'నల్ల' కుబేరుల పేర్లు బయటపెట్టలేం
విదేశాల్లోని స్విస్ బ్యాంకు లాంటి చోట్ల నల్లధనం దాచుకున్న కుబేరుల పేర్లను తాము బయటపెట్టలేమని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సుప్రీంలో సర్కారు ఓ దరఖాస్తు దాఖలుచేసింది. వివిధ దేశాలతో ద్వంద్వ పన్ను విధానాన్ని నిరోధించే ఒప్పందాలు ఉన్నందువల్ల తాము ఈ వివరాలు బహిర్గతం చేయలేమని కేంద్రం వివరించింది.
అయితే.. ఇది విదేశాల్లో నల్లధనం దాచుకున్నవాళ్లను కాపాడేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని పిటిషనర్, సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ వ్యాఖ్యానించారు. తమ సొమ్ము అక్రమంగా దాచుకున్నవాళ్లే ఇలా చెబుతారు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం కాదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ దరఖాస్తును అక్టోబర్ 28వ తేదీన విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.