సీవీసీని జైల్లో పెట్టాలి: రామ్ జెఠ్మలానీ
జైలుకు వెళ్లాల్సిన వ్యక్తిని ఎన్డీయే ప్రభుత్వం ప్రధాన విజిలెన్స్ కమిషనర్‌గా నియమించిందంటూ కేంద్ర న్యాయశాఖ మాజీమంత్రి రామ్ జెఠ్మలానీ మండిపడ్డారు. కేవీ చౌదరిని సీవీసీగా నియమించడాన్ని సవాలుచేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, జెఠ్మలానీ వ్యాఖ్యలపై సుప్రీం ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ''జైల్లో ఉన్న చాలామంది ఖైదీల తరఫున మీరు వాదించి, వాళ్లను బయటకు పంపాలని కోరుతారు, ఇప్పుడు మీరు ఓ వ్యక్తిని జైలుకు పంపాలని అడుగుతున్నారా..'' అని ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అయితే.. ''ఇప్పటికైనా నేను మారినందుకు మీరు నన్ను ప్రశంసించాలి'' అని దానికి జెఠ్మలానీ సమాధానమిచ్చారు. సీవీసీ నియామకం కేసు విచారణను ధర్మాసనం ఈనెల 29వ తేదీకి వాయిదా వేసింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మాజీ అదినేత కేవీ చౌదరిని సీవీసీగాను, ఇండియన్ బ్యాంకు మాజీ సీఎండీ టీఎం భాసిన్‌ను విజిలెన్స్ కమిషనర్‌గాను నియమించడాన్ని 'కామన్ కాజ్' అనే స్వచ్ఛంద సంస్థ సవాలు చేసింది.