- సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేశ్ జఠ్మలానీ
- సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ భారత్‌లో అధికారులు, నేతలకు లంచాలిచ్చినట్టు డీఓజే అభియోగాల్లో ఎక్కడా స్పష్టంగా లేదు
- ఏ చట్టాలను ఉల్లంఘించారో ఒక్క అభియోగంలో కూడా లేదు
- కేవలం కుట్ర జరిగి ఉంటుందన్నారేగానీ ఎలాంటి ఆధారం చూపలేదు
- లోతుగా పరిశీలిస్తే ఇవన్నీ అమెరికా న్యాయశాఖ ఊహాగానాలే
సాక్షి, అమరావతి: ‘అదానీ గ్రూప్‌పై అమెరికా న్యాయ శాఖ (డీఓజే) చేసిన ఆరోపణలు, మోపిన అభియోగాలు కేవలం ఊహాగానాలు. పూర్తిగా నిరాధారం. పైగా వాటిని కూడా పూర్తిగా వక్రీకరించి మరీ భారత ప్రజల ముందు పెట్టారు. అదికూడా సరిగ్గా పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలయ్యే ముందే వాటిని బయట పెట్టడం వెనక భారీ దురుద్దేశాలు దాగున్నాయి. ఇది భారత్‌ను ఆర్థికంగా అస్థిరపరిచేందుకు, దేశ కార్పొరేట్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నమే’ అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేశ్ జఠ్మలానీ పేర్కొన్నారు.
సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ భారత్‌లో అధికారులకు, నేతలకు లంచాలిచ్చినట్టు డీఓజే తన అభియోగాల్లో ఎక్కడా స్పష్టంగా పేర్కొనలేదని జఠ్మలానీ గుర్తు చేశారు. తాను కేవలం ఒక జాతీయవాదిగా వ్యక్తిగత హోదాలో మాత్రమే దీనిపై స్పందిస్తున్నట్టు చెప్పారు. అంతేగానీ అదానీలకు గానీ, వారి గ్రూప్‌నకు గానీ మద్దతుగా మాట్లాడటం లేదని స్పష్టం చేశారు. అమెరికాలో జో బైడెన్ సారథ్యంలోని డెమొక్రటిక్ ప్రభుత్వానికి చెందిన అధికార లాబీలు ఏడాదిన్నరగా మోదీ సర్కారుకు పూర్తి వ్యతిరేకంగా పని చేస్తున్నాయన్నారు. ‘అదానీ’ వివాదంపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
విశ్వసనీయత లేదని స్వయంగా ట్రంప్ చెప్పారు..
“అది పూర్తిగా అమెరికాలో అదానీ గ్రీన్ కంపెనీ జారీ చేసిన బాండ్లకు సంబంధించిన అంశం. ఇన్వెస్టర్లకు సమాచారమే ఇవ్వకుండా బాండ్లు జారీ చేశారని, భారత్‌లో కాంట్రాక్టులు పొందేందుకు లంచాలు ఆశ చూపిన విషయాన్ని దాచి అమెరికాలో పెట్టుబడుల సేకరణకు ప్రయత్నం చేశారని అభియోగాలు మోపారు. కానీ అందుకు ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా చూపలేదు. పైగా ఈ ఉదంతానికి సంబంధించి భారత్‌లో ఏ చట్టాలను ఉల్లంఘించారో కనీసం ఒక్క అభియోగంలో కూడా పేర్కొనలేదు. కనీసం ఉల్లంఘించినట్టు కూడా చెప్పలేదు.
భారత్‌లో అధికారులకు గానీ, ప్రజాప్రతినిధులకు గానీ అదానీ గ్రూప్ లంచమిచ్చినట్టు ఎక్కడా నిర్దిష్టంగా చెప్పలేదు కూడా. ‘లంచాలిచ్చారు, లేదా ఇస్తామని వాగ్దానం చేశారు’ అంటూ చాలా పదాల కూర్పులో చాలా తెలివిగా వ్యవహరించారు. కేవలం కుట్ర జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారేగానీ దానికి ఎలాంటి సాక్ష్యాధారాలూ చూపలేదు. పైగా ఆ కుట్రను అమలు చేశారని కూడా ఎక్కడా చెప్పలేదు. లోతుగా చూస్తే ఇవన్నీ కేవలం అమెరికా న్యాయ శాఖ ఊహాగానాలేనని అడుగడుగునా స్పష్టమవుతూనే ఉంది’ అని జఠ్మలానీ స్పష్టం చేశారు. అమెరికాలో న్యాయ శాఖ అనేదే ఒక పెద్ద జోక్ అని, దానికి విశ్వసనీయతే లేదని ఆ దేశానికి కాబోయే అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంపే బాహాటంగా చెప్పారని గుర్తు చేశారు.
అదానీ ఎపిసోడ్ మొత్తాన్నీ భారత్‌పై బైడెన్ సర్కారు పన్నాగంలో భాగంగా జఠ్మలానీ అభివర్ణించారు. ‘అదానీలపై ఆరోపణలు తెరపైకి వచ్చినప్పుడల్లా ఆ గ్రూపు ఆర్థికంగా భారీగా నష్టపోతూ వస్తోంది. ఈసారి ఏకంగా 2.4 బిలియన్ డాలర్లు నష్టపోయింది. హిండెన్‌బర్గ్ నివేదికైనా, డీఓజే అభియోగాలైనా పార్లమెంటు సమావేశాలకు సరిగ్గా రెండు రోజుల ముందు బయటికొచ్చాయి. ఇందులోకి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఏ సాక్ష్యం లేకుండా కేవలం ఓ అభియోగ పత్రంపై ఆధారపడి నిరాధార ఆరోపణలు చేయడం కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీకి తగని పని’ అని జఠ్మలానీ పేర్కొన్నారు. విశ్వసనీయమైన సాక్ష్యాలంటూ ఉంటే కాంగ్రెస్ ముందుగా వాటిని ప్రజల ముందు పెట్టాలని జఠ్మలానీ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment