న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో రథయాత్ర నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టులో బీజేపీకి ఊరట లభించలేదు. రథయాత్రను కలకత్తా హైకోర్టు అడ్డుకోవడాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. సాధారణ పిటిషన్లతో పాటే దానినీ విచారిస్తామని సోమవారం కోర్టు రిజిస్ట్రీ అధికారులు స్పష్టం చేశారు. డిసెంబర్ 21 నాటి కలకత్తా హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని బీజేపీ కోరగా, సుప్రీంకోర్టు అంగీకరించలేదు.
2019 లోక్‌సభ ఎన్నికల ముంగిట పశ్చిమ బెంగాల్‌లోని 42 పార్లమెంట్ స్థానాల్లో ‘సేవ్ డెమొక్రసీ’ పేరిట ర్యాలీ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ యాత్రకు కలకత్తా హైకోర్టు ఏక సభ్య బెంచ్ తొలుత అనుమతి ఇవ్వగా, తరువాత డివిజన్ బెంచ్ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశాలున్నాయని రాష్ట్ర నిఘా వర్గాల ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసును మళ్లీ విచారించాలని ఏక సభ్య బెంచ్‌కే డివిజన్ బెంచ్ తిరిగి పంపింది. శాంతియుతంగా చేపట్టాలనుకున్న యాత్రను రాష్ట్ర అధికారులు లేవనెత్తిన సందేహాలు, ఊహాజనిత అభిప్రాయాల ఆధారంగా అడ్డుకోవడం తగదని బీజేపీ తన పిటిషన్‌లో పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ముఖ్య కార్యదర్శి, అదనపు డీజీపీలను కక్షిదారులుగా చేర్చాలని కోరింది.
బీజేపీ కార్యక్రమంలో హింస..
రథయాత్రను ప్రభుత్వం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఉత్తర 24 పరగణాలు జిల్లాలో నిర్వహించిన చట్ట ఉల్లంఘన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఇందులో పలువురు పోలీసులు, పౌరులు గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 54 మందిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment