కోల్‌కత్తా : టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీ రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. తన స్వరాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఈ మేరకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో బుధవారం హుబ్లీలో నిర్వహించిన ర్యాలీ పాల్గొని టీఎంసీ గూటికి చేరాడు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో మనోజ్ రాజకీయ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గతకొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాడు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేంద్రంలోని మోదీ సర్కార్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్రో ధరలను పెంచుతోందంటూ విమర్శలు కురిపించాడు. అంతేకాకుండా సామన్యుడి నడ్డివిరిచేలా పెరుగుతున్న ధరల్లో పెట్రోల్, డీజిల్ భారీ భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. కాగా బెంగాల్‌లో రాజకీయ కాక తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోరు ఉత్కంఠగా మారింది. అధికార టీఎంసీ నేతల్ని టార్గెట్‌గా చేసుకున్న బీజేపీ.. విజయమే లక్ష్యంగా దూసుకుడుగా వ్యవరిస్తోంది. మరోవైపు బీజేపీ దూకుడుకు కళ్లెం వేసేలా మమత పావులు కదుపుతున్నారు. బీజేపీ వ్యతిరేక శక్తుల్ని తనవైపుకు తిప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత లోక్‌సభ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులకు టికెట్లు కేటాయించి పార్లెమెంట్‌కు పంపిన విషయం తెలిసిందే. తాజాగా మనోజ్ తివారీని సైతం తన గూటికి చేర్చుకున్నారు.
కాగా 35 ఏళ్ల మనోజ్ తివారీ టీమిండియా తరుఫున వన్డే, టీ-20లకు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో సొంత జట్టు కోల్‌కత్త తరఫున సుదీర్ఘంగా ఆడాడు. కొన్నాళ్ల పాటు పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. రాష్ట్ర స్థాయిలో బెంగాల్ క్రికెట్‌కు సారథిగా వ్యవహరించాడు. 2008లో ఫిబ్రవరి 3న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ద్వారా అరంగేట్రం చేసిన తివారీ.. 12 వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తరువాత ఫామ్ కోల్పోవడంతో జట్టుకి దూరమయ్యాడు. ఐపీఎల్‌లో రాణించినప్పటికీ జట్టులో మరోసారి చోటుదక్కలేదు. ఈ క్రమంలోనే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నకావడంతో రాజకీయ రంగ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే టీఎంసీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తారా లేక అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment