న్యూఢిల్లీ: కౌమార బాలికలు లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని, బాలురు మహిళలను గౌరవించడం అలవర్చుకోవాలంటూ కలకత్తా హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇటువంటి తీర్పు ఎంతో అభ్యంతరకరం, అవాంఛనీయమని పేర్కొంది. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం కౌమార వయస్కుల హక్కులను పూర్తి స్థాయిలో ఉల్లంఘించడమేనని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్‌ల ధర్మాసనం పేర్కొంది.
‘సంబంధిత అప్పీల్‌లో న్యాయపరమైన అంశాలను పరిశీలించాలే తప్ప,న్యాయమూర్తులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తపరచరాదని, బోధనలు చేయరాదని ప్రాథమికంగా మేం భావిస్తున్నాం’అని తెలిపింది. ఈ అంశంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి, సంబంధిత వర్గాలకు నోటీసులు జారీ చేసింది.
సీనియర్ న్యాయవాది మాధవి దివాన్‌ను అమికస్ క్యూరీగాను, ఆమెకు సాయం అందించేందుకు న్యాయవాది లిజ్ మాథ్యూను నియమించింది. ‘ప్రతి కౌమార బాలిక లైంగిక కోరికలను నియంత్రించుకోవాలి. అలా కాకుండా, కేవలం రెండు నిమిషాల లైంగిక ఆనందాన్ని ఆస్వాదించడం కోసం లొంగిపోతే సమాజం దృష్టిలో ఆమె ఓడిపో యినట్లే’అని కలకత్తా హైకోర్టు అక్టోబర్ 18వ తేదీన ఓ కేసు తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం సుప్రీంకోర్టు స్వయంగా విచారణ జరిపింది.
Comments
Please login to add a commentAdd a comment