పాకిస్తాన్ మొండి వైఖరి
ఇస్లామాబాద్: భారత నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్ జాధవ్‌కు మరణశిక్ష విధించడాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ముందు కూడా గట్టిగా సమర్థించుకునేందుకు పాకిస్తాన్ వ్యూహం రచిస్తోంది. గూఢచర్యం, విద్రోహ కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పాక్ మిలిటరీ కోర్టు జాధవ్‌కు విధించిన మరణశిక్షపై ఐసీజే స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. జాధవ్ కేసుకు సంబంధించి తమ సిఫారసులను ప్రధాన మంత్రికి, విదేశీ కార్యాలయానికి పంపామని పాక్ అటార్నీ జనరల్ అస్తార్ ఔసఫ్ చెప్పినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ కేసులో పాక్ గట్టి సమాధానమే ఇస్తుందని ఔసఫ్ చెప్పారు.
ఈ నెల 15న ప్రారంభమయ్యే ఐసీజే విచారణకు ఔసఫ్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన రెండు రోజులుగా అధికారులతో, విదేశీ కార్యాలయం, న్యాయ మంత్రిత్వశాఖతో నిర్విరామంగా సంప్రదింపులు జరుపుతున్నారు. ఐసీజే ముందు అధికార పరిధి గురించి పాక్ ప్రస్తావించ వచ్చని అంతర్జాయ చట్టాలపై అవగాహన కలిగిన న్యాయ నిపుణుడు ఒకరు అభిప్రాయ పడ్డారు. 1999లో అట్లాంటిక్ విమానం షూటింగ్‌కు సంబంధించి భారత్ కూడా అధికార పరిధి గురించి ప్రస్తావించిందని గుర్తు చేశారు.