rathayathra
-
రథయాత్ర: తీవ్ర విషాదంలో కుటుంబం
సాక్షి, నిర్మల్: జాతరకు వెళ్లిన ఓ వ్యక్తి విగతజీవిగా మారాడు. రథయాత్రలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన నిర్మల్‌లో చోటుచేసుకుంది. వివరాలు... అక్కాపూర్‌కు చెందిన మల్లేష్(45) ముజ్గి మల్లన్న జాతరకు వెళ్ళాడు. కాగా అక్కడి రథయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో కిందపడిపోయిన మల్లేష్ తీవ్రగాయాలపాలయ్యాడు. దీంతో వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకురాగా, చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో అతడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అక్కాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తీర్థయాత్ర ఇలా అంతిమయాత్రగా మారుతుందని ఊహించలేదంటూ కుటుంబ సభ్యులు విలపించిన తీరు అందరిచేతా కన్నీళ్లుపెట్టిస్తోంది. మరోవైపు.. ఇదే ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్స్ కోలుకుంటున్నారని, వారికి ప్రాణాపాయం లేదని పోలీసులు వెల్లడించారు. -
బీజేపీ రథయాత్రకు దక్కని ఊరట
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో రథయాత్ర నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టులో బీజేపీకి ఊరట లభించలేదు. రథయాత్రను కలకత్తా హైకోర్టు అడ్డుకోవడాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. సాధారణ పిటిషన్లతో పాటే దానినీ విచారిస్తామని సోమవారం కోర్టు రిజిస్ట్రీ అధికారులు స్పష్టం చేశారు. డిసెంబర్ 21 నాటి కలకత్తా హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని బీజేపీ కోరగా, సుప్రీంకోర్టు అంగీకరించలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల ముంగిట పశ్చిమ బెంగాల్‌లోని 42 పార్లమెంట్ స్థానాల్లో ‘సేవ్ డెమొక్రసీ’ పేరిట ర్యాలీ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ యాత్రకు కలకత్తా హైకోర్టు ఏక సభ్య బెంచ్ తొలుత అనుమతి ఇవ్వగా, తరువాత డివిజన్ బెంచ్ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశాలున్నాయని రాష్ట్ర నిఘా వర్గాల ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసును మళ్లీ విచారించాలని ఏక సభ్య బెంచ్‌కే డివిజన్ బెంచ్ తిరిగి పంపింది. శాంతియుతంగా చేపట్టాలనుకున్న యాత్రను రాష్ట్ర అధికారులు లేవనెత్తిన సందేహాలు, ఊహాజనిత అభిప్రాయాల ఆధారంగా అడ్డుకోవడం తగదని బీజేపీ తన పిటిషన్లో పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ముఖ్య కార్యదర్శి, అదనపు డీజీపీలను కక్షిదారులుగా చేర్చాలని కోరింది. బీజేపీ కార్యక్రమంలో హింస.. రథయాత్రను ప్రభుత్వం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఉత్తర 24 పరగణాలు జిల్లాలో నిర్వహించిన చట్ట ఉల్లంఘన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఇందులో పలువురు పోలీసులు, పౌరులు గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 54 మందిని అదుపులోకి తీసుకున్నారు. -
బీజేపీకి అనుకూలంగా హైకోర్టు తీర్పు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో బీజేపీ తలపెట్టిన ‘రథయాత్ర’కు కోల్‌కతా హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. మతపరమైన అల్లర్లు చెలరేగే అవకాశం ఉందనే పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో బీజేపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. గురువారం ఈ కేసులో వాదోపవాదనలు విన్న జస్టిస్ తపబ్రత చక్రవర్తి.. బీజేపీ రథయాత్రకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ విచక్షణాధికారాలను విపరీతమైన ధోరణిలో చలాయించిన సందర్భాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ‘సరైన కారణాలు చూపకుండానే అధికారులు యాత్రకు అనుమతిని నిరాకరిస్తున్నారు. సహేతుకమైన షరతులు విధించడం ద్వారానైనా యాత్రను అనుమతించాలా వద్దా అనే ప్రయత్నం కూడా వారు చేయలేదు’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. రథయాత్ర సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. ‘యాత్ర సాగే మార్గంలో వాహనాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలిగించరాదు. ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగినా బాధ్యత వహించాలి. రథయాత్రపై కనీసం 12 గంటలు ముందుగా సంబంధిత జిల్లా పోలీసు సూపరింటెండెంట్లకు సమాచారం అందించాలి’ అని బీజేపీ నాయకత్వాన్ని ఆయన ఆదేశించారు. అయితే, ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. తీర్పును స్వాగతించిన జైట్లీ తీర్పును కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్వాగతించారు. తమ పార్టీ ర్యాలీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వకపోవడంపై రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు. ‘పశ్చిమబెంగాల్లో ఒక రాజకీయ పార్టీ తనకున్న హక్కు ప్రకారం తన కార్యక్రమాన్ని నిర్వహించకుండా ప్రభుత్వం అడ్డుకుంటే మానవ హక్కుల కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీలు ఎందుకు మౌనంగా ఉన్నాయి? ఒకవేళ ఎన్డీఏ, బీజేపీ ప్రభుత్వం ఇలా చేస్తే అప్రకటిత ఎమర్జెన్సీ అనే వారు కదా! ఇప్పుడెందుకు మౌనం?’ అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీన ప్రారంభం కావాల్సిన బీజేపీ రథయాత్ర ‘సేవ్ డెమోక్రసీ ర్యాలీ’ప్రభుత్వ అనుమతి నిరాకరణ కారణంగా ఆగిపోయింది. కొత్త షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించి, యాత్ర ప్రారంభిస్తామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి దిలీప్ ఘోష్ తెలిపారు. -
రథయాత్రకు బెంగాల్ సర్కారు నో
కోల్‌కతా: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ చేపట్టదలచిన రథయాత్రకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం శనివారం అనుమతి నిరాకరించింది. రథయాత్రతో మతఘర్షణలు చెలరేగుతాయని తమకు నిఘా సమాచారం ఉందనీ, కాబట్టి యాత్రను తాము అనుమతించబోమని బెంగాల్ ప్రభుత్వం బీజేపీకి స్పష్టం చేసింది. గతంలోనే ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. దీంతో బీజేపీలోని ముగ్గురితో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా బెంగాల్ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి, డీజీపీలను హైకోర్టు ఆదేశించింది. -
ఏదేమైనా రథయాత్ర తథ్యం
న్యూఢిల్లీ: బెంగాల్లో ఎట్టి పరిస్థితులలోనూ రథయాత్ర చేపట్టే తీరతామని, తమని ఎవరూ ఆపలేరని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. యాత్ర ప్రస్తుతానికి తాత్కాలికంగా వాయిదా పడిందని.. రద్దు కాలేదన్నారు. రథయాత్రకు అనుమతి నిరాకరిస్తూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకెళ్తామన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీని చూసి భయపడుతున్నారని, అందుకే తాము చేపట్టే రథయాత్రను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ యాత్ర ద్వారా ప్రజల్లో మార్పు వస్తుందనే భయంతోనే మమత ప్రభుత్వం ఇదంతా చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే తీరుగా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తన పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. బీజేపీని ఎంత అణగదొక్కాలని చూస్తే అంతకంతకూ ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, తాము కచ్చితంగా మార్పు తీసుకొస్తామని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ మెజారిటీ సీట్లను గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి 100 రాజకీయ హత్యలకు 26 రాష్ట్రంలోనే జరుగుతున్నాయని ఓ సర్వేలో తేలిందని అమిత్‌షా ప్రస్తావించారు. -
26న ఇస్కాన్ రథయాత్ర
అనంతపురం కల్చరల్ : ఇస్కాన్ స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ నెల 26, 27 తేదీలలో రెండు రోజుల పాటు ధర్మవరం పట్టణంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ జిల్లా ప్రతినిధి దామోదర గౌరంగదాసు తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఇస్కాన్ మందిరంలో రథయాత్ర పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ తొలిరోజు నగరవీధుల్లో శోభాయమానంగా అలంకరించిన జగన్నాథ రథయాత్ర, రెండవరోజు నాదోత్సవం ఉంటాయన్నారు. ఇస్కాన్ దక్షిణ భారత దేశ అధ్యక్షులు సత్యగోపీనాథ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి రథయాత్ర ప్రాధాన్యతను వివరిస్తారన్నారు. వందలాది మంది కళాకారుల సమక్షంలో సాగే రథయాత్రలో జిల్లా వాసులు విరివిగా పాల్గొనాలని కోరారు.