Varanasi Lok Sabha Seat
-
సంచలనం: జస్టిస్ కర్ణన్ రాజకీయ పార్టీ
కోల్‌కత: హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ మరో సంచలనానికి తెరలేపారు. 2019 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ పెడుతున్నట్లు బుధవారం ప్రకటించారు. దేశంలోని 543 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన తెలిపారు. ‘ఆంటీ కరప్షన్ డైనమిక్ పార్టీ’ (ఏసీడీపీ) పేరుతో పార్టీని రిజిస్టర్ చేయించబోతున్నట్లు కర్ణన్ సహాయకుడు ఆంథోని డబ్ల్యూ లిజారో వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నుంచి కర్ణన్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దిగుతారని ఆయన తెలిపారు. దేశం నుంచి అవినీతిని సమూలంగా తరిమికొట్టడమే తమ పార్టీ సిద్ధాంతమని కర్ణన్ ఉద్ఘాటించారు. వారణాసి మినహా మిగతా అన్ని స్థానాల నుంచి మహిళలు మాత్రమే తమ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగుతారని కర్ణన్ ప్రకటించారు. తమ పార్టీ తరపున ఎన్నికల పోటీలో పాల్గొనే అభ్యర్థులకు ఎన్నికల వ్యయంగా లక్ష రూపాయలు కర్ణన్ అందిస్తారని లిజారో తెలిపారు. కోల్‌కతా హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారన్న అభియోగంపై గతేడాది మే 9న జస్టిస్ కర్ణన్‌కు సుప్రీంకోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. దీంతో పశ్చిమబెంగాల్ నుంచి కోయంబత్తూరుకు పరారైన కర్ణన్‌ను జూన్ 20న సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. 6 నెలల జైలు జీవితం అనంతరం గత డిసెంబరు 20న కర్ణన్ విడుదలయ్యారు. కాగా, పదవిలో ఉండగా అరెస్టయిన తొలి హైకోర్టు జడ్జిగా ఆయన రికార్డులకెక్కారు. మద్రాస్ హైకోర్టు జడ్జిగానూ ఆయన పనిచేశారు. -
మోడీని ఓడిస్తా
ఢిల్లీ నుంచి రైల్లో వారణాసికి.. న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోకసభ స్థానం నుంచి బరిలో ఉన్న గుజరాత్ సీఎం నరేంద్రమోడీని ఓడిస్తానన్న నమ్మకం తనకుందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. వారణాసిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సోమవారం ఢిల్లీలో శివ్గంగా ఎక్స్‌ప్రెస్ రెలైక్కి వారణాసికి బయల్దేరారు. కేజ్రీవాల్‌ను సాగనంపేందుకు వందలాది మంది కార్యకర్తలు స్టేషన్‌కు చేరుకున్నారు. ‘‘ విప్లవం సృష్టించడానికే నేను వారణాసికి వెళ్తున్నాను. వారణాసి నుంచే విప్లవం మొదలవుతుంది. దేశాన్ని రక్షించడం కోసం నన్ను గెలిపించండని వారణాసి ప్రజలకు విజ్ఞప్తిచేస్తున్నా. దేశక్షేమం కోసం అమేథీలో రాహుల్‌ను, వారణాసిలో మోడీని ఓడించాల్సి ఉంది.’’ అని కార్యకర్తలనుద్దేశించి కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. -
వారణాసిలో మోడీతో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఢీ
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో తలపడే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నదానిపై ఉత్కంఠ వీడింది. స్థానిక ఎమ్మెల్యే అజయ్ రాయ్‌ని కాంగ్రెస్ తన అభ్యర్థిగా మోడీపై బరిలోకి దించింది. పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జీవాలా మంగళవారమిక్కడ ఈ విషయం తెలిపారు. వారణాసిలో మోడీపై పోటీ చేస్తామని దిగ్విజయ్ సింగ్, ఆనంద్ శర్మ, రషీద్ అల్వీలు ముందుకొచ్చినా పార్టీ స్థానిక నేతపైనే మొగ్గుచూపింది. పింద్రా నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అజయ్ క్షేత్రస్థాయిలో పనిచేశారని, సోనియా గాంధీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని సూర్జీవాలా చెప్పారు. అజయ్ 1996, 2002, 2007ల్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో మరుసటి ఏడాది పార్టీని వదిలేసి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. -
మోడిపై పోటీకి సై అంటున్న దిగ్విజయ్
న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ఢీకొనేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ సిద్దమవుతున్నారు. వారణాసిలో మోడీపై పోటీ చేసేందుకు ఆయన అంగీకరించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయాన్ని అధిష్టానంతో ఆయన చెప్పినట్టు తెలిసింది. దిగ్విజయ్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. మోడీకి ఆయన దీటైన అభ్యర్థి కాగలని అధిష్టానం భావిస్తోంది. వారణాసి నుంచి నరేంద్రమోడీ పోటీకి దిగుతున్న నేపథ్యంలో ఈ స్థానం నుంచి హస్తం తరఫున ఎవరు బరిలో దిగుతారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు వారణాసి అభ్యర్థిని కాంగ్రెస్ ఖరారు చేయలేదు. వారణాసి నుంచి ప్రముఖ వ్యక్తినే రంగంలోకి దింపనున్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ మిస్త్రీ చెప్పారు. ఈనేపథ్యంలో దిగ్విజయ్ పేరు తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.