రేవంత్ బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ ప్రారంభం
ఓటుకు కోట్లు కేసులో రెడ్హ్యాండెడ్గా దొరికి, హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్న టీ-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సహా.. ముగ్గురి బెయిల్ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో తెలంగాణ ఏసీబీ దాఖలుచేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహాల బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ ఏసీబీ కోరుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం ఈ పిటిషన్పై వాదనలు మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి సహా ముగ్గురి బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ ఏసీబీ రెండు స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసింది. రేవంత్ రెడ్డి తరఫున రాంజెఠ్మలానీ వాదిస్తుండగా.. ఏసీబీ తరఫున ముగ్గురు ప్రముఖ న్యాయవాదులు వాదిస్తున్నారు. కపిల్ సిబల్, దుష్యంత్ దావే, హరీన్ రావెల్ ముగ్గురూ ఏసీబీ తరఫున కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు.
రేవంత్ రెడ్డి తదితరులు చేసినది కేవలం ఒక ఎమ్మెల్యేను కొనేందుకు చేసిన ప్రయత్నం కాదని, అది రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చేస్తున్న కుట్ర అని ఏసీబీ తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. పది మంది ఎమ్మెల్యేలను కొనాలని, తద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకున్నారని సుప్రీంకోర్టుకు విన్నవించనున్నారు. రేవంత్ రెడ్డి విచారణలో వాస్తవాలను వెల్లడించలేదని, 50 లక్షలు ఎక్కడినుంచి వచ్చాయో తెలియాల్సి ఉందని అంటున్నారు. ఎమ్మెల్యే జైలు నుంచి విడుదలైనప్పుడు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారని చెప్పడమే కాక.. అందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తున్నారు.