
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ (67) మృతిపై ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె చనిపోవడానికి గంట ముందే ఆమె తనతో మాట్లాడారని గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. హరీష్ సాల్వే అంతర్జాతీయ న్యాయస్థానంలో కులభూషన్ జాదవ్ తరపున ప్రభావవంతంగా వాదించి భారత్‌కు విజయం అందించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణకు ఆయన కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకున్నారు.
(చదవండి : సుష్మా హఠాన్మరణం)
కులభూషన్ జాదవ్ కేసు గెలవడంతో తనకు ఇవ్వాల్సిన రూ.1 ఫీజు తీసుకోవడానికి రేపు ఇంటికి రావాల్సిందిగా సుష్మా తనను ఆహ్వానించారని, ఇంతలోనే ఆమె అనంతలోకాలకు వెళ్లిపోయారని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.‘ సుష్మా స్వరాజ్‌తో నేను నిన్న రాత్రి 8.50గంటల సమయంలో మాట్లాడాను. మా ఇద్దరి మధ్య సంభాషణ చాలా ఉద్వేగంగా సాగింది. ‘మీరు కేసు గెలిచారు కదా.. దానికి నేను మీకు ఒక్క రూపాయి ఫీజు ఇవ్వాలి వచ్చి కలవండి’ అని అన్నారు. దానికి నేను, ‘అవును మేడమ్ ఆ విలువైన రూపాయిని నేను తీసుకోవాల్సిందే’ అని బదులిచ్చాను. దీంతో ఆమె ‘మరి రేపు 6గంటలకు రండి’ అన్నారు’’ అని సుష్మాతో సాగిన సంభాషణను హరీష్ సాల్వే గుర్తుచేసుకొని ఉద్వేగానికి లోనయ్యారు.
గూఢచర్యం ఆరోపణలతో పాకిస్తాన్ జైల్లో ఉన్నభారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(49)కు పాక్ న్యాయస్థానం విధించిన మరణశిక్షణను నిలుపుదల చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో హరీశ్ వాదనలే కీలకం. సాధారణంగా అయితే కేసులు వాదించేందుకు హరీశ్ సాల్వే ఒక్కో రోజుకి రూ. 30 లక్షలను ఫీజుగా తీసుకుంటారని సమాచారం. కానీ ఈ కేసు వాదించడానికి కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నారు. పాక్ తరఫున బ్రిటన్‌కు చెందిన లాయర్ ఖురేషీ వాదనలు వినిపించారు. జాధవ్ కేసును వాదించేందుకు ఫీజుగా ఆయనకు రూ. 20 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇటీవల జాదవ్ ఉరిపై అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల సుష్మాస్వరాజ్ హర్షం వ్యక్తం చేశారు. భారత్‌కు దక్కిన విజయంగా అభివర్ణించారు. దీనిపై హరీష్ సాల్వేను ఆమె ప్రశంసించారు.
(చదవండి : ఉరి.. సరి కాదు)
Comments
Please login to add a commentAdd a comment