సింధు నది ఒప్పందంపై పాక్ గగ్గోలు
- ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా తప్పుకోలేదు
- ఇంటర్నేషనల్ కోర్టుకు వెళుతామని వ్యాఖ్య
ఇస్లామాబాద్: సింధు నది జలాల పంపిణీ ఒప్పందం నుంచి తప్పుకోవాలన్న భారత్ నిర్ణయంపై పాకిస్థాన్ గగ్గోలు పెట్టింది. ఈ ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిస్తే.. తాము అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొంది. ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో సింధు నదీ జలాలపై భారత్-పాకిస్తాన్ చర్చలను రద్దు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నెత్తురు, నీళ్లు కలిసి ప్రవహించలేవంటూ ఈ ఒప్పందంపై సమీక్షా సమావేశంలో ప్రధాని మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే.
'అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారత్ ఏకపక్షంగా ఈ ఒప్పందం నుంచి తప్పుకోలేదు' అని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజిజ్ మంగళవారం పేర్కొన్నారు. పాక్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. కార్గిల్ యుద్ధం, సియాచిన్ సంఘర్షణ సమయంలోనూ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని గుర్తుచేశారు. ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధు నది ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేయలేదని, ఒప్పందాన్ని రద్దుచేయడానికిగానీ, ఒప్పందం నుంచి తప్పుకోవడానికిగానీ ఎలాంటి నిబంధనలు లేవని, ఇది కుదరదని సర్తాజ్ అజిజ్ పేర్కొన్నారు.