ప్రధాన న్యాయమూర్తి విమానం ఎక్కకూడదట!
కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్నన్ విచిత్రమైన ఆదేశాలు జారీచేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ సహా మొత్తం ఏడుగురు న్యాయమూర్తులు విమానాలు ఎక్కి విదేశాలకు వెళ్లకుండా చూడాలంటూ న్యూఢిల్లీలోని ఎయిర్ కంట్రోల్ అథారిటీని ఆదేశించారు. వాళ్ల మీద ఉన్న కేసులు తేలేవరకు ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపారు. కోల్‌కతా న్యూటౌన్‌లోని రోజ్‌డేల్ టవర్స్‌లో గల తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక కోర్టు నుంచి ఆయన ఈ ఆదేశాలు ఇవ్వడం విశేషం.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేఖర్, ఇంకా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ పినకి చంద్రఘోష్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌ల మీద ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేయాలంటూ ఏప్రిల్ 13న జస్టిస్ కర్నన్ ఆదేశాలు ఇచ్చారు. వాళ్లంతా ఏప్రిల్ 28న తన ఇంట్లోని కోర్టు ఎదుట హాజరు కావాలని సమన్లు సైతం ఇచ్చారు. అంతకుముందు జస్టిస్ కర్నన్ మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్, ఆరుగురు ఇతర న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభించింది. మార్చి 31న కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు, హైకోర్టులలో ప్రస్తుతం పనిచేస్తున్న, రిటైర్ అయిన 20 మంది న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు చేసిన జస్టిస్ కర్నన్.. వాటిని ప్రధానమంత్రికి, సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి పంపారు. వాటిని ఉపసంహరించుకోవాలని సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం సూచించగా, తనకు అంతకుముందున్న అధికారాలను పునరుద్ధరిస్తేనే అలా చేస్తానని ఆయన చెప్పారు. దానికి ధర్మాసనం తిరస్కరించింది. నాలుగు వారాల్లోగా కోర్టు ధిక్కార ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని, మే 1న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈలోపు జస్టిస్ కర్నన్.. తనదైన శైలిలో ఈ ఆదేశాలు ఇచ్చారు.