న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ల కొనుగోలుకు ఈనెల 20వ తేదీ దాకా రూ. 19,675 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వ్యాక్సిన్లను ఉచితంగా సరఫరా చేశామని సామాజిక కార్యకర్త అమిత్ గుప్తా సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ సమాధానమిచ్చింది. 2021–22 కేంద్ర బడ్జెట్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 35,000 కోట్లను కేటాయించింది. ఈ ఏడాది జనవరి 16న మనదేశంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే.
కోవిన్ పోర్టల్ ప్రకారం దేశంలో ఇప్పటిదాకా 140 కోట్ల డోసుల పంపిణీ జరిగింది. మే 1 నుంచి డిసెంబరు 20వ తేదీ దాకా 117.56 కోట్ల డోసులను ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో (సీవీసీ) ప్రజలకు ఉచితంగా అందజేశామని, 4.18 కోట్ల డోసులను మాత్రం ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రజలు తీసుకున్నారని ఆరోగ్య శాఖ వివరించింది. జూన్ 21న మార్చిన నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ తయారీ సంస్థలు తమ నెలవారీ ఉత్పత్తి సామర్థ్యంలో 25 శాతం టీకాలను ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా అమ్ముకోవచ్చు.
60 శాతం మందికి డబుల్ డోస్
దేశంలో అర్హులైన వారిలో (18 ఏళ్లకు పైబడిన వారిలో) 60 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం వెల్లడించారు. 89 శాతం మంది కనీసం ఒక డోసు తీసుకున్నారని తెలిపారు. కాగా దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య గురువారం 300 దాటింది.
Comments
Please login to add a commentAdd a comment