
న్యూఢిల్లీ : ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలాని (95) మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. దేశం ఓ గొప్ప న్యాయవేత్తను కోల్పోయిందని పేర్కొంటూ నివాళులర్పించారు. జెఠ్మలాని కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘ఎమర్జెన్సీ కాలంలో (1975-77) ప్రజల స్వేచ్ఛకోసం ధైర్యంగా పోరాటం సాగించిన గొప్ప న్యాయ కోవిదుడు’అని ప్రధాని ట్విటర్‌లో పేర్కొన్నారు. రామ్ జెఠ్మలాని కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలాని మృతి బాధాకరం. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయనెంతో కృషి చేశారు. దేశం ఓ గొప్ప, సమర్థత గల న్యాయవేత్తను కోల్పోయింది’ ప్రధాని ట్విటర్‌లో పేర్కొన్నారు.
(చదవండి : ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ కన్నుమూత)
‘దేశ పార్లమెంటు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పటిష్టతకు గొప్ప సేవలందించిన న్యాయవేత్తను, ప్రజల మనిషిని దేశం కోల్పోయింది. తను ఎంచుకున్న మార్గంలో లౌక్యం, ధైర్యంతో ముందుకు దూసుకుపోయే మనిషి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెన్నుచూపని న్యాయవాది’ అని జెఠ్మలానిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గుర్తు చేసుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జెఠ్మలాని మృతికి సంతాపం తెలిపారు. ‘జెఠ్మలాని నాకొక ఆప్త మిత్రుడు’అని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి కపిల్ సిబల్ తదితరులు జఠ్మలాని మృతికి సంతాపం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment