సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేకిత్తిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. మరో రెండు నెలల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు గల బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్-వామపక్షాలతో కూడిన కూటమి పట్టుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గడిచిన రెండేళ్ల వరకు రాష్ట్రంలో ఏమాత్రం ఉనికి కూడా లేని బీజేపీ గత లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని నమోదు చేసి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సవాలు విసిరింది. ఎవరూ ఊహించిన విధంగా 18 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. ఇప్పటికే రెండుసార్లు సీఎంగా విజయం సాధించిన ముచ్చటగా మూడోసారి ఆశపడుతున్న మమతకు చెక్ పెట్టేందుకు వ్యూహరచన చేస్తోంది.
ఉత్కంఠ పోరులో విజయం ఎవరిది..
ఇప్పటికే టీఎంసీకి చెందిన అనేకమంది కీలక నేతలను తనవైపుకు తిప్పుకుని ఎన్నికలకు ముందే పైచేయి సాధించింది. జంగల్‌మహాల్, నందిగ్రాం వంటి కీలకమైన ప్రాంతాల్లో పట్టున్న సువేందు అధికారి బీజేపీలో చేరడం మమతకు భారీ ఎదురుదెబ్బ లాంటిదే. ఆయనతో పాటు కెబినేట్ మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా దీదీకి హ్యాండ్ ఇచ్చి కాషాయ తీర్థం పుచ్చుకుంటున్నారు. అయితే నేతలు పోతేనేం తమకు ప్రజా మద్దతు ఉందంటూ మమత ధీమా వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల కాలంలో ప్రవేశపెట్టినే పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తమను మరోసారి గెలిపిస్తామని చెబుతున్నారు. మరోవైపు బీజేపీ సైతం విజయంపై సంచలన ప్రకటనలే చేస్తోంది. ఈ ఎన్నికల్లో టీఎంసీని చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమని, బెంగాల్ కోటపై కాషాయజెండా ఎగరేసి తీరుతామని కమళనాథులు స్పష్టం చేస్తున్నారు. బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బెంగాల్ ఎన్నికలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే తొలి విడత ప్రచారాన్ని ముగించారు. దేశ వ్యాప్తంగా బెంగాల్ ఎన్నికలపై పెద్ద చర్చేసాగుతోంది. ఉత్కంఠంగా సాగుతున్న పోరులో ఎవరు విజయం సాధిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది.
మమత హ్యాట్రిక్..
ఈ క్రమంలోనే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై ఓ సంస్థ నిర్వహించిన సర్వే ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడించింది. హోరాహోరీగా సాగిన పోరులో అధికార తృణమూల్ కాంగ్రెస్ మరోసారి విజయం సాధిస్తుందని సీఎన్‌ఎక్స్, ఏబీపీ ఆనంద (ప్రైవేటు సంస్థలు) నిర్వహించిన పబ్లిక్ ఒపినియన్ సర్వేలు తెలిపాయి. టీఎంసీ 146 నుంచి 156 స్థానాల్లో విజయం సాధించి మమత మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహిస్తారని పేర్కొన్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ 113-121 సీట్లు సాధించే అవకాశం ఉందని చెప్పాయి. మేజిక్ ఫిగర్ 148 సీట్లు కాగా... కాంగ్రెస్-వామపక్షాల నేతృత్వంలోని కూటమికి 20-28 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేల్చాయి. అయితే మెజార్టీ సంఖ్యకు మమత కొంత దూరంలో నిలిచిపోతే లెఫ్ట్ కూటమి మద్దతుతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి. కాగా బెంగాల్ వ్యాప్తంగా జనవరి 23 నుంచి ఫిబ్రవరి 7 వరకు 8,960 మంది నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ సర్వేను వెల్లడించినట్లు సీఎన్‌ఎక్స్ నిర్వహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment