Justice CS Karnan
-
సంచలనం: జస్టిస్ కర్ణన్ రాజకీయ పార్టీ
కోల్‌కత: హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ మరో సంచలనానికి తెరలేపారు. 2019 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ పెడుతున్నట్లు బుధవారం ప్రకటించారు. దేశంలోని 543 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన తెలిపారు. ‘ఆంటీ కరప్షన్ డైనమిక్ పార్టీ’ (ఏసీడీపీ) పేరుతో పార్టీని రిజిస్టర్ చేయించబోతున్నట్లు కర్ణన్ సహాయకుడు ఆంథోని డబ్ల్యూ లిజారో వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నుంచి కర్ణన్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దిగుతారని ఆయన తెలిపారు. దేశం నుంచి అవినీతిని సమూలంగా తరిమికొట్టడమే తమ పార్టీ సిద్ధాంతమని కర్ణన్ ఉద్ఘాటించారు. వారణాసి మినహా మిగతా అన్ని స్థానాల నుంచి మహిళలు మాత్రమే తమ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగుతారని కర్ణన్ ప్రకటించారు. తమ పార్టీ తరపున ఎన్నికల పోటీలో పాల్గొనే అభ్యర్థులకు ఎన్నికల వ్యయంగా లక్ష రూపాయలు కర్ణన్ అందిస్తారని లిజారో తెలిపారు. కోల్‌కతా హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారన్న అభియోగంపై గతేడాది మే 9న జస్టిస్ కర్ణన్‌కు సుప్రీంకోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. దీంతో పశ్చిమబెంగాల్ నుంచి కోయంబత్తూరుకు పరారైన కర్ణన్‌ను జూన్ 20న సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. 6 నెలల జైలు జీవితం అనంతరం గత డిసెంబరు 20న కర్ణన్ విడుదలయ్యారు. కాగా, పదవిలో ఉండగా అరెస్టయిన తొలి హైకోర్టు జడ్జిగా ఆయన రికార్డులకెక్కారు. మద్రాస్ హైకోర్టు జడ్జిగానూ ఆయన పనిచేశారు. -
ఆ జడ్జి దేశం వదిలి వెళ్లిపోయారా?
-
ఆ జడ్జి దేశం వదిలి వెళ్లిపోయారా?
పదవిలో ఉండగా ఆరు నెలల జైలుశిక్ష పడిన మొట్టమొదటి న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ ఎక్కడున్నారన్నది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. కలకత్తా హైకోర్టుకు చెందిన ఈ న్యాయమూర్తి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. విదేశాలకు పారిపోయారని కొంతమంది చెబుతుండగా ఆయన సన్నిహితులు మాత్రం భారతదేశంలోనే ఎవరికీ తెలియని ఓ ప్రదేశంలో ఉన్నారంటున్నారు. ఆయన అరెస్టును తప్పించుకోడానికి ఏమీ ప్రయత్నించడం లేదని, అయితే మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి కొంత సమయం అడుగుతున్నారని ఆయన అనుచరులు మీడియాకు చెప్పారు. తమిళనాడులోని ఓ గెస్ట్‌హౌస్‌లో ఉన్నారని కథనాలు రావడంతో పశ్చిమబెంగాల్ నుంచి పోలీసు బృందం చెన్నైకి వెళ్లినా, అక్కడ ఆయన కనిపించలేదు. తనపై జారీచేసిన అరెస్టు ఉత్తర్వులను రీకాల్ చేసుకోవాలని కర్ణన్ సుప్రీంకోర్టును కోరారు. కర్ణన్ బృందం కొత్తగా ఒక రివ్యూ దరఖాస్తు సిద్ధం చేస్తోందని, త్వరలోనే దాన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేస్తారని తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల పూర్తికాపీ అందితే గానీ పిటిషన్ దాఖలు చేయడానికి గానీ, బెయిల్ కోసం దరఖాస్తు చేయడానికి గానీ కుదరదు. కుల్‌భూషణ్ జాదవ్ కేసును అంతర్జాతీయ కోర్టులో సవాలు చేసినట్లే తన కేసును కూడా అక్కడకు పంపాలని రాష్ట్రపతిని అడిగేందుకు ఆయన అపాయింట్మెంట్ కూడా కర్ణన్ కోరినట్లు తెలిసింది. అయితే.. జస్టిస్ కర్ణన్‌ను అరెస్టు చేస్తే ఆయన స్వగ్రామంలో అల్లర్లు చెలరేగుతాయని తమిళనాడు ప్రభుత్వం కూడా జాగ్రత్త పడుతోంది. మొత్తానికి జస్టిస్ కర్ణన్ బయటకు రాకుండా వీలైనంత వరకు తప్పించుకోడానికే ప్రయత్నిస్తున్నారు. -
న్యాయమూర్తిపై ధిక్కార నేరం
న్యాయ కోవిదులు, భిన్న రంగాలకు చెందిన బాధ్యతగల పౌరులు కొన్ని నెల లుగా ఏం జరగకూడదని కోరుకున్నారో చివరకు అదే అయింది. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు కోర్టు ధిక్కార నేరం కింద సర్వోన్నత న్యాయస్థానం ఆర్నెల్ల జైలు శిక్ష విధించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కేహార్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ ఏకగ్రీవ నిర్ణయాన్ని ప్రకటించడంతోపాటు దీన్ని తక్షణం అమలు చేయాలని ఆదేశించింది. ఇకముందు ఆయన ఇచ్చే ఆదేశాలేవీ మీడియాలో రాకూడదని కూడా ధర్మాసనం ఆంక్షలు విధించింది. ఒక హైకోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టే కోర్టు ధిక్కార నేరం కింద శిక్షించాల్సి రావడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. కొన్నాళ్లుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల విషయంలోనే విచిత్రమైన ఉత్తర్వులిస్తూ వచ్చిన జస్టిస్ కర్ణన్ సోమవారం ఏకంగా ప్రధాన న్యాయమూర్తికి, మరో ఏడుగురు న్యాయమూర్తులకు అయిదేళ్ల కఠిన శిక్ష విధిస్తూ ‘తీర్పు’నిచ్చారు. దళితుడిని కనుక తనపై వీరంతా వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. రాజకీయ రంగంలోనో, మరో రంగంలోనో పరస్పరం ఆరోపణలు చేసుకోవడం సర్వసాధారణం. న్యాయ వ్యవస్థలో అలాంటి ధోరణులు లేవు. వాటి సంగతి అటుంచి శిక్షలు విధించడమ న్నది లేనేలేదు. సర్వోన్నత న్యాయస్థానంతో జస్టిస్ కర్ణన్‌కు లడాయి మొదలై దాదాపు ఏడా దిన్నర అవుతోంది. మద్రాస్ హైకోర్టులో పనిచేస్తున్నప్పుడు సహచర న్యాయమూ ర్తులతో ఆయనకు తలెత్తిన చిన్నపాటి వివాదం ఇంతవరకూ రావడం దుర దృష్టకరమైన విషయం. సివిల్ జడ్జీల ఎంపిక కోసం ఏర్పాటైన కమిటీలో జస్టిస్ ధనపాలన్‌ను నియమించడాన్ని వ్యతిరేకించడంతోపాటు ఆయన బోగస్ సర్టిఫి కెట్లతో ఈ పదవిలోకి వచ్చారని ఆరోపించి దానిపై సీబీఐ దర్యాప్తు జరపాలంటూ ఆదేశాలిచ్చి ఆయన అందరినీ నివ్వెరపరిచారు. అవి అమలు కాకుండా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్కే కౌల్ ఉత్తర్వులివ్వడంపై ఆగ్రహించి ఆయనపై కోర్టు ధిక్కార నేరం కింద చర్య తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రీ నివేదించడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని జస్టిస్ కర్ణన్ ఇచ్చిన ఆదేశాలన్నిటినీ నిలిపివేసింది. దాంతోపాటు సంజాయిషీ ఇవ్వమని జస్టిస్ కర్ణన్‌ను కోరింది. అలా వివాదం ఉన్నకొద్దీ ముది రిందే తప్ప ఆగలేదు. నిజానికి ఈ వివాదానికి ముందు సైతం కొన్ని కేసుల్లో ఆయన ఇచ్చిన తీర్పులు అందరినీ ఆశ్చర్యానికి లోనుచేశాయి. పెళ్లీడు వచ్చిన ఇద్దరు ఆడ, మగ వ్యక్తుల మధ్య లైంగిక సంబంధం ఏర్పడితే దాన్ని పెళ్లిగా... వారిని భార్యాభర్తలుగా పరిగణించవచ్చునని జస్టిస్ కర్ణన్ తీర్పునిచ్చినప్పుడు అందరూ నిర్ఘాంతపోయారు. ఈ తీర్పు రేకెత్తించిన సంచలనాన్ని గమనించుకుని ఆ తర్వాత ఆయనే దాన్ని వెనక్కి తీసుకున్నారు. న్యాయమూర్తిని అరెస్టు చేసేదాకా విషయం వెళ్లింది గనుక ఈ వ్యవహారం ఇంత చర్చనీయాంశం అయింది గానీ... వేరే వివాదాల్లో చిక్కుకున్న న్యాయ మూర్తులు గతంలో కూడా లేకపోలేదు. మహిళలపై లైంగిక వేధింపులు మొదలు కొని ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టడం వంటి ఆరోపణలవరకూ అందులో ఉన్నాయి. సెలవుపై వెళ్లమని, పదవినుంచి తప్పుకోమని సుప్రీంకోర్టు ఆదేశించినా మొరాయించిన జస్టిస్ రామస్వామి, జస్టిస్ పీడీ దినకరన్, జస్టిస్ షమిత్ ముఖర్జీ, జస్టిస్ సౌమిత్రసేన్ వంటి న్యాయమూర్తులున్నారు. వీరిలో చాలామంది విషయం అభిశంసన వరకూ వెళ్లాక తప్పుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసిన జస్టిస్ ఏకే గంగూలీ, జస్టిస్ స్వతంత్ర కుమార్‌లు తమతో అసభ్యంగా ప్రవర్తించారని మూడేళ్లక్రితం ఇద్దరు యువతులు ఆరోపిం చారు. మధ్యప్రదేశ్‌లో ఒక జిల్లా అదనపు సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్న మహిళ ఒకరు హైకోర్టు న్యాయమూర్తిపై తనను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఆరోపణల వెనక కుట్ర ఉన్నదన్నదే ఆ న్యాయమూర్తుల జవాబు. తన ఫిర్యాదును సరిగా పట్టించుకోలేదన్న ఆవేదనతో మహిళా న్యాయమూర్తి తానే రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ బాలకృష్ణన్‌పై కూడా అవినీతి ఆరోపణ లొచ్చాయి. సకాలంలో స్పందించి చక్క దిద్దకపోతే వ్యక్తులుగా కొందరు చేసే పనుల వల్ల జనం దృష్టిలో సంస్థలు పలచనవుతాయి. ఇంగ్లండ్ లార్డ్ చీఫ్ జస్టిస్ ఊల్ఫ్ అన్నట్టు పాత గడి యారాలకు నూనె పట్టించి, లోటుపాట్లు సరిదిద్ది సరైన సమయాన్ని చూపేలా చేసు కున్నట్టే న్యాయవ్యవస్థను కూడా ఎప్పటికప్పుడు చక్కదిద్దుకోవాల్సిన అవ సరం ఉంటుంది. ఆ విషయంలో మన న్యాయవ్యవస్థ తగిన ఏర్పాట్లు చేసు కోలేదనే చెప్పాలి. న్యాయమూర్తుల నియామకాలకు కొలీజియం వ్యవస్థ ఉందిగానీ... తొల గించడానికి మాత్రం అలాంటిదేమీ లేదు. సుప్రీంకోర్టు మహా అయితే అటువంటి ఆరోపణలున్నవారిని ఏ మారుమూల హైకోర్టుకో బదిలీ చేస్తుంది. ఇందువల్ల ఆయా హైకోర్టుల్లో పని చేసేవారు తమ కోర్టును చిన్నచూపు చూస్తున్నారన్న అభిప్రాయాన్ని ఏర్పర్చుకున్న సందర్భాలున్నాయి. 1968 నాటి న్యాయమూర్తుల (విచారణ) చట్టం ఉన్నా ఆచరణలో అది పెద్దగా ఉపయోగపడింది లేదు. పార్లమెంటు అభిశంసించడమనే ప్రక్రియ ఎంతో సుదీర్ఘమైనది. దాన్ని అమల్లో పెట్టిన సందర్భాలు మన దేశంలో చాలా తక్కువ. కనీసం అమెరికా, బ్రిటన్ తదితర దేశాల తరహాలో నియామకాల సమయంలో పారదర్శకత పాటించి, ఆయా వ్యక్తుల అర్హతలపై బహిరంగ చర్చ జరిగేలా చూస్తే ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉంటాయి. జస్టిస్ కర్ణన్ విషయానికొస్తే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కెకె వేణుగోపాల్ తదితరులు సూచించినట్టు ఆయన ఎటూ వచ్చే నెలలో రిటైర్ కావాల్సి ఉన్నది గనుక సుప్రీంకోర్టు మరికాస్త ఔదార్యం ప్రదర్శించి ఉంటే బాగుండేది. జస్టిస్ కర్ణన్ ప్రవర్తన అతిగా ఉన్న సంగతి నిజమే అయినా... ఆయన తీవ్రమైన అవినీతి ఆరోపణల్లో చిక్కుకోలేదని గుర్తించాలి. -
ప్రధాన న్యాయమూర్తి విమానం ఎక్కకూడదట!
కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్నన్ విచిత్రమైన ఆదేశాలు జారీచేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ సహా మొత్తం ఏడుగురు న్యాయమూర్తులు విమానాలు ఎక్కి విదేశాలకు వెళ్లకుండా చూడాలంటూ న్యూఢిల్లీలోని ఎయిర్ కంట్రోల్ అథారిటీని ఆదేశించారు. వాళ్ల మీద ఉన్న కేసులు తేలేవరకు ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపారు. కోల్‌కతా న్యూటౌన్‌లోని రోజ్డేల్ టవర్స్‌లో గల తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక కోర్టు నుంచి ఆయన ఈ ఆదేశాలు ఇవ్వడం విశేషం. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేఖర్, ఇంకా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ పినకి చంద్రఘోష్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌ల మీద ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేయాలంటూ ఏప్రిల్ 13న జస్టిస్ కర్నన్ ఆదేశాలు ఇచ్చారు. వాళ్లంతా ఏప్రిల్ 28న తన ఇంట్లోని కోర్టు ఎదుట హాజరు కావాలని సమన్లు సైతం ఇచ్చారు. అంతకుముందు జస్టిస్ కర్నన్ మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్, ఆరుగురు ఇతర న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభించింది. మార్చి 31న కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు, హైకోర్టులలో ప్రస్తుతం పనిచేస్తున్న, రిటైర్ అయిన 20 మంది న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు చేసిన జస్టిస్ కర్నన్.. వాటిని ప్రధానమంత్రికి, సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి పంపారు. వాటిని ఉపసంహరించుకోవాలని సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం సూచించగా, తనకు అంతకుముందున్న అధికారాలను పునరుద్ధరిస్తేనే అలా చేస్తానని ఆయన చెప్పారు. దానికి ధర్మాసనం తిరస్కరించింది. నాలుగు వారాల్లోగా కోర్టు ధిక్కార ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని, మే 1న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈలోపు జస్టిస్ కర్నన్.. తనదైన శైలిలో ఈ ఆదేశాలు ఇచ్చారు. -
నిరాహార దీక్షలు చేపడతా: జస్టిస్ కర్ణన్
కోల్‌కతా: సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్ణన్ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. తాను దళితుడైనందునే ఉన్నత న్యాయస్థానం వేధిస్తోందని కర్ణన్ ఆరోపిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా త్వరలోనే తాను నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు జారీ చేసిన బెయిలబుల్ అరెస్ట్ వారంట్‌ను వెనక్కి తీసుకోవాలని, ఫిబ్రవరి 8వ తేదీ నుంచి రద్దు చేసిన తన అధికారాలు, విధులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన విధులకు ఆటకం కలిగించినందుకు గాను రూ.14 కోట్ల పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ల సాధనకు త్వరలోనే కోల్‌కతా, లక్నో, ఢిల్లీ, చెన్నై నగరాలలో నిరాహార దీక్షలు చేపడతానని తన ప్రతినిధి రమేశ్ పీటర్ కుమార్ ద్వారా ఆయన వెల్లడించారు. ఢిల్లీలో అయితే రాష్ట్రపతి భవన్ ఎదుటగానీ, లేక రామ్‌లీలా మైదానంలో ఎక్కడ పర్మిషన్ ఇస్తే అక్కడ దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు వారంట్ నేపథ్యంలో ఈ దీక్షలను మార్చి 31వ తేదీ తర్వాత చేపట్టాలా? అంతకు ముందే ప్రారంభించాలా? అనేది తాను ఇంకా నిర్ణయించుకోలేదని జస్టిస్ కర్ణన్ చెప్పారు. -
హైకోర్టు జడ్జికి ఘాటు లేఖ
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థను నాశనం చేయొద్దంటూ దేశ న్యాయ చరిత్రలో మొదటిసారి కోర్టు ధిక్కార కేసులో అరెస్టు వారెంట్ అందుకున్న కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ సోమవారం బహిరంగ లేఖ రాశారు. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన ప్రతి పదాన్ని వెనక్కి తీసుకోవాలని జస్టిస్ కర్ణన్‌కు ఆయన సూచించారు. కర్ణన్ కు మతి చెడిందని, కోర్టు ధిక్కార చర్యలకు క్షమాపణ చెప్పాలని కోరారు. 'బార్ లో సీనియర్ సభ్యుడిగా, వయసులో పెద్దవాడిగా మీకో సలహా ఇస్తున్నాను. ఇప్పటివరకు మీరు మాట్లాడిన ప్రతి పదాన్ని వెనక్కు తీసుకోండి. మీరు పాల్పడ్డ తెలివిలేని చర్యలకు సవినయంగా క్షమాపణ కోరండి. మీకు పిచ్చి ఎంతగా ముదిరిపోయిందో తెలియకపో నన్ను కలవండి. నేను మీకు తెలివి వచ్చేలా చేస్తాన'ని జెఠ్మలానీ లేఖలో పేర్కొన్నారు. కోర్టు ధిక్కార కేసులో జస్టిస్ కర్ణన్ తమ ముందు హాజరుకాకపోవడంతో ఈ నెల 10న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం కర్ణన్‌కు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీనిపై కర్ణన్ స్పందిస్తూ దళితుడిని కావడం వల్లనే తనపై ఈ దాడిచేస్తున్నారని, తన జీవితాన్ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. -
జస్టిస్ కర్ణన్‌పై అరెస్ట్ వారెంట్
కోర్టు ధిక్కరణ కేసులో జారీ చేసిన సుప్రీంకోర్టు ► రాజ్యాంగ విరుద్ధమన్న కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి ► సీజేఐపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు న్యూఢిల్లీ/కోల్‌కతా: కోర్టు ధిక్కార కేసులో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ఈ నెల 31 ఉదయం కర్ణన్ ను కోర్టు ముందు హాజరు పరచాలని పశ్చిమబెంగాల్ డీజీపీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఏడుగురు జడ్జీల ధర్మాసనం ఆదేశించింది. రూ.10 వేల పూచీకత్తుపై కర్ణన్ బెయిలు పొందవచ్చని సూచించింది. సర్వీసులో ఉన్న హైకోర్టు న్యాయమూర్తికి అరెస్టు వారెంటు ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ‘కోర్టు ఆదేశించినా కర్ణన్ వ్యక్తిగతంగాగానీ, తన లాయర్ ద్వారాగానీ హాజరు కాలేదు. వారంట్‌కు తప్ప వేరే మార్గంలేదు’ అని సీజేఐ, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ పీసీ ఘోస్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌ల ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఆదేశాలు బేఖాతరు... మద్రాస్ హైకోర్టులోని కొందరు ప్రస్తుత, విశ్రాంత జడ్జీలు అవినీతికి పాల్పడ్డారంటూ ప్రధాని, సీజేఐలకు కర్ణన్ లేఖలు రాశారు. దీంతో ఆయనపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. ఫిబ్రవరి 8న కోర్టు ముందు హాజరై, వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీం నోటీసు లిచ్చింది. ఆయన హాజరు కాకపోవడంతో ఫిబ్రవరి 13న హాజరు కావాలంటూ మరో నోటీసిచ్చింది. ఈ ఆదేశాలనూ జస్టిస్ కర్ణన్ బేఖాతరు చేయడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. సిట్టింగ్ హైకోర్టు జడ్జిపై చర్యలు తీసుకొనే అధికారం సుప్రీంకోర్టుకు లేదని, ఈ విషయాన్ని ముందుగా పార్లమెంటుకు రిఫర్ చేయాలని పేర్కొంటూ ఫిబ్రవరి 10న సీజేఐకు జస్టిస్ కర్ణన్ లేఖ రాశారు. సుప్రీం అధికార దుర్వినియోగంపై విచారణ జరపండి ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం–1989 ప్రకారం.. జస్టిస్ ఖేహర్‌తో పాటు ధర్మాసనంలోని మరో ఆరుగురు జడ్జీలపై కేసు నమోదు చేసి, విచారణ జరపాల్సిందిగా.. జస్టిస్ కర్ణన్ సీబీఐని ఆదేశిస్తూ శుక్రవారం మీడియా ముందే సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు. దర్యాప్తు నివేదికను సంబంధిత సీబీఐ కోర్టు ముందుంచాలన్నారు. సర్వోన్నత న్యాయస్థానం అధికార దుర్వినియోగంపై విచారణ జరపాలని సూచించారు. అలాగే దీనికి సంబంధించి సరైన విచారణ జరిగేలా పూర్తి సాక్ష్యాధారాలను స్పీకర్ ముందుంచాలని ఈ కేసుకు సంబంధించి లోక్‌సభ, రాజ్యసభ కార్యదర్శులకు సూచించినట్టు తెలిపారు. దీంతోపాటు తనపై అరెస్ట్ వారంట్‌ను వెనక్కి తీసుకోవాల్సిందిగా రాష్ట్రపతిని కోరుతున్నానని, తనకెలాంటి పోర్టుఫోలియో ఇవ్వకుండా విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని అభ్యర్థిస్తున్నానని చెప్పారు. ‘జస్టిస్ కర్ణన్ తీరు బాధాకరం’ కర్ణన్ కోర్టులో వ్యవహరించిన తీరుపై ‘న్యాయ’లోకం ఆవేదన వ్యక్తం చేసింది. జడ్జిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయటం సరికాదంటూ కర్ణన్ వాదించటం న్యాయవ్యవస్థను అవమానించేలా ఉందని అభిప్రాయపడింది. మాజీ అటార్నీ జనరల్ సొలీ సొరాబ్జీ కర్ణన్ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమని, ఒక జడ్జి ఇలాంటి వ్యాఖ్య లు చేయటం బాధాకరమన్నారు. దళితుడిని కావడం వల్లనే..: జస్టిస్ కర్ణన్ కోల్‌కతా: సుప్రీంకోర్టు ఇచ్చిన అరెస్ట్వారంట్పై జస్టిస్ కర్ణన్ స్పందించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, తనకు అరెస్ట్వారంట్ ఇచ్చే అధికారం అత్యున్నత న్యాయస్థానానికి లేదన్నారు. దళితుడిని కావడం వల్లనే తనపై ఈ దాడిచేస్తున్నారని, తన జీవితాన్ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని శుక్రవారం కోల్‌కతాలో ఆరోపించారు. మద్రాస్ హైకోర్టులో కొంతమంది న్యాయమూర్తులు అవినీతికి పాల్పడ్డారనే విషయాన్ని ప్రధానికి లేఖ రాయడం వల్లనే తనపై ఈ కక్ష సాధింపన్నారు. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 కోర్టు ధిక్కరణ చట్టం 2(సీ), 12, 14 సెక్షన్ల కింద హైకోర్టు సిట్టింగ్ జడ్జికి అరెస్ట్ వారంట్ ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకు లేదు. దళితుడిని కావడం వల్లనే నాపై ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్నారు’ అని జస్టిస్ కర్ణన్ పేర్కొన్నారు. సిట్టింగ్ హైకోర్టు జడ్జీలపై చర్యలు తీసుకోవాలంటే.. న్యాయమూర్తుల విచారణ చట్టం ప్రకారం సమగ్ర దర్యాప్తు తరువాత పార్లమెంటులో అభిశంసన తీర్మానం పెట్టడమొక్కటే అందుబాటులో ఉన్న ఏకైక మార్గమన్నారు. -
సుప్రీం కోర్టుపై హైకోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు
-
సుప్రీం కోర్టుపై హైకోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్ణన్.. సుప్రీం కోర్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అధికారం సుప్రీం కోర్టుకు లేదని అన్నారు. సుప్రీం కోర్టు సుప్రీమేమీ కాదని వ్యాఖ్యానించారు. తాను దళితుడు కాబట్టే టార్గెట్ చేశారని, తన జీవితాన్ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. శుక్రవారం కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీం కోర్టు అరెస్ట్ వారెంట్ చేయడంపై జస్టిస్ కర్ణన్ స్పందించారు. మీడియాతో జస్టిస్ కర్ణన్ మాట్లాడుతూ.. హైకోర్టు న్యాయమూర్తులు పనివాళ్లు కాదని అన్నారు. 8 ఏళ్ల క్రితం తాను అవినీతి జడ్జిలపై ఫిర్యాదు చేశానని, హైకోర్టులో ఈ కేసు ఇంకా పెండింగ్‌లో ఉందని వెల్లడించారు. ప్రస్తుత, మాజీ జడ్జిలు కొందరు అవినీతికి పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు. జస్టిస్ కర్ణన్ తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని, తన భర్తపై తప్పుడు ఆరోపణలు చేశారని మద్రాస్ హైకోర్టు జడ్జి భార్య గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణకు హాజరుకావాలని సుప్రీం కోర్టు ఆదేశించగా.. జస్టిస్ కర్ణన్ వెళ్లలేదు. దేశ న్యాయచరిత్రలో ఓ హైకోర్టు జడ్జికి కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేయడం ఇదే తొలిసారి. మద్రాస్ హైకోర్టు జడ్జిలు జస్టిస్ కర్ణన్‌కు వ్యతిరేకంగా ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడంతో ఆయన్ను కోల్‌కతా హైకోర్టుకు బదిలీ చేశారు. కోల్‌కతా హైకోర్టు జడ్జికి అరెస్ట్ వారెంట్ -
కోల్‌కతా హైకోర్టు జడ్జికి అరెస్ట్ వారెంట్
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు సుప్రీం కోర్టు శుక్రవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టు విచారణకు హాజరు కానందుకు సుప్రీం కోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణన్‌కు వారెంట్ అందజేయాలని పశ్చిమబెంగాల్ డీజీపీని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నెల 31న కోర్టుకు హాజరు కావాలని ఆయన్ను ఆదేశించింది. -
ఇక్కడ పుట్టినందుకు సిగ్గుపడుతున్నా!
మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి సంచలన వ్యాఖ్య ♦ దళితుడినైనందుకే తనను వేధిస్తున్నారన్న న్యాయమూర్తి ♦ సుప్రీంకోర్టు బదిలీ ఉత్తర్వులను ఖాతరు చేయని వైనం ♦ సుమోటోగా బదిలీ ఉత్తర్వులపై స్టే న్యూఢిల్లీ: ‘దళితుడిడైనందుకు నన్ను వేధిస్తున్నారు. ఈ దేశంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. కులవ్యవస్థలేని ఏదైనా దేశానికి వెళ్లిపోవాలనుకుంటున్నాను’ అని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పదుడిగా పేరుబడ్డ జస్టిస్ కర్ణన్ క్రమశిక్షణా రాహిత్యంపై పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొంతకాలంగా ఆయనకు మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కౌల్‌కు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. తనను హైకోర్టు చీఫ్ జస్టిస్ వేధిస్తున్నారని, కించపరుస్తున్నారని జస్టిస్ కర్ణణ్ ఆయనపై ఆరోపణలు చేశారు. కాగా, వివిధ ఆరోపణల నేపథ్యంలో గతవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని న్యాయమూర్తుల బృందం జస్టిస్ కర్ణన్‌ను కోల్‌కతా హైకోర్టుకు బదిలీ చేసింది. అయితే దీనిపై కూడా ఆయన విభేదించారు. ఈ ఉత్తర్వులపై పోరాడుతానని అన్నారు. తన విధుల్లో జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినే ధిక్కరించారు. భారత ప్రధాన న్యాయమూర్తి తనను బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై, తన పరిధిని దాటి తనంతట తానే సోమవారం స్టే ఇచ్చుకున్నారు. ఈ స్టేను నిలిపివేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. మరో పక్క జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు ఎలాంటి పని అప్పగించవద్దని సుప్రీంకోర్టు సోమవారం మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచించింది. కోల్‌కతా హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ కర్ణన్, నిబంధనలకు విరుద్ధంగా సుప్రీంకోర్టు బదిలీ ఉత్తర్వులపై సుమోటోగా స్టే ఇచ్చుకోవడం వివాదంగా మారింది. ఈ వ్యవహారంపై మద్రాసు హైకోర్టు రిజిస్ట్రార్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జేఎస్ కేహర్, జస్టిస్ భానుమతిలతో కూడిన సుప్రీం ధర్మాసనం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణన్‌ను విధులకు దూరంగా ఉంచాలని రిజిస్ట్రార్ పిటిషన్లో కోరారు. తమ ఉత్తర్వుల ప్రతిని జస్టిస్ కర్ణన్‌కు అందజేయాలని సుప్రీం ధర్మాసనం, హైకోర్టు రిజిస్ట్రార్‌కు సూచించింది. ఈ వ్యవహారంలో అవసరమనుకుంటే జస్టిస్ కర్ణన్ తమ ముందు హాజరుకావచ్చని, అయితే తన స్వంత ఖర్చులతోనే ఆయన సుప్రీంకోర్టుకు రావాలని ధర్మాసనం పేర్కొంది.