తల్లిదండ్రుల అనుమతి లేకుండా పిల్లల డేటా సేకరణ! | US Govt said TikTok Violated the Children Online Privacy Protection Act | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల అనుమతి లేకుండా పిల్లల డేటా సేకరణ!

Published Sat, Aug 3 2024 9:28 AM | Last Updated on Sat, Aug 3 2024 9:58 AM

US Govt said TikTok Violated the Children Online Privacy Protection Act

టిక్‌టాక్‌పై దావా వేసిన యూఎస్‌ ప్రభుత్వం

ప్రముఖ సోషల్‌మీడియా యాప్‌ టిక్‌టాక్‌పై యూఎస్‌ ప్రభుత్వం కోర్టులో దావా వేసింది. పదమూడేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల సమాచార గోప్యతను పాటించడంలో కంపెనీ యాజమాన్యం విఫలమైందని ఆరోపించింది. పిల్లల తల్లిదండ్రుల అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా సమాచారాన్ని సేకరించిందని చెప్పింది. ఈ మేరకు బైడెన్‌ ప్రభుత్వం టిక్‌టాక్‌, దాని మాతృసంస్థ బైట్‌డాన్స్‌పై కోర్టులో దావా వేసింది.

యూఎస్‌ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం..చైనా ఆధారిత సోషల్‌మీడియా యాప్‌ టిక్‌టాక్‌ యూఎస్‌లో 13 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించింది. అందుకు వారి తల్లిదండ్రుల సమ్మతిని పొందాల్సి ఉంటుంది. కానీ కంపెనీ యాజమాన్యం ఎలాంటి నిబంధనలు పాటించలేదు. పిల్లల ఆన్‌లైన్ గోప్యతా రక్షణ చట్టాన్ని టిక్‌టాక్‌ ఉల్లంఘించింది. ఇది భవిష్యత్తులో అమెరికన్ల సమాచార భద్రతకు హాని కలిగించే ప్రమాదం ఉంది.

ఎనర్జీ అండ్ కామర్స్ కమిటీలోని డెమొక్రాట్ ప్రతినిధి ఫ్రాంక్ పల్లోన్ మాట్లాడుతూ..‘చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నియంత్రణలోని టిక్‌టాక్‌ను ఉపసంహరించుకోవాలి. పిల్లల తల్లిదండ్రులకు తెలియకుండానే కుంటుంబ సభ్యుల సమాచారాన్ని సేకరించడం సరికాదు. అమెరికన్ల సమాచార గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది’ అన్నారు. ఈ నేపథ్యంలో పిల్లల నుంచి డేటా సేకరించినందుకుగాను టిక్‌టాక్‌పై రోజూ ఒక్కో ఉల్లంఘనకు 51,744 డాలర్లు(రూ.43 లక్షలు) జరిమానా విధించాలని ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌(ఎఫ్‌టీసీ) ప్రతిపాదించింది. ఇదే జరిగితే కంపెనీ కోట్ల రూపాయలు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: బ్యాంకు సర్వీసులను అప్‌డేట్‌ చేయట్లేదు

ఈమేరకు టిక్‌టాక్‌ స్పందిస్తూ..యూఎస్‌ ప్రభుత్వం కోర్టులో వేసిన దావాను తీవ్రంగా ఖండించింది. అందులోని వివరాలు పూర్తిగా అబద్ధమని చెప్పింది. కొన్ని సంఘటనలు గతంలో జరిగినా అవి చాలాకాలం కిందటే పరిష్కరించామని పేర్కొంది. పిల్లల భద్రతకు కంపెనీ యాజమాన్యం పూర్తి మద్దతు ఇస్తోందని స్పష్టం చేసింది. టిక్‌టాక్‌ను మరింత మెరుగుపరిచేందుకు చేస్తున్న సన్నాహాలు ఆపమని తేల్చి చెప్పింది. ఇదిలాఉండగా, చైనీస్ యాజమాన్యంలోని టిక్‌టాక్‌ షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌ను యూఎస్‌లో దాదాపు 170 మిలియన్ల(17 కోట్లు) మంది వినియోగిస్తున్నారు. పిల్లల డేటా నిర్వహణకు సంబంధించి సరైన నిబంధనలు పాటించకపోవడంతో సంస్థపై గతేడాది యూరోపియన్ యూనియన్, యూకే ప్రభుత్యాలు జరిమానా విధించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement