
ఇస్లామాబాద్: ఇరాన్‌లో భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కిడ్నాప్‌లో పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐకు సహకరించాడనే ఆరోపణలు ఉన్న పాక్ మతపెద్ద ముఫ్తీ షా మిర్ హత్యకు గురయ్యారు. బలూచిస్థాన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపాడు. బలూచి ప్రాంతంలో మతపెద్ద అయిన ముఫ్తీ గతంలో రెండుసార్లు హత్యాయత్నం నుంచి తప్పించుకున్నారు.
తుర్బాట్‌లోని స్థానిక మసీదులో ముఫ్తీ మిర్ రాత్రి ప్రార్థనలు ముగించుకుని వెళ్తుండగా.. బైక్‌పై వచ్చిన ముష్కరులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ముఫ్తీ షా మిర్‌పై అనేకసార్లు కాల్పులు జరిపారని, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆయన.. శుక్రవారం మరణించినట్లు పేర్కొన్నారు.
మత సంస్థ జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం (జేయూఐ)లో సభ్యుడైన ముఫ్తీ షా మీర్.. అక్కడి ప్రముఖ వ్యక్తుల్లో ఒకడిగా చలామణి అయ్యేవాడని.. ఆయుధాలు, మానవ అక్రమ రవాణా వంటి కార్యకలాపాలకు పాల్పడేవాడని జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. పాకిస్థాన్‌లోని పలు ఉగ్రవాద సంస్థలతో అతడిని సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడడానికి సాయం చేసే వాడని తెలిపాయి.
కుల్‌భూషణ్ జాదవ్ కేసు.. అసలేం జరిగిందంటే..
నావికాదళంలో బాధ్యతలు నిర్వర్తించి.. పదవీ విరమణ చేసిన కుల్‌భూషణ్ జాదవ్ ఇరాన్‌లోని చాబహార్ ప్రాంతంలో బిజినెస్ చేసేవారు. 2016లో ఆయన్ను ఇరాన్‌లో పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్లు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత బలూచిస్థాన్‌లోకి ఆయన ప్రవేశిస్తే అరెస్ట్ చేసినట్లు చూపారు. 2017 గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ మిలిటరీ కోర్టు ఆయనకు మరణశిక్ష కూడా విధించింది. ఈ అంశంపై భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఆ మరణశిక్షను సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. నాటి నుంచి ఈ విచారణ కొనసాగుతూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment