హరీష్ సాల్వే ఫీజు.. ఒక్క రూపాయే!
ఆయన సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది. ఏదైనా కేసు ఒప్పుకున్నారంటే ఒక్క రోజుకు రూ. 5 లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా ఫీజు తీసుకుంటారు. కానీ ఆ ఒక్క కేసు విషయంలో మాత్రం.. ఆయన డబ్బులను ఏమాత్రం లెక్కచేయలేదు. దేశభక్తి ముందు డబ్బులు తనకు బలాదూర్ అని చెప్పి, కేసు మొత్తం వాదించినందుకు కేవలం ఒకే ఒక్క రూపాయి ఫీజు తీసుకుంటున్నారు. అది ఏం కేసని అనుకుంటున్నారా? పాకిస్తాన్‌లో గూఢచారి అని ముద్రవేసి మరణశిక్ష విధించిన కులభూషణ్ జాదవ్ కేసు. అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న ఈ కేసులో భారతదేశం తరఫున ఆయన వాదిస్తున్నారు. సాల్వే నిర్ణయం తెలిసి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఆశ్చర్యపోయారు.
హరీష్ సాల్వే సాధారణంగా సుప్రీంకోర్టులోను, ఢిల్లీ హైకోర్టులోనే వాదిస్తారు. అరుదుగా మాత్రమే వేరే కోర్టులకు వస్తారు. చాలా పెద్ద కేసు అనుకున్నప్పుడు, ప్రతిష్ఠాత్మకంగా భావించినప్పుడు మాత్రమే ఆయనను తీసుకొస్తారు. సాల్వేకి యాపిల్ ఉత్పత్తులంటే చాలా ఇష్టం. అవి లాంచ్ అయిన కొద్ది గంటల్లోనే ఆయన ఇంట్లో ఉండాలి. పియానో వాయిస్తారు, జాజ్ అంటే ఇష్టం, అప్పుడప్పుడు తన బెంట్లీ కారును స్వయంగా నడుపుకొంటూ వెళ్తారు. గతంలో భారత మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ వద్ద సాల్వే పనిచేశారు. సల్మాన్ ఖాన్, ముఖేష్ అంబానీ లాంటి పెద్దవాళ్ల తరఫున వాదించిన హరీష్ సాల్వే.. గుజరాత్ అల్లర్ల కేసులో జాతీయ మానవహక్కుల కమిషన్ కోరిక మేరకు బిల్కిస్ బానో తరఫున వాదించారు. గతంలో ఇదే అంతర్జాతీయ కోర్టులో మార్షల్ ఐలండ్స్ విషయంలో భారత్ మీద వచ్చిన వివాదాన్ని ఆయన విజయవంతంగా తిప్పికొట్టారు.