
జస్టిస్ సీఎస్ కర్ణన్
కోల్‌కత: హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ మరో సంచలనానికి తెరలేపారు. 2019 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ పెడుతున్నట్లు బుధవారం ప్రకటించారు. దేశంలోని 543 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన తెలిపారు. ‘ఆంటీ కరప్షన్ డైనమిక్ పార్టీ’ (ఏసీడీపీ) పేరుతో పార్టీని రిజిస్టర్ చేయించబోతున్నట్లు కర్ణన్ సహాయకుడు ఆంథోని డబ్ల్యూ లిజారో వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నుంచి కర్ణన్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దిగుతారని ఆయన తెలిపారు.
దేశం నుంచి అవినీతిని సమూలంగా తరిమికొట్టడమే తమ పార్టీ సిద్ధాంతమని కర్ణన్ ఉద్ఘాటించారు. వారణాసి మినహా మిగతా అన్ని స్థానాల నుంచి మహిళలు మాత్రమే తమ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగుతారని కర్ణన్ ప్రకటించారు. తమ పార్టీ తరపున ఎన్నికల పోటీలో పాల్గొనే అభ్యర్థులకు ఎన్నికల వ్యయంగా లక్ష రూపాయలు కర్ణన్ అందిస్తారని లిజారో తెలిపారు.
కోల్‌కతా హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారన్న అభియోగంపై గతేడాది మే 9న జస్టిస్ కర్ణన్‌కు సుప్రీంకోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. దీంతో పశ్చిమబెంగాల్ నుంచి కోయంబత్తూరుకు పరారైన కర్ణన్‌ను జూన్ 20న సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. 6 నెలల జైలు జీవితం అనంతరం గత డిసెంబరు 20న కర్ణన్ విడుదలయ్యారు. కాగా, పదవిలో ఉండగా అరెస్టయిన తొలి హైకోర్టు జడ్జిగా ఆయన రికార్డులకెక్కారు. మద్రాస్ హైకోర్టు జడ్జిగానూ ఆయన పనిచేశారు.