వాషింగ్టన్ : అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా భారత్‌కు చెందిన దల్వీర్ భండారి మరో పర్యాయం ఎన్నికయ్యారు. బ్రిటన్ తరపు అభ్యర్థి క్రిస్టొఫర్ గ్రీన్‌వర్డ్ వెనక్కి తగ్గటం.. భండారికి అత్యధిక ఓట్లు పోలు కావటంతో ఆయన ఎన్నికైనట్లు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.
సోమవారం నిర్వహించిన సమావేశంలో సాధారణ అసెంబ్లీలోని మొత్తం 193 ఓట్లకు గానూ 183 ఓట్లకు దక్కించుకున్న ఆయన.. భద్రతా మండలిలోని మొత్తం 15 ఓట్లు దక్కించుకోవటం విశేషం. అంతకు ముందు ఇరువురి మధ్య హోరాహోరీ పోటీతో హైడ్రామానే నడిచింది. తొలుత భండారీ(70)కి 193మంది ఐరాస సభ్య దేశాల్లో దాదాపు మూడింట రెండు వంతుల మంది మద్దతు లభించింది. తద్వారా గ్రీన్‌వర్డ్, భండారీ కన్నా 50ఓట్లు వెనుకంజలో ఉన్నట్లయ్యింది. అయితే భద్రతా మండలిలో భండారీకి ఐదు ఓట్లు రాగా, గ్రీన్‌వర్డ్‌కు 9ఓట్లు లభించాయి. ఈ నేపథ్యంలో ఇరు సభలను సమావేశపరిచి ఓటింగ్ నిర్వహించాలని బ్రిటన్ పట్టుబట్టింది.
96 సంవత్సరాల క్రితం ఉపయోగించిన సంయుక్త సమావేశపు ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. అయితే భద్రతా మండలి శాశ్వత సభ్యత్వాన్ని దుర్వినియోగం చేయడానికి బ్రిటన్ ప్రయత్నిస్తోందని భారత దౌత్య వర్గాలు గట్టిగా తమ వాదనను వినిపించాయి. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా ఇరు సభలు సమావేశమై వరుస రౌండ్లలో ఓటింగ్ నిర్వహిస్తూ వస్తున్నాయి. తీవ్ర విమర్శల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కి తగ్గిన బ్రిటన్ పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించాయి. సోమవారం మధ్యాహ్నాం ఇరు సభలు సమావేశమై ఓటింగ్ నిర్వహించగా.. బరిలో ఉన్న ఏకైక అభ్యర్థి భండారీకే మెజార్టీ ఓట్లు పల్ కావటంతో ఆయన ఎన్నికను ఖరారు చేస్తూ ప్రకటన వెలువరించింది.
అంతర్జాతీయ న్యాయస్థానంలో 15మంది న్యాయమూర్తుల్లో మూడవ వంతు మంది ప్రతి మూడేళ్ళకోసారి ఎన్నికవుతారు. వీరి పదవీకాలం 9ఏళ్లపాటు వుంటుంది. గతంలో అమలైన పద్ధతి ప్రకారం అభ్యర్థికి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మెజారిటీ వస్తే అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఎన్నికయ్యేవారు. ఐసిజె న్యాయమూర్తిగా ఎన్నికవ్వాలంటే అటు ఐరాస సాధారణ అసెంబ్లీలో.. ఇటు భద్రతా మండలిలో మెజారిటీ రావాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment