kulbhushan jadhav case
-
ఐసీజే తీర్పుకు తలొగ్గిన పాకిస్థాన్..!
ఇస్లామాబాద్ : కులభూషణ్ జాదవ్‌కు గూఢచర్యం ఆభియోగంపై పాకిస్థాన్ ప్రభుత్వం విధించిన ఉరిశిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఇటీవల తీర్పునిచ్చిన నేపథ్యంలో పాక్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ మిలటరీ కోర్టు విధించిన ఉరిశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) నిలిపివేయాలన్న తీర్పుకు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాక్ సర్కార్ తలొగ్గింది. ఐసీజే తీర్పును అమలుచేయడానికి పాక్ సైనిక చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. ఈ సవరణ ఆధారంగా కుల్ భూషణ్ జాదవ్ తనకు విధించిన శిక్షపై సివిల్ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ఆర్మీ చట్టంలో ఈ విధంగా సవరణలు చేపడుతున్నట్లు పాక్ మీడియా వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణలపై 2016 మార్చి 3న పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో పాక్ బలగాలు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ న్యాయస్థానం 2017 ఏప్రిల్‌లో కులభూషణ్‌కు మరణశిక్ష విధించింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇరాన్లో వ్యాపార కార్యకలాపాలు చేసుకుంటుండగా పాక్ అక్రమంగా నిర్భందించి, న్యాయస్థానానికి కూడా అనుమతివ్వలేదని భారత్ పిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఐసీజే కుల్‌భూషణ్ మరణశిక్షను నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది. భారత్‌కు న్యాయవాదిని నియమించుకునే హక్కు ఉందని, మరణశిక్షను పాక్ సమీక్షించేంతవరకు శిక్ష అమలును నిలిపివేస్తున్నట్లు నాయస్థానం ప్రకటించింది. -
‘చిన్నమ్మ’ చివరి కోరిక తీర్చిన కుమార్తె
న్యూఢిల్లీ: దివంగత కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ చివరి కోరికను నెరవేర్చారు ఆమె కుమార్తె బన్సూరి. ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వేకు, సుష్మ ఇవ్వాల్సిన రూ.1 ఫీజును శుక్రవారం చెల్లించారు బన్సూరి. ఈ సందర్భంగా ‘కుల్‌భూషణ్ జాదవ్ కేసులో వాదించి, గెలిచినందుకు గాను హరీశ్ సాల్వేకు ఇవ్వాల్సిన ఫీజు రూ.1ని ఈ రోజు చెల్లించి నీ చివరి కోరిక నెరవేర్చాను అమ్మ’ అంటూ బన్సూరి ట్విట్ చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్‌భూషణ్ జాదవ్ తరఫున హరీశ్ వాదించి గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చనిపోవడానికి కేవలం గంట ముందు సుష్మా స్వరాజ్ హరీశ్‌తో మాట్లాడారు. ‘మీరు కేసు గెలిచారు.. మీకివ్వాల్సిన ఫీజు రూ.1 తీసుకెళ్లండి’ అని చెప్పారు అంటూ హరీశ్ గుర్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న బన్సూరి స్వరాజ్, హరీశ్ సాల్వేకు ఆయన ఫీజు చెల్లించారు. గూఢచర్యం ఆరోపణలతో పాకిస్తాన్ జైల్లో ఉన్న మాజీ నౌకాదళ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు పాక్ న్యాయస్థానం విధించిన మరణశిక్షను నిలుపదల చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చేలా చేయడంలో హరీశ్ సాల్వే వాదనలు కీలకంగా నిలిచిన సంగతి తెలిసిందే. (చదవండి: వయసుకి చిన్నమ్మ.. మనసుకి పెద్దమ్మ) -
‘ఒక్క రూపాయి ఫీజు కోసం ఇంటికి రమ్మన్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ (67) మృతిపై ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె చనిపోవడానికి గంట ముందే ఆమె తనతో మాట్లాడారని గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. హరీష్ సాల్వే అంతర్జాతీయ న్యాయస్థానంలో కులభూషన్ జాదవ్ తరపున ప్రభావవంతంగా వాదించి భారత్‌కు విజయం అందించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణకు ఆయన కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకున్నారు. (చదవండి : సుష్మా హఠాన్మరణం) కులభూషన్ జాదవ్ కేసు గెలవడంతో తనకు ఇవ్వాల్సిన రూ.1 ఫీజు తీసుకోవడానికి రేపు ఇంటికి రావాల్సిందిగా సుష్మా తనను ఆహ్వానించారని, ఇంతలోనే ఆమె అనంతలోకాలకు వెళ్లిపోయారని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.‘ సుష్మా స్వరాజ్‌తో నేను నిన్న రాత్రి 8.50గంటల సమయంలో మాట్లాడాను. మా ఇద్దరి మధ్య సంభాషణ చాలా ఉద్వేగంగా సాగింది. ‘మీరు కేసు గెలిచారు కదా.. దానికి నేను మీకు ఒక్క రూపాయి ఫీజు ఇవ్వాలి వచ్చి కలవండి’ అని అన్నారు. దానికి నేను, ‘అవును మేడమ్ ఆ విలువైన రూపాయిని నేను తీసుకోవాల్సిందే’ అని బదులిచ్చాను. దీంతో ఆమె ‘మరి రేపు 6గంటలకు రండి’ అన్నారు’’ అని సుష్మాతో సాగిన సంభాషణను హరీష్ సాల్వే గుర్తుచేసుకొని ఉద్వేగానికి లోనయ్యారు. గూఢచర్యం ఆరోపణలతో పాకిస్తాన్ జైల్లో ఉన్నభారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(49)కు పాక్ న్యాయస్థానం విధించిన మరణశిక్షణను నిలుపుదల చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో హరీశ్ వాదనలే కీలకం. సాధారణంగా అయితే కేసులు వాదించేందుకు హరీశ్ సాల్వే ఒక్కో రోజుకి రూ. 30 లక్షలను ఫీజుగా తీసుకుంటారని సమాచారం. కానీ ఈ కేసు వాదించడానికి కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నారు. పాక్ తరఫున బ్రిటన్‌కు చెందిన లాయర్ ఖురేషీ వాదనలు వినిపించారు. జాధవ్ కేసును వాదించేందుకు ఫీజుగా ఆయనకు రూ. 20 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇటీవల జాదవ్ ఉరిపై అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల సుష్మాస్వరాజ్ హర్షం వ్యక్తం చేశారు. భారత్‌కు దక్కిన విజయంగా అభివర్ణించారు. దీనిపై హరీష్ సాల్వేను ఆమె ప్రశంసించారు. (చదవండి : ఉరి.. సరి కాదు) -
పాక్‌కు ఎదురుదెబ్బ
నావికా దళంలో పనిచేసి రిటైరై వ్యాపారం చేసుకుంటున్న కుల్‌భూషణ్ జాధవ్‌పై భారత గూఢ చారిగా కేసు బనాయించి మూడేళ్లుగా నిర్బంధించడమే కాదు... ఆయన నేరాలు రుజువయ్యా యంటూ ‘నిర్ధారించి’ మరణశిక్ష కూడా విధించిన పాకిస్తాన్ చర్యను అందరూ ఊహించినట్టే ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం తప్పుబట్టింది. ఆయన్ను కలవడానికి భారత దౌత్య అధికా రులను అనుమతించాల్సిందేనని తేల్చిచెప్పడంతోపాటు కుల్‌భూషణ్ మరణశిక్షను పునస్సమీక్షించ మని సూచించింది. 16మంది న్యాయమూర్తుల్లో చైనాకు చెందిన న్యాయమూర్తితోసహా 15మంది పాకిస్తాన్ చర్యను తప్పుబట్టడం అసాధారణం. నైతికంగా పాక్‌కు ఇది కోలుకోలేని దెబ్బ. ఈ తీర్పును గుర్తించి, గౌరవిస్తే అది పాకిస్తాన్‌కే మంచిది. కుల్‌భూషణ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేవని 2016లో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ తనంత తానే బయటపెట్టారు. కానీ ఆ తర్వాత ఆ ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. పైగా కుల్ భూషణ్ ఉదంతాన్ని వెల్లడించడానికి పాకిస్తాన్ ఎంచుకున్న సమయం కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఉన్న వైమానిక దళ స్థావరంపై జరిగిన ఉగ్రదాడిపై ఇరు దేశాల ఉమ్మడి దర్యాప్తు ప్రారంభం కాబోతున్న సమయంలో కావాలని ఈ గూఢచర్యం ఉదంతాన్ని పాకిస్తాన్ తెర మీదికి తీసుకొచ్చింది. పరస్పరం శత్రుత్వం ఉన్న రెండు దేశాల్లోని పౌరులు అవతలి దేశం వెళ్లడానికి ప్రయత్నిం చినప్పుడు సహజంగానే వారిపై నిఘా ఉంటుంది. వారేం చేస్తున్నారో, వారి కార్యకలాపాల స్వభావం ఎటువంటిదోనన్న ఆరా ఉంటుంది. ఆ దేశంలో ప్రవేశించడానికి తగిన అనుమతులున్నా ఇవి తప్పవు. ఇలాంటివి ఏమీ లేకుండా పట్టుబడితే ఇక చెప్పనవసరం లేదు. ఆచూకీ కూడా దొరక్కుండా ఖైదు చేయడం లేదా ప్రాణం తీయడం చాలా సులభం. పాకిస్తాన్ జైళ్లలో గూఢచారుల ముద్ర పడి పలువురు భారతీయులు మగ్గుతున్నారని, అలాగే 1971 యుద్ధకాలంలో పట్టుబడిన పలువురు జవాన్లు అక్కడి జైళ్లలో ఉన్నారని మన దేశం ఆరోపించడం, దాన్ని పాకిస్తాన్ తోసి పుచ్చడం రివాజుగా సాగుతోంది. పైగా కుల్‌భూషణ్ ఉదంతంలో అనేక అనుమానాలున్నాయి. ఆయన్ను బలూచిస్తాన్‌లో గూఢచర్యానికి పాల్పడుతుండగా అరెస్టు చేశామని పాకిస్తాన్ చెబు తోంది. కానీ వ్యాపార పనుల నిమిత్తం ఇరాన్లో ఉండగా అక్కడి పాక్ ఏజెంట్లు కుల్‌భూషణ్‌ను అపహరించుకుపోయారన్నది మన దేశం ఆరోపణ. ఆయన కుటుంబసభ్యులు చెబుతున్న అంశా లను బట్టి చూసినా ఆయనను ముందే అపహరించిన సంగతి వెల్లడవుతుంది. అంతకు మూణ్ణెల్ల ముందే కుల్‌భూషణ్‌తో తమకు సంబంధాలు తెగిపోయాయని, ఆయన ఉన్నట్టుండి ఫోన్‌కు అందు బాటులో లేకుండా పోయారని కుటుంబసభ్యులు చెప్పారు. కుల్‌భూషణ్ ఉదంతంలో పాకిస్తాన్ చెబుతున్నది విశ్వసించడానికి మొదటినుంచీ దాని చేతలే అడ్డొస్తున్నాయి. ఈ విషయంలో ఆ దేశం ప్రవర్తన పూర్తి అనుమానాస్పదంగా ఉంది. ఎవరి కార్యకలాపాలపైన అయినా సందేహాలున్నప్పుడు అదుపులోనికి తీసుకోవడం, ప్రశ్నించడం సర్వ సాధారణం. కానీ వేరే జాతీయుణ్ణి అరెస్టు చేసినప్పుడు పాటించాల్సిన కనీస నిబంధనలు వియన్నా ఒడంబడికలో స్పష్టంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆ ఒడంబడికలోని 36(1)(సి) అధికరణ ప్రకారం వేరే దేశం నిర్బంధంలో ఉన్నవారిని కలిసి మాట్లాడటం, వారితో ఉత్తరప్రత్యుత్తరాలు జరపడం దౌత్య అధికారుల హక్కని స్పష్టంగా చెబుతోంది. వాటిని సక్రమంగా పాటించి ఉంటే పాకిస్తాన్ వాదనకు ఎంతో కొంత బలం ఉండేది. బలూచిస్తాన్‌లో భారత్ గూఢచర్యానికి పాల్పడుతున్నదని, అక్కడ విధ్వంసకర కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నదని ఎప్పటినుంచో ఆరోపిస్తున్న పాకిస్తాన్‌కు ఈ కేసు ఎంతో అక్కరకొచ్చేది. కానీ కుల్‌భూషణ్ ఉదంతంలో ఎన్ని కంతలున్నాయో దానికే బాగా తెలుసు. అందుకే అపహరించుకుపోయిన మూడునెలలకుగానీ ఆ సంగతిని బయటపెట్టలేదు. ఆ తర్వాతనైనా ఆయన్ను కలవడానికి భారత దౌత్య అధికారులను అనుమతించలేదు. పైగా తనపై వచ్చిన ఆరోపణలన్నిటినీ ఆయనే అంగీకరించాడంటూ ఒక వీడియో విడుదల చేసింది. నిర్బం ధంలో ఉంచి, ఎవరినీ కలవనీయకుండా కట్టడి చేసి, బెదిరించి భయపెట్టి తీసుకున్న ఈ ఒప్పుదల ప్రకటనకు గడ్డిపోచ విలువైనా ఉంటుందా? ఈ వీడియోలో ‘అనేకమంది మరణానికి దారితీసిన ఉగ్రవాద కార్యకలాపాలతో భారత్‌కు సంబంధం ఉన్నద’ని కుల్‌భూషణ్‌తో చెప్పించారు. కానీ నిర్దిష్టంగా ఒక్కటంటే ఒక్క ఉదంతం ప్రస్తావనైనా