
హేగ్: భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(48)కు పాకిస్తాన్ సైనిక కోర్టు మరణశిక్ష విధించడంపై నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో సోమవారం నుంచి వాదనలు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి 22 వరకూ నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ కోర్టు భారత్, పాకిస్తాన్‌ల వాదనల్ని విననుంది. ఈ కేసులో భారత్ తరఫున మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే, పాకిస్తాన్ తరఫున బారిస్టర్ ఖవార్ ఖురేషీ వాదనలు వినిపించనున్నారు. 2016, మార్చి 3న ఇరాన్ నుంచి బలోచిస్తాన్‌లోకి అక్రమంగా ప్రవేశించిన కుల్‌భూషణ్ జాధవ్‌ను అరెస్ట్ చేసినట్లు పాక్ ప్రకటించింది. ముస్లిం పేరున్న నకిలీ పాస్‌పోర్టుతో జాధవ్ పాక్‌లో గూఢచర్యం చేసేందుకు ప్రవేశించారనే నేరంపై పాక్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే.