తుది తీర్పు కూడా మనకే అనుకూలం: రోహత్గీ
కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. తుది తీర్పు కూడా మనకు అనుకూలంగా ఉంటుందన్న ఆశాభావాన్ని భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వ్యక్తం చేశారు. జాదవ్ తిరిగి స్వదేశానికి రావడాన్ని మనమంతా చూస్తామని ఆయన అన్నారు. ఈ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
భారతదేశం ముందు నుంచి ఈ కేసు విషయంలో తన వాదన గట్టిగా వినిపించిందని, ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ.. ముఖ్యంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖను అభినందిస్తున్నానని ఆయన అన్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం నిర్ణయంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అయ్యిందని, ఈ నిర్ణయానికి ఇరు దేశాలూ తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సిందేనని రోహత్గి తెలిపారు.
అంతర్జాతీయ కోర్టు నిర్ణయంతో దేశవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. పలు నగరాల్లో టపాసులు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తుది తీర్పు వెల్లడించేవరకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి చర్య తీసుకోకూడదని అంతర్జాతీయ న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాక, ఈ కేసులో అక్కడ జరుగుతున్న విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు తమకు తెలియజేస్తూ ఉండాలని కూడా తెలిపింది. భారత రాయబార కార్యాలయం నుంచి తప్పనిసరిగా అధికారులు జాదవ్‌ను కలిసే అవకాశం కల్పించాలని స్పష్టం చేయడం కూడా భారతదేశానికి దౌత్య పరంగా మంచి విజయమని పలువురు న్యాయనిపుణులు అంటున్నారు.