అందులో లేదు. పైగా సైనిక కోర్టు ఆయనపై రహస్య విచారణ నిర్వహించి మరణశిక్ష విధించిన తీరు కూడా హాస్యాస్పదం. న్యాయవాదిని నియమించుకోవడానికి, తనకు జరిగిందేమిటో వివరించి న్యాయం కోరడానికి ఆయనకు అవకాశ మీయకుండా నిర్వహించిన విచారణకు విశ్వసనీయత ఏముంటుంది? అసలు గూఢచారిగా పొరుగు దేశంలో కార్యకలాపాలు నడపడానికి వెళ్లే వ్యక్తి తన దేశానికి సంబంధించిన పాస్‌పోర్టును దగ్గర ఉంచుకుంటాడా? సాధారణంగా ఎవరినైనా వేరే దేశంలో గూఢచర్యం చేయడానికి పంపినప్పుడు గూఢచార సంస్థలు ఆ దేశం తాలూకు పాస్‌పోర్టును సమకూరుస్తాయి. లేదా మరో దేశం పాస్ పోర్టును సంపాదించి ఇస్తాయి. తాజా తీర్పు వల్ల కుల్‌భూషణ్‌కు విముక్తి లభిస్తుందని భావించడం కష్టమే. ఈ తీర్పు ఆసరాతో అంతర్జాతీయంగా పాకిస్తాన్‌పై మన దేశం మరింత ఒత్తిడి పెంచాలి. ఇలాంటి కేసులో సత్ఫలితాలు రావాలంటే రాజకీయ పరిష్కారమే మార్గం. ఇరు దేశాలమధ్యా జరిగే చర్చలే అందుకు దోహదప డతాయి. భారత్‌లో ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తూ ఇలా తప్పుడు ఆరోపణలతో ఎదురుదాడి చేయడం వల్ల వీసమెత్తు ప్రయోజనం ఉండదని పాకిస్తాన్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. కుల్‌భూషణ్ ఉదంతం వల్ల అంతిమంగా తన ప్రతిష్టే దెబ్బతిన్నదని అది తెలుసుకోవాలి. -
పాక్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఐసీజే
ద హేగ్: భారత నావికా దళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్ కేసు విచారణను తాత్కాలికంగా వాయిదా వేయాలన్న పాకిస్తాన్ వాదనను ద హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించి పాకిస్తాన్ తరఫున తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులైన తస్సాదుక్ హుస్సేన్ జిలానీని పాక్ నియమించుకోగా ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో తాము మరో తాత్కాలిక జడ్జిని నియమించుకుంటామనీ, ఆయన ఈ కేసు గురించి అధ్యయనం చేసేందుకు కొంత సమయం ఇవ్వాలంటూ పాకిస్తాన్ అభ్యర్థించగా ఐసీజే తిరస్కరించి కేసు విచారణను కొనసాగించింది. పాక్ తన వాదన వినిపిస్తూ ఈ కేసుతో భారత్ ఐసీజేనే ‘రాజకీయ థియేటర్’గా మార్చేసిందనీ, కేసును కొట్టేయాలని కోరింది. జాధవ్ గూఢచారేననీ, పాకిస్తాన్లో ఉగ్రవాద దాడులు చేయడానికే తమ దేశానికి వచ్చాడని ఆరోపించింది. నాలుగు రోజులపాటు సాగే జాధవ్ కేసు విచారణ సోమవారం నుంచి ప్రారంభం కావడం తెలిసిందే. -
పాకిస్తాన్‌కు భారీ షాక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత మాజీ నావికాదళ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌ను తమ దేశంలోనే అరెస్ట్ చేశామని చెబుతున్న పాకిస్తాన్ మాటలు అబద్దమని తేలిపోయింది. జాధవ్‌ను ఇరాన్లో పట్టుకున్నామని పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ మాజీ అధికారి, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అంజాద్ షోయబ్ వెల్లడించారు. జాధవ్‌ను తమ దేశంలో అరెస్ట్ చేయలేదని ఆయన తెలిపారు. అతడిని బలూచిస్తాన్‌లో అరెస్ట్ చేసినట్టు పాకిస్తాన్ చెబుతూ వస్తోంది. ఇరాన్ నుంచి తమ దేశంలోకి చొరబడుతుండగా గతేడాది మార్చి 3న అరెస్ట్ చేసినట్టు పేర్కొంది. ఐఎస్ఐ మాజీ అధికారి ప్రకటనతో దాయాది దేశానికి దిమ్మతిరిగినట్టైంది. నావికాదళం నుంచి పదవీ విరమణ చేసిన ఇరాన్లో వ్యాపారం చేసుకుంటున్న జాధవ్‌ను కిడ్నాప్ చేసి అతడిపై పాక్ గూఢచర్యం ఆరోపణలు మోపిందని భారత్ పేర్కొంది. మరోవైపు జాధవ్ కేసుపై త్వరగా విచారణ చేపట్టాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని(ఐసీజే) పాకిస్తాన్ అభ్యర్థించింది. జాధవ్‌కు పాక్ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. తుది తీర్పు వచ్చేంతవరకు శిక్ష అమలు చేయవద్దని పాకిస్తాన్‌కు ఐసీజే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో త్వరగా విచారణ చేపట్టాలని పాక్ కోరుతోంది. -
తుది తీర్పు కూడా మనకే అనుకూలం
-
తుది తీర్పు కూడా మనకే అనుకూలం: రోహత్గీ
కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. తుది తీర్పు కూడా మనకు అనుకూలంగా ఉంటుందన్న ఆశాభావాన్ని భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వ్యక్తం చేశారు. జాదవ్ తిరిగి స్వదేశానికి రావడాన్ని మనమంతా చూస్తామని ఆయన అన్నారు. ఈ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశం ముందు నుంచి ఈ కేసు విషయంలో తన వాదన గట్టిగా వినిపించిందని, ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ.. ముఖ్యంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖను అభినందిస్తున్నానని ఆయన అన్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం నిర్ణయంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అయ్యిందని, ఈ నిర్ణయానికి ఇరు దేశాలూ తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సిందేనని రోహత్గి తెలిపారు. అంతర్జాతీయ కోర్టు నిర్ణయంతో దేశవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. పలు నగరాల్లో టపాసులు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తుది తీర్పు వెల్లడించేవరకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి చర్య తీసుకోకూడదని అంతర్జాతీయ న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాక, ఈ కేసులో అక్కడ జరుగుతున్న విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు తమకు తెలియజేస్తూ ఉండాలని కూడా తెలిపింది. భారత రాయబార కార్యాలయం నుంచి తప్పనిసరిగా అధికారులు జాదవ్‌ను కలిసే అవకాశం కల్పించాలని స్పష్టం చేయడం కూడా భారతదేశానికి దౌత్య పరంగా మంచి విజయమని పలువురు న్యాయనిపుణులు అంటున్నారు. -
నేడు కుల్‌భూషణ్ కేసుపై తీర్పు
-
భారత్, పాక్ అధికారుల మధ్య ఆసక్తికర సీన్
హేగ్: అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ కేసుకు సంబంధించి దాదాపు 18 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ న్యాయస్థానం మెట్లెక్కిన భారత్, పాకిస్థాన్ అధికారుల మధ్య ఆకర్షనీయమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఐసీజేలో పాక్ తరుపున ఉన్న అధికారి ఒకరు అదే ఐసీజేలో ఉన్న భారత్ తరుపు అధికారికి ఎదురైన సందర్భంలో ఆ వ్యక్తి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ, భారత్ తరుపు అధికారి మాత్రం వినమ్రంగా నమస్కారం అని చెప్పి పక్కకు తప్పుకున్నారు. జాదవ్ కేసు వాదనలు ప్రారంభం కావడానికి ముందు జాదవ్ కేసు తరుపున ప్రస్తుతం భారత ప్రతినిధిగా ఉన్న దీపక్ మిట్టల్ ఐసీజేకు వెళ్లారు. అదే సమయంలో పాకిస్థాన్ తరుపున ప్రతినిధిగా ఉన్న మహ్మద్ ఫైజల్ అదే ఐసీజే ప్రాంగణంలోకి వచ్చారు. ఈ సమయంలో ఇరువురు ఎదురవడంతో ఫైజల్ చేతులు కలిపే ప్రయత్నం చేయగా వెంటనే దీపక్ మిట్టల్ నమస్తే చెప్పి పక్కకు జరిగారు. ఆ వెంటనే, పాకిస్థాన్‌కు చెందిన ఇతర అధికారులకు, పాక్ తరుపున వాదిస్తున్న న్యాయవాదికి మాత్రం మిట్టల్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఉద్దేశ పూర్వకంగా కక్ష పూరితంగా ఈ కేసును ఫైజల్ దగ్గరుండి ముందుకు నడిపిస్తున్న నేపథ్యంలోనే దీపక్ ఇలా చేసినట్లు తెలుస్తోంది. -
కులభూషణ్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలి
-
‘పాక్ ఇంకా తన సమాధానం చెప్పలేదు’
న్యూఢిల్లీ: కులభూషణ్ జాదవ్ కేసు విషయంలో ఇంకా పాకిస్థాన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని భారత్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే అన్నారు. జాదవ్‌కు ఉరిశిక్షకు సంబంధించిన చార్జీషీట్ కాపీని తాము అడిగామని, అయితే, ఈ విషయంలో పాక్ విదేశాంగ శాఖ ఎలాంటి ప్రకటన చేయలేదని వెల్లడించారు. జాదవ్ ఉరి శిక్ష విషయంలో పైకోర్టుకు వెళతామని భారత్ ఇప్పటికే ప్రకంటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి భారత్ హైకమిషనర్ గౌతమ్ బాంబవాలే పాక్ విదేశాంగ కార్యదర్శి తెమినా జాంజువాను శుక్రవారం కలిసి చార్జిషీట్ కాపీని అడిగారు. రెండు కాపీలను తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటి వరకు పాక్ స్పందించలేదు. తమ దేశంలో గూఢచర్యం నిర్వహించాడని పాక్ భారత్‌కు చెందిన మాజీ నేవీ అధికారి జాదవ్‌కు ఉరి శిక్ష విధించిన విషయం తెలిసిందే. -
14వ సారీ.. భారత్ విన్నపాన్ని తిరస్కరించిన పాక్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మరణశిక్ష విధించిన భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను కాపాడేందుకు భారత్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పాక్ మిలటరీ కోర్టు కుల్‌భూషణ్‌కు విధించిన మరణశిక్ష తీర్పు కాపీని, ఆయనపై దాఖలు చేసిన ఛార్జిషీటు కాపీలను ఇవ్వాల్సిందిగా భారత్ కోరింది. శుక్రవారం పాక్‌లో భారత హైకమీషనర్ గౌతమ్ బాంబేవాలే.. పాక్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి తహ్మీనా జంజ్వాను కలసి ఈ మేరకు విన్నవించారు. జాదవ్‌ను వ్యక్తిగతంగా కలిసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా గౌతమ్ కోరగా.. గూఢచర్యం కేసులో అనుమతి ఇవ్వడం కుదరదని తహ్మీనా నిరాకరించారు. గతంలో జాదవ్‌ను కలవాలని 13 సార్లు భారత దౌత్య వేత్తలు కోరగా, పాక్ తిరస్కరించింది. పాకిస్థాన్ ఆర్మీ చట్టాలను పరిశీలించి, జాదవ్‌కు విధించిన మరణశిక్ష తీర్పుపై అప్పీలు చేయాలని భారత్ భావిస్తోంది. తీర్పు కాపీ చూస్తే ఏ కారణంతో జాదవ్‌కు మరణ శిక్ష విధించారన్నది తెలుస్తుందని ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ ఇటీవల సూచించారు. వారు ఇచ్చిన తీర్పు సరైనదా కాదా అన్నది మనం తెలుసుకోవాలని, వారు మోపిన నేరం సరైనదా కాదా అన్నదీ తెలుసుకోవాలని, అప్పుడు దానికి ఏ శిక్ష పడుతుందన్న ప్రశ్న తలెత్తుతుందని చెప్పారు. జాద్వ్ పాక్‌లో ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలియదని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. గూఢచర్యం కేసులో కుల్‌భూషణ్‌కు తమ ఆర్మీ కోర్టు విధించిన మరణశిక్షపై ఒత్తిళ్లకు తలొగ్గ కూడదని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా నిర్ణయించినట్లు పాక్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.