నేనెప్పుడు చనిపోతానో మీకెందుకు?
ఎవరికైనా 90 ఏళ్ల వయసు దాటిందంటే కృష్ణా రామా అనుకోవడం.. ఎప్పుడు వెళ్లిపోతామా అని చూడటం సర్వసాధారణం. కానీ, కొంతమంది మాత్రం ఎంత వయసు వచ్చినా చురుగ్గానే ఉంటారు. వయసు ప్రభావం శరీరం మీదే కాదు.. మనసు మీద కూడా లేదంటారు. ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ 93 ఏళ్ల వయసు వచ్చినా ఇప్పటికీ ఆయనకు డిమాండు ఏమాత్రం తగ్గలేదు, ఆయన వాదనల్లో వాడి వేడి కూడా తగ్గలేదు. అందుకే సుప్రీంకోర్టులో ఇప్పటికీ ఆయనే నెంబర్ వన్ క్రిమినల్ లాయర్. సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తిని సైతం నిలదీసి ప్రశ్నించే సత్తా ఆయన సొంతం. సరిగ్గా ఇలాంటి ఘటనే సుప్రీంకోర్టులో చోటు చేసుకుంది.
ఎంఎం కశ్యప్ అనే న్యాయవాదిని ఆయన ఛాంబర్ ఖాళీ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించడంతో దానికి సంబంధించిన కేసును ఆయన వాదిస్తున్నారు. ఈ సందర్భంలోనే.. మీరెప్పుడు రిటైర్ అవుతున్నారు అంటూ జెఠ్మలానీని ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. దానికి జెఠ్మలానీ అంతే స్థాయిలో స్పందించారు. ''నేను ఎప్పుడు చనిపోతానని మీరు అడుగుతున్నారు'' అని ఆయన అడిగారు. అంటే.. తాను ఊపిరి ఉన్నంతవరకు న్యాయవాద వృత్తిలో కొనసాగుతూనే ఉంటానని, కేవలం మృత్యువు మాత్రమే తనను ఆపగలదని ఆయన చెప్పకనే చెప్పారు. దటీజ్ రాం జెఠ్మలానీ. అందుకే హైప్రొఫైల్ కేసులకు సంబంధించి ఏమైనా వాదించాలంటే గంటకు ఇంత అని మాట్లాడుకుని మరీ ఆయనను వివిధ హైకోర్టులకు కూడా రప్పించుకుంటారు.