న్యూఢిల్లీ: బెంగాల్‌లో ఎట్టి పరిస్థితులలోనూ రథయాత్ర చేపట్టే తీరతామని, తమని ఎవరూ ఆపలేరని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. యాత్ర ప్రస్తుతానికి తాత్కాలికంగా వాయిదా పడిందని.. రద్దు కాలేదన్నారు. రథయాత్రకు అనుమతి నిరాకరిస్తూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకెళ్తామన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీని చూసి భయపడుతున్నారని, అందుకే తాము చేపట్టే రథయాత్రను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ఈ యాత్ర ద్వారా ప్రజల్లో మార్పు వస్తుందనే భయంతోనే మమత ప్రభుత్వం ఇదంతా చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే తీరుగా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తన పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. బీజేపీని ఎంత అణగదొక్కాలని చూస్తే అంతకంతకూ ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, తాము కచ్చితంగా మార్పు తీసుకొస్తామని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ మెజారిటీ సీట్లను గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి 100 రాజకీయ హత్యలకు 26 రాష్ట్రంలోనే జరుగుతున్నాయని ఓ సర్వేలో తేలిందని అమిత్‌షా ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment