- ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ
- కీలకమైన రెండు నేరారోపణల్లో అసలు అదానీల పేర్లే లేవు
- ‘ఎఫ్‌సీపీఏ’ని ఉల్లంఘించారన్న నేరారోపణల్లో అదానీల పేర్లు లేవు
- న్యాయానికి ఆటంకం కలిగించారన్న ఆరోపణల్లోనూ వారి పేర్లు లేవు
సాక్షి, అమరావతి: సౌర విద్యుత్ ప్రాజెక్టుల సంబంధించి అదానీ గ్రూపు లంచాలు ఇచ్చేందుకు కుట్ర పన్నిందంటూ యూఎస్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ) కింద అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (డీఓజే) కేసు నమోదు చేయడాన్ని ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ అటార్నీ జనరల్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తప్పుబట్టారు. ‘డీఓజే’ చేసిన నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయమైన ఆధారాలు ఏవీ లేవని ఆయన స్పష్టం చేశారు.
ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ)ను ఉల్లంఘించారనే విషయంలో అదానీలపై ఎలాంటి నేరారోపణలు లేవన్నారు. అలాగే న్యాయాన్ని అడ్డుకున్నారన్న నేరారోపణలో కూడా అదానీల పేర్లు గానీ వారి అధికారుల పేర్లు గానీ లేవని వెల్లడించారు. ఈ రెండు కీలకమైన నేరారోపణల్లో అదానీల పేర్లు లేవన్న సంగతిని అందరూ.. ముఖ్యంగా మీడియా గుర్తించాలని సూచించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఏం చెప్పారంటే...
యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ మోపిన నేరారోపణ పత్రాన్ని నేను చదివా. ఆయా వ్యక్తుల నిర్దిష్ట చర్యలపై అభియోగాలు మోపుతూ మన దేశంలో దాఖలు చేసే చార్జిషీట్ లాంటిది ఇది. నా లెక్క ప్రకారం మొత్తం ఐదు నేరారోపణలున్నాయి. ఇందులో మొదటి, ఐదో నేరారోపణలు మిగిలిన వాటికన్నా చాలా ముఖ్యమైనవి. అయితే ఒకటో నేరారోపణలోగానీ ఐదో నేరారోపణలోగానీ అదానీ, ఆయన మేనల్లుడు పేర్లు లేనే లేవు.
ఆ నేరారోపణలు మన దేశంలో దాఖలు చేసే చార్జిషీట్ లాంటివి. అది లంచం కావచ్చు.. దొంగతనం కావచ్చు.. హత్య కావొచ్చు. మొదటి నేరారోపణలో ఇద్దరు అదానీల పేర్లు లేవు. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ) కింద ఈ నేరారోపణలు చేశారు. ఎఫ్‌సీపీఏ అనేది మన దేశంలో అవినీతి నిరోధక చట్టం లాంటిది. మొదటి నేరారోపణ ఏమిటంటే.. ఎఫ్‌సీపీఏని ఉల్లంఘించేందుకు కుట్ర పన్నారన్నది. ఇందులో ఆదానీల పేర్లు లేవు. వారి అధికారుల పేర్లు ఉన్నాయి. రెండు, మూడు, నాలుగో ఆరోపణలు సెక్యూరిటీలు, బాండ్లకు సంబంధించినవి. ఈ నేరారోపణల్లో అదానీలు, వారి అధికారుల పేర్లున్నాయి. ఐదవదైన చివరి నేరారోపణ చాలా ముఖ్యమైనది. ఈ నేరారోపణ న్యాయానికి ఆటంకం కలిగించారన్నది. ఇందులో అదానీల పేర్లు లేవు. వారి అధికారుల పేర్లు కూడా లేవు. అసలు ఎవరు ఎవరికి లంచం ఇచ్చారు..? ఎంత లంచం ఇచ్చారు..? ఎలా ఇచ్చారు... లాంటి వివరాల్లేవ్..!
ఓ చార్జిషీట్‌లో ఫలానా వ్యక్తులు ఫలానా పనులు చేశారు.. ఫలానా వ్యక్తులు ఫలానా వారికి లంచం ఇచ్చారు లాంటి వివరాలేవీ లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. అదానీలు సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిమిత్తం భారతదేశ వ్యక్తులకు, సంస్థలకు లంచం ఇవ్వజూపారన్నది ప్రధాన నేరారోపణ. అయితే ఆ నేరారోపణల్లో లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని ఉందే కానీ.. ఎవరికి లంచం ఇచ్చారు? ఎలా లంచం ఇచ్చారు? ఇందులో అదానీ గ్రూపు అధికారుల ప్రత్యక్ష ప్రమేయం ఉందా? ఎంత లంచం ఇచ్చారు? ఏ కాంట్రాక్ట్ కోసం లంచం ఇచ్చారు? అధికారులు ఏ గ్రూపునకు చెందిన వారు తదితర వివరాలేవీ కనీస స్థాయిలో కూడా ఆధారాలు లేవు.
ఇందుకు సంబంధించి ఒక్కరి పేరు కూడా ఆ నేరారోపణల్లో లేదు. ఇలాంటి నేరారోపణలపై ఎవరైనా ఎలా స్పందిస్తారు? ఆ నేరారోపణల్లో ఎక్కడా కూడా ఇండియాలో లంచాలు ఇచ్చినట్లు లేదు. లంచం ఇచ్చేందుకు కుట్ర పన్నారన్నదే ప్రధాన నేరారోపణ. కానీ ఇందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ఈ వ్యవహారంలో వారు (అదానీలు) అమెరికాలోని న్యాయవాదుల సలహాలు తీసుకుంటారని భావిస్తున్నా. లంచం ఇవ్వాలని చూశారన్న ఆరోపణ మినహా అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. అందువల్ల ఆ నేరారోపణలన్నీ కూడా ఊహాజనితమైనవే. మరోసారి చెబుతున్నా.. 1, 5వ నేరారోపణల్లో అదానీల పేర్లు లేవు.
Comments
Please login to add a commentAdd a comment