హైకోర్టు జడ్జికి ఘాటు లేఖ
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థను నాశనం చేయొద్దంటూ దేశ న్యాయ చరిత్రలో మొదటిసారి కోర్టు ధిక్కార కేసులో అరెస్టు వారెంట్ అందుకున్న కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ సోమవారం బహిరంగ లేఖ రాశారు. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన ప్రతి పదాన్ని వెనక్కి తీసుకోవాలని జస్టిస్ కర్ణన్‌కు ఆయన సూచించారు. కర్ణన్ కు మతి చెడిందని, కోర్టు ధిక్కార చర్యలకు క్షమాపణ చెప్పాలని కోరారు.
'బార్ లో సీనియర్ సభ్యుడిగా, వయసులో పెద్దవాడిగా మీకో సలహా ఇస్తున్నాను. ఇప్పటివరకు మీరు మాట్లాడిన ప్రతి పదాన్ని వెనక్కు తీసుకోండి. మీరు పాల్పడ్డ తెలివిలేని చర్యలకు సవినయంగా క్షమాపణ కోరండి. మీకు పిచ్చి ఎంతగా ముదిరిపోయిందో తెలియకపో నన్ను కలవండి. నేను మీకు తెలివి వచ్చేలా చేస్తాన'ని జెఠ్మలానీ లేఖలో పేర్కొన్నారు.
కోర్టు ధిక్కార కేసులో జస్టిస్ కర్ణన్ తమ ముందు హాజరుకాకపోవడంతో ఈ నెల 10న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం కర్ణన్‌కు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీనిపై కర్ణన్ స్పందిస్తూ దళితుడిని కావడం వల్లనే తనపై ఈ దాడిచేస్తున్నారని, తన జీవితాన్ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు.