జైట్లీని క్రాస్ ఎగ్జామిన్ చేసిన జెఠ్మలానీ
న్యూఢిల్లీ: పరువునష్టం కేసులో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీ క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై జైట్లీ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు ఓపెన్ హాలులో జైట్లీని జెఠ్మలానీ క్రాస్ ఎగ్జామిన్ చేశారు. మీ పరువుకు కేజ్రీవాల్ ఏవిధంగా భంగం కలిగించారో వివరించాలని జైట్లీని జెఠ్మలానీ కోరారు.
అసత్య ఆరోపణలతో తనపై బురద చల్లారని, తన ప్రతిష్టకు భంగం కలిగించారని జైట్లీ తెలిపారు. నిరాధార ఆరోపణలతో తనను మానసికంగా ఒత్తిడికి గురి చేశారని వెల్లడించారు. మీడియాలో, పార్లమెంట్ ఎదుట, ఢిల్లీ అసెంబ్లీలో తనపై నోటికొచ్చినట్టు ఆరోపణలు గుప్పించారని వాపోయారు. తనకు జరిగిన నష్టాన్ని డబ్బులతో కొలవలేమని చెప్పారు. కేజ్రీవాల్ చేసిన ఆరోపణలతో ఆర్థికంగా జైట్లీ నష్టపోలేదని జెఠ్మలానీ కోర్టుకు తెలిపారు.
ఢిల్లీ క్రికెట్ సంఘం(డీడీసీఏ) అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జైట్లీ, ఆయన కుటుంబ సభ్యులు అక్రమాలు పాల్పడ్డారని కేజ్రీవాల్ ఆరోపించారు. దీంతో కేజ్రీవాల్ పై జైట్లీ పరువునష్టం దావా వేశారు.