
ఖనిజ సంపద అధికంగా ఉన్న బలూచిస్తాన్(Balochistan) రాష్ట్రం పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోరుతూ దశాబ్దాలుగా సాయుధ పోరాటం చేస్తోంది. ఇది పాక్‌కు భద్రతా ముప్పుగా పరిణమించింది. ఈ క్రమంలోనే ఇరాన్- ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో రైలు హైజాక్ చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ). ఇంతకీ బలూచిస్తాన్ ఎందుకు పాక్ నుంచి విడిపోవాలనుకుంటోంది? దీని వెనుక ఏముంది?
పాకిస్తాన్(Pakistan) స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి చెలరేగుతున్న బలూచ్ ఉద్యమంలో తాజాగా చోటుచేసుకున్న రైలు హైజాక్ అతి పెద్ద ఘటనగా చెప్పుకోవచ్చు. బలూచ్ తిరుగుబాటుకు మూలం పాకిస్తాన్ జాతిపి ముహమ్మద్ అలీ జిన్నా చేసిన ద్రోహం అని చెబుతుంటారు. నాడు పాక్‌తో విలీనం కావడానికి బలూచిస్తాన్ ఏమాత్రం ఇష్టపడలేదు. పాకిస్తాన్‌లో విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రమైన బలూచిస్తాన్ ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటూ వచ్చింది. నాడు రష్యా నుండి తన వలస ప్రయోజనాలను రక్షించుకునేందుకు బ్రిటిష్ పాలకులు ఈ ప్రాంతాన్ని ఒక స్థావరంగా ఉపయోగించుకున్నారు. అయితే భారతదేశ విభజన తర్వాత పలు పరిణామాల నేపధ్యంలో పాకిస్తాన్‌లో బలూచ్ విలీనమయ్యింది. ఇది స్థానికులకు నచ్చలేదు. దీంతో స్వతంత్ర బలూచిస్తాన్ కోసం ఉద్యమం ప్రారంభమయ్యింది.
చదవండి: బెలూచిస్థాన్ ఎందుకు భగ్గుమంటోంది?
బలూచిస్తాన్ అధికంగా బీడువారినట్లు కనిపించినప్పటికీ, ఖనిజాలు, వనరులతో సమృద్ధిగా ఉంది. చాఘి జిల్లాలోని రెకో దిక్, సైందక్ ప్రాంతాల్లో అపారంగా బంగారం, రాగి నిక్షేపాలు ఉన్నాయి. అలాగే బలూచిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో సీసం, జింక్, బొగ్గు నిక్షేపాలు కూడా ఉన్నాయి. బెలూచ్‌కు సొంతమైన ఈ వనరులను పాక్ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని బలూచ్ ఎప్పటి నుంచో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుగుబాటు సంస్థలైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ),బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (బీఎల్‌ఎప్)లు బలూచ్ స్వాంతంత్య్రం కోసం ఉద్యమిస్తున్నాయి.
ఈ సంస్థలు పాకిస్తాన్ భద్రతా దళాలు(Pakistan security forces), సంస్థలు, మౌలిక సదుపాయాలపై దాడులకు తెగబడ్డాయి. గత కొన్నేళ్లుగా మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలతో బలూచ్ ఉద్యమం మరింత తీవ్రమైంది. తమ ఉద్యమాన్ని అణచివేసేందుకు తమ దళాలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు, పౌరులను పాక్ సైన్యం అదృశ్యం చేసిందని తిరుగుబాటు సంస్థలు ఆరోపిస్తున్నాయి.
విభజన సమయంలో బలూచిస్తాన్‌ను భారతదేశం, పాకిస్తాన్‌లతో పాటు స్వతంత్ర దేశంగా ప్రకటించారు. నాడు ఈ ప్రాంతంలో నాలుగు రాచరిక రాష్ట్రాలు ఉండేవి. అవి ఖరన్, మకరన్, లాస్ బేలా, కలాత్. విభజనకు ముందు ఈ రాచరిక రాష్ట్రాలకు మూడు ఎంపికలు ఇచ్చారు. అవి భారతదేశం లేదా పాకిస్తాన్‌లో చేరడం లేదా స్వతంత్రంగా ఉండటం. ఈ నేపధ్యంలో మూడు ప్రాంతాలు పాకిస్తాన్‌లో విలీనమ్యాయి. దీంతో కలాత్‌కు 1947, ఆగస్టు 15న స్వాతంత్ర్యం ప్రకటించారు. అయితే విస్తరణవాద పాలన భయంతో కలాత్ స్వతంత్రంగా ఉండటానికి బ్రిటిష్ ఒప్పుకోలేదు. కలాత్‌ను స్వాధీనం చేసుకోవాలంటూ పాక్‌పై ఒత్తిడి తెచ్చారు. 1947 అక్టోబరులో పాక్ వ్యవస్థాపకుడు జిన్నా.. కలాత్ విలీనాన్ని వేగవంతం చేయాలని సలహా ఇచ్చాడు. అయితే కలాత్ పాలకుడు దీనిని నిరాకరించాడు.
నాటి నుండి పాకిస్తాన్ అధికారులు కలాత్ పాలకుడు ఖాన్‌ను పాకిస్తాన్‌లో చేరాలంటూ మరింతగా ఒత్తిడి తీసుకువచ్చారు. 1954లో పాకిస్తాన్ తన ప్రావిన్సులను పునర్వ్యవస్థీకరిస్తూ వన్-యూనిట్ ప్రణాళికను ప్రారంభించినప్పుడు బలూచ్‌లో తిరుగుబాటు వచ్చింది. ఖాన్ ఆఫ్ కలాత్ నవాబ్ నౌరోజ్ ఖాన్ 1959లో పాక్‌కు లొంగిపోయాడు. ఏడాది తరువాత పశ్చిమ పాకిస్తాన్‌లో వన్ యూనిట్ ప్లాన్ రద్దు చేశారు. దీంతో బలూచిస్తాన్‌ను పంజాబ్, సింధ్, ఫ్రాంటియర్‌తో పాటు మరో రాష్ట్రంగా ప్రకటించారు.
1970లలో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందిన దరిమిలా బలూచ్‌లలో ధైర్యం పెరిగింది. స్వయంప్రతిపత్తి కోసం డిమాండ్లను లేవనెత్తారు. అయితే నాటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో దీనిని నిరాకరించారు. ఇది భారీ నిరసనలకు దారితీసింది. ఇది నాటి నుంచి ఏదో ఒక రూపేణా ఉద్యమం కొనసాగుతూనే వస్తోంది. గత కొన్నేళ్లుగా పాక్ భద్రతా సిబ్బంది, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని బలూచ్ దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పట్లో బలూచ్ డిమాండ్లకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించే సూచనలు కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: మహాకుంభ్‌తో నిండిన రైల్వే ఖజానా.. ఎంత ఆదాయమంటే..
Comments
Please login to add a commentAdd a comment