నిరాహార దీక్షలు చేపడతా: జస్టిస్ కర్ణన్
కోల్‌కతా: సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్ణన్ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. తాను దళితుడైనందునే ఉన్నత న్యాయస్థానం వేధిస్తోందని కర్ణన్ ఆరోపిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా త్వరలోనే తాను నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు జారీ చేసిన బెయిలబుల్ అరెస్ట్ వారంట్‌ను వెనక్కి తీసుకోవాలని, ఫిబ్రవరి 8వ తేదీ నుంచి రద్దు చేసిన తన అధికారాలు, విధులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన విధులకు ఆటకం కలిగించినందుకు గాను రూ.14 కోట్ల పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.
ఈ డిమాండ్ల సాధనకు త్వరలోనే కోల్‌కతా, లక్నో, ఢిల్లీ, చెన్నై నగరాలలో నిరాహార దీక్షలు చేపడతానని తన ప్రతినిధి రమేశ్ పీటర్ కుమార్ ద్వారా ఆయన వెల్లడించారు. ఢిల్లీలో అయితే రాష్ట్రపతి భవన్ ఎదుటగానీ, లేక రామ్‌లీలా మైదానంలో ఎక్కడ పర్మిషన్ ఇస్తే అక్కడ దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు వారంట్ నేపథ్యంలో ఈ దీక్షలను మార్చి 31వ తేదీ తర్వాత చేపట్టాలా? అంతకు ముందే ప్రారంభించాలా? అనేది తాను ఇంకా నిర్ణయించుకోలేదని జస్టిస్ కర్ణన్ చెప్పారు.