న్యాయ కోవిదులు, భిన్న రంగాలకు చెందిన బాధ్యతగల పౌరులు కొన్ని నెల లుగా ఏం జరగకూడదని కోరుకున్నారో చివరకు అదే అయింది. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు కోర్టు ధిక్కార నేరం కింద సర్వోన్నత న్యాయస్థానం ఆర్నెల్ల జైలు శిక్ష విధించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కేహార్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ ఏకగ్రీవ నిర్ణయాన్ని ప్రకటించడంతోపాటు దీన్ని తక్షణం అమలు చేయాలని ఆదేశించింది. ఇకముందు ఆయన ఇచ్చే ఆదేశాలేవీ మీడియాలో రాకూడదని కూడా ధర్మాసనం ఆంక్షలు విధించింది. ఒక హైకోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టే కోర్టు ధిక్కార నేరం కింద శిక్షించాల్సి రావడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం.
కొన్నాళ్లుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల విషయంలోనే విచిత్రమైన ఉత్తర్వులిస్తూ వచ్చిన జస్టిస్ కర్ణన్ సోమవారం ఏకంగా ప్రధాన న్యాయమూర్తికి, మరో ఏడుగురు న్యాయమూర్తులకు అయిదేళ్ల కఠిన శిక్ష విధిస్తూ ‘తీర్పు’నిచ్చారు. దళితుడిని కనుక తనపై వీరంతా వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. రాజకీయ రంగంలోనో, మరో రంగంలోనో పరస్పరం ఆరోపణలు చేసుకోవడం సర్వసాధారణం. న్యాయ వ్యవస్థలో అలాంటి ధోరణులు లేవు. వాటి సంగతి అటుంచి శిక్షలు విధించడమ న్నది లేనేలేదు.
సర్వోన్నత న్యాయస్థానంతో జస్టిస్ కర్ణన్‌కు లడాయి మొదలై దాదాపు ఏడా దిన్నర అవుతోంది. మద్రాస్ హైకోర్టులో పనిచేస్తున్నప్పుడు సహచర న్యాయమూ ర్తులతో ఆయనకు తలెత్తిన చిన్నపాటి వివాదం ఇంతవరకూ రావడం దుర దృష్టకరమైన విషయం. సివిల్ జడ్జీల ఎంపిక కోసం ఏర్పాటైన కమిటీలో జస్టిస్ ధనపాలన్‌ను నియమించడాన్ని వ్యతిరేకించడంతోపాటు ఆయన బోగస్ సర్టిఫి కెట్లతో ఈ పదవిలోకి వచ్చారని ఆరోపించి దానిపై సీబీఐ దర్యాప్తు జరపాలంటూ ఆదేశాలిచ్చి ఆయన అందరినీ నివ్వెరపరిచారు. అవి అమలు కాకుండా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌కే కౌల్ ఉత్తర్వులివ్వడంపై ఆగ్రహించి ఆయనపై కోర్టు ధిక్కార నేరం కింద చర్య తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రీ నివేదించడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని జస్టిస్ కర్ణన్ ఇచ్చిన ఆదేశాలన్నిటినీ నిలిపివేసింది. దాంతోపాటు సంజాయిషీ ఇవ్వమని జస్టిస్ కర్ణన్‌ను కోరింది. అలా వివాదం ఉన్నకొద్దీ ముది రిందే తప్ప ఆగలేదు. నిజానికి ఈ వివాదానికి ముందు సైతం కొన్ని కేసుల్లో ఆయన ఇచ్చిన తీర్పులు అందరినీ ఆశ్చర్యానికి లోనుచేశాయి. పెళ్లీడు వచ్చిన ఇద్దరు ఆడ, మగ వ్యక్తుల మధ్య లైంగిక సంబంధం ఏర్పడితే దాన్ని పెళ్లిగా... వారిని భార్యాభర్తలుగా పరిగణించవచ్చునని జస్టిస్ కర్ణన్ తీర్పునిచ్చినప్పుడు అందరూ నిర్ఘాంతపోయారు. ఈ తీర్పు రేకెత్తించిన సంచలనాన్ని గమనించుకుని ఆ తర్వాత ఆయనే దాన్ని వెనక్కి తీసుకున్నారు.
న్యాయమూర్తిని అరెస్టు చేసేదాకా విషయం వెళ్లింది గనుక ఈ వ్యవహారం ఇంత చర్చనీయాంశం అయింది గానీ... వేరే వివాదాల్లో చిక్కుకున్న న్యాయ మూర్తులు గతంలో కూడా లేకపోలేదు. మహిళలపై లైంగిక వేధింపులు మొదలు కొని ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టడం వంటి ఆరోపణలవరకూ అందులో ఉన్నాయి. సెలవుపై వెళ్లమని, పదవినుంచి తప్పుకోమని సుప్రీంకోర్టు ఆదేశించినా మొరాయించిన జస్టిస్ రామస్వామి, జస్టిస్ పీడీ దినకరన్, జస్టిస్ షమిత్ ముఖర్జీ, జస్టిస్ సౌమిత్రసేన్ వంటి న్యాయమూర్తులున్నారు. వీరిలో చాలామంది విషయం అభిశంసన వరకూ వెళ్లాక తప్పుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసిన జస్టిస్ ఏకే గంగూలీ, జస్టిస్ స్వతంత్ర కుమార్‌లు తమతో అసభ్యంగా ప్రవర్తించారని మూడేళ్లక్రితం ఇద్దరు యువతులు ఆరోపిం చారు. మధ్యప్రదేశ్‌లో ఒక జిల్లా అదనపు సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్న మహిళ ఒకరు హైకోర్టు న్యాయమూర్తిపై తనను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఆరోపణల వెనక కుట్ర ఉన్నదన్నదే ఆ న్యాయమూర్తుల జవాబు.
తన ఫిర్యాదును సరిగా పట్టించుకోలేదన్న ఆవేదనతో మహిళా న్యాయమూర్తి తానే రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ బాలకృష్ణన్‌పై కూడా అవినీతి ఆరోపణ లొచ్చాయి. సకాలంలో స్పందించి చక్క దిద్దకపోతే వ్యక్తులుగా కొందరు చేసే పనుల వల్ల జనం దృష్టిలో సంస్థలు పలచనవుతాయి. ఇంగ్లండ్ లార్డ్ చీఫ్ జస్టిస్ ఊల్ఫ్ అన్నట్టు పాత గడి యారాలకు నూనె పట్టించి, లోటుపాట్లు సరిదిద్ది సరైన సమయాన్ని చూపేలా చేసు కున్నట్టే న్యాయవ్యవస్థను కూడా ఎప్పటికప్పుడు చక్కదిద్దుకోవాల్సిన అవ సరం ఉంటుంది. ఆ విషయంలో మన న్యాయవ్యవస్థ తగిన ఏర్పాట్లు చేసు కోలేదనే చెప్పాలి.
న్యాయమూర్తుల నియామకాలకు కొలీజియం వ్యవస్థ ఉందిగానీ... తొల గించడానికి మాత్రం అలాంటిదేమీ లేదు. సుప్రీంకోర్టు మహా అయితే అటువంటి ఆరోపణలున్నవారిని ఏ మారుమూల హైకోర్టుకో బదిలీ చేస్తుంది. ఇందువల్ల ఆయా హైకోర్టుల్లో పని చేసేవారు తమ కోర్టును చిన్నచూపు చూస్తున్నారన్న అభిప్రాయాన్ని ఏర్పర్చుకున్న సందర్భాలున్నాయి. 1968 నాటి న్యాయమూర్తుల (విచారణ) చట్టం ఉన్నా ఆచరణలో అది పెద్దగా ఉపయోగపడింది లేదు. పార్లమెంటు అభిశంసించడమనే ప్రక్రియ ఎంతో సుదీర్ఘమైనది. దాన్ని అమల్లో పెట్టిన సందర్భాలు మన దేశంలో చాలా తక్కువ.
కనీసం అమెరికా, బ్రిటన్ తదితర దేశాల తరహాలో నియామకాల సమయంలో పారదర్శకత పాటించి, ఆయా వ్యక్తుల అర్హతలపై బహిరంగ చర్చ జరిగేలా చూస్తే ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉంటాయి. జస్టిస్ కర్ణన్ విషయానికొస్తే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కెకె వేణుగోపాల్ తదితరులు సూచించినట్టు ఆయన ఎటూ వచ్చే నెలలో రిటైర్ కావాల్సి ఉన్నది గనుక సుప్రీంకోర్టు మరికాస్త ఔదార్యం ప్రదర్శించి ఉంటే బాగుండేది. జస్టిస్ కర్ణన్ ప్రవర్తన అతిగా ఉన్న సంగతి నిజమే అయినా... ఆయన తీవ్రమైన అవినీతి ఆరోపణల్లో చిక్కుకోలేదని గుర్తించాలి.
న్యాయమూర్తిపై ధిక్కార నేరం
Published Wed, May 10 2017 1:12 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement