశేషం. అయితే అసలు ఈ భూమి పార్వతి సోదరుడు మల్లికార్జున స్వామిది కాదని, అక్రమంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించి 2004లో తన పేరిట రాయించుకున్నాడని ఆరోపణలున్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment